Modi | కశ్మీర్లో కాంగ్రెస్ పోటీ చేయరాదనే దుందుడుకు ప్రతిపాదన ఒకటి అప్పట్లో వచ్చింది. అదీ శక్తిమంతురాలైన నేతగా పేరుపొందిన ఇందిరాగాంధీ ముందుకు. ఆ సూచన చేసింది కశ్మీర్ కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు సయ్యద్ మీర్ కాశీం.
1983 తొలినాళ్లలో కాశీం ఇందిరతో కశ్మీర్ సమస్యపై వాదం వేసుకున్నారు. కశ్మీర్ వృద్ధ నేత షేక్ అబ్దుల్లా కన్ను మూశారు. ఈ నేపథ్యంలో వేర్పాటువాద ధోరణులను అరికట్టి, పాక్ అనుకూల శక్తులకు ముకుతాడు వేయాలంటే కశ్మీర్ లోయలో ఫరూక్ అబ్దుల్లాను బలపరచక తప్పదని ఆయన చెప్పారు. అవగాహన లేకనో, మరే ఇతర మరుగుపర్చిన కారణం వల్లనో కాశీం ఆ మాట అనలేదు. ఎందుకంటే కల్లోల కశ్మీర్‌కు అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకున్నది. కాంగ్రెస్ ఎన్నికల బరిలో ఉండటం వల్ల నేషనల్ కాన్ఫరెన్స్ బలహీనపడి భారత వ్యతిరేకులకు ఊతం లభిస్తుందని ఆయన ఉద్దేశం. ఇందిర-కాశీం వాగ్వాదం వారాల పాటు నడిచింది. ఇందిర అంతిమంగా ఆయన సూచనను కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నంతవరకు భారతదేశంలోని ఏ ప్రాంతంలోనూ పార్టీని ఎన్నికల పోటీ నుంచి తప్పించే పనిని చేయలేనని, చేయబోనని నిక్కచ్చిగా సమాధానం ఇచ్చారు.
ఆమె ఇచ్చిన సమాధానం ఎంత ఘాటుగా ఉందనేది అలా ఉంచితే అది భారత దేశాన్ని నయానా భయానా పాలించాలనుకునే ఏ పార్టీకైనా వర్తించే అక్షర సత్యమే. పార్లమెంటు ఉభయసభల్లో కాంగ్రెస్‌కు బలమైన మెజారిటీ ఉంది. అలాగే దేశంలోని పలు రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. అలాంటప్పుడు అంతటా మనమే ఉండాలన్న భావన ఆమెలో వేళ్లూనుకోవడంలో వింతేమీ లేదు. కొన్నాళ్ల తర్వాత అలీనోద్యమ శిఖరాగ్ర సభలో, ఆ తర్వాత కామన్వెల్త్ సభలో ప్రపంచ నేతలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నారామె. అంతటి ఘనమైన నేపథ్యంలో దేశంలోని మూలమూలనా తమ పార్టీ అస్తిత్వంలో ఉండాలని, తమ రాజకీయ-సైద్ధాంతిక విశ్వాసాలను ప్రచారంలోకి తేవాలని ఆమె కోరుకోవడం సహజమే.
పరిపాలనకు సహజంగా అనువైన పార్టీననే స్వీయభావన కాంగ్రెస్‌కు బలంగా ఉండేది. కేంద్రంలో, అనేక రాష్ర్టాల్లో అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీ నాయకత్వానికి చిన్నాచితకా పార్టీలను పోటీలో లేకుండా చేయడానికి, వాటిల్లోని నాయకులను ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకొనేందుకూ అవసరమైన వనరులు అందుబాటులో ఉండేవి.
