కొన్ని కొన్ని ఘటనలు సుదూర పర్యవసానాలకు దారితీసే నిర్ణయాలకు కారణమవుతాయి. నిరుడు దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడికి గురై ఓ చిన్నారి చనిపోయిన ఘటన అలాంటిదే. ఆ విషాద ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా ‘సిటీ హౌండెడ్ బై స్ట్రేస్, కిడ్స్ పే ప్రైస్’ (నగరంలో వీధికుక్కల స్వైరవిహారం, మూల్యం చెల్లిస్తున్న చిన్నారులు) అనే శీర్షికతో ప్రచురించిన ఓ కథనం ఎంతోమందిని కదిలించింది. అందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. 2025 జూలై 28న ప్రచురితమైన ఆ కథనంతో చలించిన జస్టిస్ పార్ధీవాలా, జస్టిస్ మహదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీధిశునకాల సమస్య పరిష్కారానికి సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ చొరవ సుదీర్ఘకాలంగా దేశం ఎదుర్కొంటున్న వీధి శునకాల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేయటం గమనార్హం. మంగళవారం నాటి సంచలన తీర్పుతో ఈ ప్రయాస ఓ కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. వీధికుక్కలను స్టెరిలైజ్ చేసి, షెల్టర్లకు తరలించాలనే విషయమై ఎలాంటి రాజీ కుదరదని స్పష్టం చేసిన ధర్మాసనం ఇదివరకటి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అపీళ్లన్నింటినీ కొట్టివేసింది.
సర్వోన్నత న్యాయస్థానం తుదితీర్పులో పలు అంశాలపై స్పష్టతనిచ్చింది. 2001లో ప్రవేశపెట్టిన నియంత్రణ చట్టాన్ని ఏండ్ల తరబడి అరకొరగా అమలు చేయటం వల్ల వీధికుక్కల సమ స్య పరాకాష్ఠకు చేరుకున్నదని, ఇందుకు మౌలిక వసతులు కల్పించి, యంత్రాంగాన్ని పటిష్టపరచకపోవడమే కారణమని మండిపడింది. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని ఎత్తిచూపింది. జంతు హక్కుల కన్నా ప్రజాభద్రత, మానవ జీవితానికే ప్రాముఖ్యం ఇవ్వక తప్పదన్నది అందులో కీలకమైనది. రాజ్యాంగం 21వ అధికరణంలో పొందుపర్చిన జీవించే హక్కులో బహిరంగ ప్రదేశాల్లో కుక్కల భయం లేకుండా సంచరించడమూ ఉంటుందని నొక్కిచెప్పింది. 2025 నవంబర్ 7న జారీ చేసిన ఆదేశాలను సవరించే ప్రసక్తే లేదని నొక్కిచెప్తూ మూడు అంశాలకు సంబంధించి విస్తృతంగా వివరణలు ఇచ్చింది. అందులో మొదటిది, దవాఖానలు, విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి పబ్లిక్ స్థలాల నుంచి సేకరించిన వీధికుక్కలను స్టెరిలైజ్ చేసిన తర్వాత షెల్టర్లకు పంపాలి తప్ప, మళ్లీ అవే ప్రదేశాల్లో వాటిని విడిచిపెట్టటం కుదరదు. రెండు, రేబిస్ సోకిన, నయంకాని వ్యాధులతో బాధపడే లేదా ప్రమాదకరమైన రీతిలో దాడులకు తెగబడే కుక్కలకు మానవీయమైన రీతిలో కారుణ్య మరణాన్ని ప్రసాదించాలి. అందుకు జంతువుల కుటుంబ నియంత్రణ (ఏబీసీ) నిబంధనలు, జీవకారుణ్య చట్టం నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలి. మూడు, బహిరంగంగా వీధుల్లో కుక్కలకు తిండిపెట్టడం పూర్తిగా నిషేధం. అందుకు బదులుగా మునిసిపల్ అధికారులు కుక్కల కోసం ప్రత్యేక ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి నిర్వహించాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోర్టు తన ఆదేశాల అమలుపై ప్రత్యేకించి కఠినమైన సూచనలు చేయటం గమనార్హం. కుక్కల స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కేంద్రాలను మొక్కుబడిగా ఏర్పాటు చేయటం ఇక ఎంతమాత్రం కుదరదు. జిల్లాకు ఒక్కటైనా పూర్తిస్థాయి కేంద్రం ఉండాల్సిందే. 5 వేల కుక్కలు ఒకేచోట ఉండేలా షెల్టర్లు నిర్మించాలని, దీనిపై 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేయటమే అందుకు ఉదాహరణ. సాధారణంగా కోర్టు ఆదేశాల అమలు అంటే ధిక్కరణ చర్యల భయం మెడమీద కత్తిలా వేలాడుతుంటుంది. అయితే కోర్టు ఆదేశాలను సదుద్దేశాలతో విధులు నిర్వర్తించే అధికారులకు క్రిమినల్ చర్యల నుంచి రక్షణ కల్పించటం విశేషం. ఇది వారిలో అనవసరమైన భయాందోళనలను తగ్గిస్తుందని చెప్పవచ్చు. వీధికుక్కల సమస్యపై జారీచేసిన ఆదేశాల అమలు పర్యవేక్షణను హైకోర్టులకు అప్పగించటం మరో కీలక నిర్ణయం. ఇటీవలి చరిత్రలో న్యాయవ్యవస్థ ఇంతటి చొరవతో వ్యవహరించిన సమస్య మరొకటి లేదు. కోర్టు తీర్పును ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాలపై ఉన్నదని చెప్పక తప్పదు. వీధికుక్కల దాడిలో గాయపడి, ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కోసమైనా దృఢదీక్షతో నడుం బిగించక తప్పదు.