తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి మీద కొద్దీ రోజుల కిందట సుప్రీం కోర్టు ఒక నిర్దిష్టమైన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలో ఉన్న సందిగ్ధతకు తెరదించిన తీర్పు ఇది. అందుకే ఇది విశిష్టమైనదంటున్నారు అందరూ. ఈ తీర్పు మీద దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ దుమారం రేపింది ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్. ఉప రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన పదవి. అంటే అది క్రియాశీల రాజకీయాలకు అతీతమైనది. రాజ్యాంగ బద్ధమైన పదవులలో ఉన్నవారు ఇలా కోర్టుల మీద విరుచుకు పడటం దురదృష్టకర పరిణామం. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో పీఏ సంగ్మా లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడు న్యాయ క్రియాశీలత మీద విరుచుకుపడ్డారు.
అనవసరమైన విషయాల మీద మాట్లాడటం వల్ల ఏమైనా ఇబ్బంది వస్తే వీరు చేపట్టిన రాజ్యాంగ బద్ధమైన పదవులు కాపాడుతాయని నమ్మకం. పెద్దలు లోపాయకారిగా వీరి చేత మాట్లాడించటం మరొక కారణం. అయితే, రాజకీయ పదవుల్లో ఉన్న ఎంపీల వంటివారు కూడా అడ్డూఅదుపు లేకుండా న్యాయ వ్యవస్థ మీద దూకుడుగా మాట్లాడటం సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో మనం మొదటిసారి చూస్తున్నాం. బీజేపీకి చెందిన నిషికాంత్ దుబే తీరు ఇందుకు నిదర్శనం. దుబే వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ ప్రకటించినప్పటికీ, అది నమ్మశక్యంగా లేదు.
గతంలో అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యవహారశైలి మీద కూడా కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది; శాసనసభ రూపొందించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా కూర్చున్న విషయం మీద. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ చేసిన తప్పే అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా చేశారు. ఆ విషయాన్ని మనం ఈ వేదికలో చర్చించుకున్న సంగతి ‘నమస్తే తెలంగాణ’ పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు కోర్టు తగిన రీతిలో స్పందించలేదు. ఇప్పుడైనా స్పందించినందుకు న్యాయవ్యవస్థను అభినందించాలి. అయితే, ఎందుకోగానీ తమిళనాడు గవర్నర్‌ను కోర్టు అభిశంసించటానికి వెనుకాడింది. ఆయన స్టాలిన్ ప్రభుత్వంతో చేస్తున్న పోరాటాన్ని చూసీ చూడనట్టు ఊరుకుంది కానీ, గవర్నర్ దురుద్దేశాన్ని కోర్టు ఎండగట్టలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపార్టీకి ప్రతికూల పార్టీలు రాష్ర్టాల్లో నడుపుతున్న ప్రభుత్వాలకు గవర్నర్ ద్వారా ఇబ్బంది కలిగించటం ఈ నాటిది కాదు. కాంగ్రెస్ పార్టీ దీనికి తెరలేపింది. బీజేపీ ఈ చోద్యాన్ని ఒక కళగా మార్చింది. తెలంగాణ, కేరళ, తమిళనాడుల్లో జరుగుతున్నది మనం చూస్తున్నాం కదా. ఎవరిని గవర్నర్‌గా నియమించాలనే దానిమీద స్పష్టత లేకపోవటం ఒక బలమైన కారణం ఈ చోద్యానికి. గవర్నర్ వ్యవస్థను సంస్కరించటానికి ఏ పార్టీ ముందుకురావటం లేదు. ఈ వ్యవస్థతో ఇబ్బందులు పడిన తెలుగుదేశంతో సహా!