సామ్రాజ్యంపై కేంద్రంలోని చక్రవర్తుల ప్రాబల్యానికి, రాష్ర్టాల రాజధానుల్లోని ప్రాంతీయ భాష, సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన మనోభావాలకు మధ్య అంతర్గతమైన ఉద్రిక్తత ఒకటి ఉండేది. అదే సమయంలో కేంద్రం దొరతనానికి, సమాఖ్య/ ప్రాంతీయ/ స్థానిక ఆకాంక్షలకు నడుమ సమతూకం పాటించడమే కేంద్ర ప్రభుత్వాలకు తప్పనిసరిగా అవసరమైన రాజనీతిజ్ఞతగానూ ఉండేది. ఇదంతా ఒకరోజు వ్యవహారం కాదు. నిరంతర ప్రక్రియ. ఎప్పుడూ పూర్తిగా పరిష్కారం కాదు. ఎప్పుడూ పూర్తిస్థాయిలో ఘనీభవించదు. ఢిల్లీ రాజకీయ నాయకత్వానికి జర్మన్లు ‘ఫింగర్ స్పిట్జ్ ఎంగెర్ ఫ్యూహల్’ అని పిలిచే తత్వం దండిగా అవసరం. వ్యూహకర్త తెలివైన అత్యుత్సాహాన్ని నివారించే, బుద్ధి కుశలతతో కూడిన నిర్ణయ సాధన సామర్థ్యం అని దాని అర్థం.
యునైటెడ్ ప్రంట్, ఎన్డీయే, యూపీయే ఇలా ప్రయోగం ఏదైనా సరైన భాగస్వామ్య పరిభాష మీదే దాని మనుగడ ఆధారపడి ఉంటుంది. భాగస్వామ్యం పట్ల అంకితభావం, గౌరవం, కీర్తి, ప్రోత్సాహం, రాజకీయ లాభాల పంపిణీకి సరైన విధానం దానికి ముఖ్యమైన అవసరం. భాగస్వాములందరూ సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉన్నంతవరకే సర్దుబాటు సాగుతుంది.
ఏతావాతా నరేంద్ర మోదీ రంగం మీదికి వచ్చారు. ఆయన నాయకత్వంలో బీజేపీ 2014లో, 2019లో.. రెండుసార్లు లోక్‌సభలో మెజారిటీ సాధించింది. నిజానికి ఆ పార్టీకి భాగస్వాముల అవసరం లేకుండింది. కానీ అఖిలభారత స్థాయి గుంపుగా చూపించుకోవాల్సిన రాజకీయ ఎత్తుగడలో భాగంగా కొనసాగించారు. కానీ క్రమంగా, అనివార్యంగా అది 1983 నాటి ఇందిర మానసిక స్థితికి చేరుకోక తప్పలేదు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ వంటి చోట్ల కూడా పెత్తనం చేయాలని బీజేపీ కోరుకుంటున్నది.
ప్రస్తుతం మోదీ బీజేపీ 2014కు ముందునుంచి కేంద్ర, సమాఖ్య విభాగాల మధ్య సహజీవనంతో కూడిన సర్దుబాటు సూత్రాలను పక్కనపెట్టాలని చూస్తున్నది. ఈ సూత్రాలను 2005లో జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ చక్కగా ఇలా వివరించారు: ప్రాంతీయ, ఉప ప్రాంతీయ అస్తిత్వాలు ముందుకువస్తున్నాయి. 60 ఏండ్ల కిందట ఇది అనూహ్యమైన విషయం. మనది బహుళత్వ సమాజం, బహుళత్వ రాజకీయ వ్యవస్థ. ప్రాంతీయ, ఉప ప్రాంతీయ అస్తిత్వాలకు మన దేశంలో తగినంత వెసులుబాటు ఉన్నది. మన జాతీయతకు ఇవి ప్రతికూలమైనవి కావు. ఈ ప్రాంతీయ అస్తిత్వాల పునర్వికాసాన్ని మనమంతా ఆహ్వానించాలి. ఏకరూపత కన్నా సామరస్యంపై మనం దృష్టి ఎక్కువగా నిలపాలి. అదే సమయంలో ఈ స్థానిక అస్తిత్వాలు విచ్ఛిన్నవాదం వైపు, వేర్పాటువాదం వైపు వెళ్లకుండా మన వైవిధ్య భరితమైన బహుళత్వంలో సామరస్య పూర్వకంగా మమేకమయ్యేలా చూడాలి.
ప్రస్తుత కాలంలో మోదీ గుంపు ఈ తరహా సర్దుబాటు సూత్రాలను జాతీయ బలహీనతగా, చేతకాని తనంగా చూస్తున్నది. కానీ గుజరాతీ అస్తిత్వం పేరిట మోదీ దిగేందుకు కారణమైనది జాతీయతను నిర్వచించిన ఈ తరహా విజ్ఞత, సమతూక వైఖరులేననేది మరచిపోరాదు.
