ఎన్నిచెప్పినా.. మనదింకా, ఇంకా పురుషాధిక్య సమాజమే, ఇప్పటికీ. కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై పురుషులే పెత్తనం చెలాయిస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనాపరులైనా మనీ పర్సు మగవాని చేతుల్లోనే ఉంటుంది. ఇక సంపాదన లేని గృహిణులైతే అస్వతంత్రులుగానే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ, ‘ఈ ఆర్థిక వివక్ష ఇంకానా, ఇకపై చెల్లద’ని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బుధవారం నాటి తీర్పు ఏ రకంగా చూసినా చరిత్రాత్మకమైందేనని చెప్పాలి. నిజానికి తీర్పు వెలువరించింది ఓ ముస్లిం మహిళ మనోవర్తికి సంబంధించింది. కానీ, సర్వోన్నత న్యాయస్థానం డబ్బు వ్యవహారాల్లో భార్యాభర్తల సంబంధాల్లో సుదూర పరిణామాలకు దారితీసే వ్యాఖ్యలు చేసింది. ‘మతమేదైనా విడాకులు పొందిన మహిళకు ఆర్థిక రక్షణ కల్పించాల్సిందే’ అనేది సుప్రీంకోర్టు మూల తీర్పు సారాంశం. విడాకులు పొందిన మహిళకు భరణం చెల్లించాలని సూచించే సీఆర్పీసీలోని 125వ సెక్షన్ మతాలతో ప్రమేయం లేకుండా అందరికీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
అయితే అంతటితో వదిలిపెట్టకుండా వివాహం లోపలా, వెలుపలా మహిళకు సంపూర్ణ ఆర్థిక హక్కులు కల్పించాలని చేసిన వ్యాఖ్యలు కీలకమైనవి. ‘నేను మగవాణ్ని, పైగా సంపాదిస్తున్నాను, కనుక డబ్బుకు సంబంధించి నా మాటే చెల్లుబాటు కావాల’నే ఆలోచన మారాలని సుప్రీంకోర్టు హితవు చెప్పింది. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో భార్యకు సమాన భాగస్వామ్యం ఉంటుంది. కుటుంబం కోసం, పిల్లల కోసం ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమయ్యే భార్య విషయంలో భర్త ఆలోచనా ధోరణి సమూలంగా మారాలి. ఆమె త్యాగాన్ని గుర్తించి ఆర్థిక సాధికారత కల్పించాల్సిన సమయం వచ్చింది. అందుకు ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం, ఏటీఎం పిన్ పంచుకోవడం వంటివి అవసరమని కోర్టు అభిప్రాయపడింది. మారిపోయిన ఆలోచనా ధోరణిని బట్టి ఈ తరహా మార్పులు ఈ సరికే చాలామంది అమలు చేస్తూ ఉండవచ్చు. సుప్రీంకోర్టు సూచనలు అలా అమలుచేయని వారి గురించే.
ఇక వివాహ బంధం విచ్ఛిన్నమైపోయి విడాకులు తీసుకున్నాక భరణం లేదా మనోవర్తి సమస్య వస్తుంది. ఇక్కడే మతాలవారీగా తలోదారి కనిపిస్తుంది. కానీ, సుప్రీంకోర్టు అలా కుదరదని చెప్పింది. భరణం అనేది ఏదో దానంగా ఇచ్చేది కాదనీ, అది స్త్రీల హక్కు అనీ సర్వోన్నత న్యాయస్థానం నొక్కిచెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా షాబానో కేసులో 1985 నాటి సుప్రీంకోర్టు తీర్పు, తదనంతరం 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తెచ్చిన ముస్లిం మహిళల మనోవర్తి చట్టం గురించి తప్పకుండా ప్రస్తావించుకోవాలి. మతంతో సంబంధం లేకుండా విడాకులు పొందిన మహిళలందరికీ 125 సెక్షన్ కింద భరణం హక్కు ఉంటుందని ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దేశంలోని ప్రగతివాదులు ఆ తీర్పుపై హర్షామోదాలు వ్యక్తం చేశారు. కానీ, ఆ తీర్పును నీరుగారుస్తూ అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం చట్టం తేవడం వివాదాస్పదమైంది. ముస్లింల బుజ్జగింపు రాజకీయాల విషయం వస్తే ఈ చట్టాన్ని ఉటంకించడం సర్వసాధారణమైంది. నిన్నటి తీర్పుతో ఆ మార్పు వల్ల ఏర్పడిన వివక్షను సరిదిద్దినట్టయింది!