మన రాజ్యాంగంలో కొన్ని సందిగ్ధమైన మాటలున్న సంగతి వాస్తవం. ఉదాహరణకు వీలైనంత త్వరగా, సరైన రీతిలో లాంటివి. గవర్నర్ విషయంలో ఈ సందిగ్ధ పదాలు బాగా ప్రస్ఫుటంగా కనపడుతాయి. రాజ్యాంగంలోని 200 అధికరణం ప్రకారం శాసనసభ ఒక బిల్లును రూపొందించిన తర్వాత ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపాలి. తన వద్దకు వచ్చిన బిల్లు మీద గవర్నర్ మూడు విధాలుగా స్పందించవచ్చు. ఒకటి ఆమోదాన్ని తెలపటం, రెండు ఆమోదించటం లేదని తెలపటం, మూడు రాష్ట్రపతి పరిశీలనకు పంపుతానని తెలపటం, ఆమోదం తెలుపని పక్షంలో బిల్లును శాసన సభకు ‘వీలైనంత త్వరగా వెనక్కి పంపాలి తనకున్న అనుమానాలు, సందేహాలను తెలుపుతూ. ‘వీలైనంత త్వరగా’ అంటే ఎప్పుడు? కొందరు మూడు నెలలు తీసుకోవచ్చు, కొందరు మూడేండ్లు తీసుకోవచ్చు. ఇక్కడ రాజ్యాంగం స్పష్టంగా చెప్పలేదు. ఇది మన రాజ్యాంగంలోని బలహీనత.
మన రాజ్యాంగ నిర్మాతలు భావితరాల రాజకీయం ఏ రూపం దాల్చుతుందో ఆలోచించలేకపోయారు. రాజ్యాంగ నిర్మాతల్లో ఎక్కువమంది దేశభక్తి, దృఢచిత్తం మూర్తీభవించిన స్వాతంత్య్ర సమరయోధులు. కుటిల రాజకీయాలను వారు ఊహించలేకపోయారు. ఏ దేశ రాజ్యాంగమైనా ఒక ప్రాథమిక చట్టం. రాజ్యవ్యవస్థ ఏ విధంగా సాగాలనే దాని మీద కొన్ని విశాలమైన సూత్రాలను పొందుపరుచుతుందేకానీ, రోజువారీ వ్యవహారాలు ఎలా నడపాలనేది ఏ రాజ్యాంగమూ చెప్పదు. అది ప్రభుత్వాన్ని నడిపేవారు నిర్ణయించవలసిన పని. రాజ్యాంగ నిర్మాతల ఉన్నత ఆలోచనే ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నది. నేటి రాజకీయ నేతలు చట్టాన్ని చాలా సంకుచిత కోణంలో, మరీ ముఖ్యంగా రాజకీయంగా ప్రయోజనం లభించే కోణంలో చూస్తున్నారు. అది గవర్నర్లు కానివ్వండి, శాసనసభ స్పీకరు కానివ్వండి. ఉపరాష్ట్రపతి కూడా ఈ కోవలోకి రావటం దురదృష్టం.
సుప్రీంకోర్టు 2025, ఏప్రిల్ 8వ తేదీ తీర్పులో ఈ సందిగ్ధానికి తెరదించే ప్రయత్నం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపే విషయంలో నిర్ణయం తీసుకోవటానికి కాలపరిమితి విధించింది. ఇష్టం వచ్చినంత సేపు బిల్లు మీద కూర్చోవటం కాదు, ఏ విషయమైనా నిర్దిష్ట కాలంలో నిర్ణయించాలని చెప్పింది సుప్రీంకోర్టు. రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్, రాష్ట్రపతి కాలయాపన చేసే పనికి స్వస్తి పలికింది కోర్టు. ఇది శాసన సభాపతికి కూడా అన్వయిస్తుందనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. గవర్నర్ కన్నా పై స్థానంలో లేదు కదా స్పీకర్ పదవి. నిర్ణయం తీసుకోవటంలో గవర్నర్‌కు, రాష్ట్రపతికి కాలపరిమితి ఉన్నప్పుడు, స్పీకర్లకు కూడా సహజంగానే కాలపరిమితి ఉంటుంది కదా!