మన్మోహన్సింగ్ వైఖరి కల్పించిన వెసులుబాటు అనేది లేకపోతే మోదీ చరిత్రలో కేవలం ఓ అధోజ్ఞాపికగా మాత్రమే మిగిలిపోయేవారు.
అలాంటి విజ్ఞతను మోదీ బీజేపీ ఇప్పుడు పక్కనపెట్టింది. నాగపూర్ ప్రేరేపిత హిందీ, హిందూ, హిందూస్థాన్ అనే ఆధిపత్య ఏకీకరకణ విధానాన్ని అమలులోకి తేవాలని చూస్తున్నది. మోదీ వ్యక్తిత్వాన్ని చిలవలు పలవలుగా పెంచేసి ఆకాశానికి ఎత్తేశారు. భారతదేశ మహోన్నత నేతగా ప్రచారం చేసే తంతు ఎప్పటినుంచో అమలవుతున్నది. ఈ ఎదురులేని మోదీ ప్రచార పటాటోపంలో కులం, వర్గం, ప్రాంతం లేదా మతానికి చోటులేదు. ఎందుకంటే మోదీ ఆకర్షణీయతకు వాటితో నిమిత్తం లేదు. ఈ విధానంలోని అంతర్గత తర్కం ప్రకారం బీజేపీ ప్రతి గల్లీలో, బస్తీలో, పేటలో బీజేపీయేతర శక్తులను, మనోభావాలను తరిమికొట్టేందుకు దూకుడుగా దూసుకుపోవాలి.
ఇంకా కొన్ని చిన్నాచితకా పార్టీలు బీజేపీతో అంటకాగాలని చూస్తుండటం అర్థమయ్యే విషయం కానప్పటికీ వాస్తవం. మోదీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏదో లబ్ధి దొరుకుతుందని అవి నమ్ముతున్నాయి. తమ తమ ప్రాంతీయ లెక్కలు, ఒత్తిడుల కారణంగా చిరాగ్ పాశ్వాన్లు, దేవేగౌడలు మోదీ బీజేపీతో బేరసారాలాడి గట్టెక్కాలని చూస్తున్నాయి. బీజేపీ చాణక్యులు వ్యూహాత్మకంగా ఈ తరహా పొత్తులతో విపక్షాలకు చెందిన ఆ కాసిన్ని ఓట్లన్నా లాగేసుకున్నట్టు అవుతుందని అనుకోవడంలో తప్పు లేదు. పైగా మిత్రపక్షాలు ఎన్ని ఎక్కువుంటే అంతమంచిది. విశ్వగురు వెనకాల ఇంత సువిశాలమైన రాజకీయ అభిప్రాయాలు మోహరించాయని చెప్పుకొనేందుకు వీలుంటుంది.
రాజకీయ విజ్ఞతకు, నైతికతకు జాతీయ ఎన్నికల సందర్భం అంత అనువైన సమయం కాదనేది నిజమే. సిగ్గూ ఎగ్గూ లేని అవకాశవాదాల, వాగాడంబరాలే ఈ సమయంలో రాజ్యమేలుతాయి. ఇదీ భారత్‌లోని పాత చింతకాయ లాంటి, చెడు వ్యవస్థ. ప్రస్తుతం ఎన్డీయే పట్ల బీజేపీ దృక్పథం మనకందరికీ తెలిసిన పోంజీ, అంటే, మోసకారుల గొలుసుకట్టు వ్యాపారంలా ఉంది. నేను నీ జేబు కొడతా.. నీవు నీ కిందివాడి జేబు కత్తిరించు అనేదే దీనివెనుక ఉన్న సూత్రం. ఈ గజి బిజి వ్యాపారంలో కొత్తది, మహోన్నతమైనది అంటూ ఏమీ లేదు. కేవలం నిజాయితీ లేనితనానికి అందమైన మెరుగులద్దడం. అంతకుమించి ఏమీ లేదు. ఇదే మన నయాభారతం. మరి స్వాగతిద్దామా?
(‘ది వైర్’ సౌజన్యంతో)(అనువాదం: తుమ్మలపల్లి రఘురాములు)
-హరీశ్ ఖరే