మరి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎందుకు దుమారం లేపారు ఈ విషయం మీద? అది ఆయనకు సంబంధించిన విషయం కాదు. ఒకవేళ గవర్నరు లేక రాష్ట్రపతి స్పందించినా అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి నిశ్శబ్దంగా ఉన్నాడు. రాష్ట్రపతి భవనం కూడా నిశ్శబ్దంగానే ఉన్నది. మరి ఈ ధన్‌ఖఢ్ గారికి వచ్చిన సమస్య ఏమిటి? ఆయన ఎందుకు ఢమరుకం మోగించారు? రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, రాజకీయం చెయ్యవద్దు అని కోర్టు చెప్పటాన్ని రాజకీయ నేతలు సహించలేకపోతున్నారు.
వారు నేరుగా బయటపడలేక, బయటపడితే అది మరో దుమారానికి దారితీస్తుంది. కాబట్టి, మరొకరి భుజం మీద తుపాకీ పెట్టి పేల్చటం లాంటిది ఇది. కర్ర విరగకూడదు, పాము చావ కూడదు! కానీ, కొడుతూనే ఉండాలి. మరి వీరు ఎందుకు తమ బాజాలను అరువు ఇస్తున్నారు. భవిషత్తు రాజకీయ ప్రయోజనం కోసం. ఏం సందేహం లేదు!
జగదీప్ ధన్‌ఖఢ్ గనుక కోర్టులు కూడా కేసులు పరిష్కరించటంలో కాలయాపన చేస్తున్నవి కదా, మరి కేసులు పరిష్కరించే విషయంలో కాలపరిమితి ఎందుకు విధించటం లేదని అడిగినట్లయితే గొప్ప హీరో అయ్యేవాడు. కానీ, తనది కాని పనిని నెత్తిన వేసుకొని అభాసు పాలయ్యాడు. మరి అన్ని హద్దులూ దాటి కోర్టును దూషించిన నిషికాంత్ దుబే పరిస్థితి ఏమిటి? కోర్టు తీర్పులు అరాచకానికి దారితీస్తాయన్నాడు, కోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్నాడు. మరి ఆయన మీద ఏం చర్యలుండవా? అదే సామాన్య మనిషి అంటే కంటెంప్ట్ కింద కోర్టు కటకటాల వెనక్కి నెట్టదా? ఎంపీకి ఒక నిబంధన? ఎంపీని ఎన్నుకునే వారికి మరొక నిబంధనా? ఇదేనా చట్టం అందరికీ సమానం అంటే? దుబేని కోర్టు ఎందుకు ఉపేక్షిస్తుంది?
ఇక తమిళనాడు గవర్నర్ విషయానికి వస్తే కోర్టు ఆయన్ని అభిశంసించక పోయినా తప్పుపట్టిన విషయం అందరికీ తెలుసు ఒక్క ఆయనకు తప్ప. ఆయన వ్యవహారశైలి ‘మాల ఫైడ్’ అని అనకపోయినా ‘బోనఫైడ్’ కాదూ అని కోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా ఆయన పదవి నుంచి వైదొలగలేదు. కేంద్రంలో బీజేపీ పెద్దలు కూడా ఆయన్ని వైదొలగమని చెప్పలేదు. కనీసం రాష్ట్రపతి అన్నా ఆయన్ని పదవినుంచి తప్పుకోమని చెప్పాలి కదా! అదీ లేదు. ఈ పరిస్థితిలో సామాన్య మనిషికి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి పట్ల ఏం గౌరవం ఉంటుంది? రాజ్యాంగం పట్ల కూడా గౌరవం సన్నగిల్లే ప్రమాదం ఉన్నది కదా! ఇవే ఈ వ్యాసం లేవనెత్తుతున్న కీలక ప్రశ్నలు. ఇవి కీలక ప్రశ్నలే కదా! కాదంటారా?