రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో తెరమీదకు తెచ్చిన రైతు డిస్కమ్ వెనుక ఇలాంటి ప్రైవేటీకరణ కుట్ర తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, జలమండలి వంటి ఉచిత కనెక్షన్లను వేరు చేసి మూడో డిస్కమ్ ఏర్పాటు చేస్తారట. అంటే ఇది లాభదాయకం కాని కనెక్షన్లను, లాభదాయక కనెక్షన్లను వేరు చేసి ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయడమే. ఈ డిస్కమ్ ఏర్పాటుతో ఇటు రైతులకు, అటు ఉద్యోగులకూ తీరని నష్టం జరిగే అవకాశం ఉంటుందని విద్యుత్తురంగ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నట్టు కేవలం రెండు వేల మంది సిబ్బందితో రైతు డిస్కమ్ 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లను, 5.5 లక్షల ట్రాన్స్ఫార్మర్లను నిర్వహించడం సాధ్యం కాదు. వ్యవసాయ, ప్రజావసరాల కనెక్షన్లను అధోగతి పాలుచేసే ఈ కుట్ర వెనుక లాభసాటి ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లను ప్రైవేటుకు కట్టబెట్టాలనే ఆలోచన ఉందనడంలో సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు విద్యుత్తు పరిస్థితి దీనాతిదీనంగా ఉండేది. ఈ గోసను తరిమి కొట్టేందుకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేశారు. ఛత్తీస్‌గఢ్ వంటి ఇరుగుపొరుగు రాష్ర్టాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి తాత్కాలిక అవసరాలను తీర్చారు. మరోవైపు విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యాన్ని ఓ ప్రణాళిక ప్రకారం విస్తరించుకుంటూ పోయారు. సుమారుగా రూ.97 వేల కోట్ల పెట్టుబడులతో విద్యుత్తు రంగాన్ని విస్తరించారు.
విద్యుచ్ఛక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 18,567 మెగావాట్లకు పెంచారు. తెలంగాణ ప్రజల తలసరి విద్యుత్తు వినియోగం జాతీయ సగటు కంటే 70 శాతం అధికంగా ఉండటం విశేషం. 2014లో అది 1,110 యూనిట్లు ఉండగా 2021 నాటికి 2012 యూనిట్లకు, 2023-24 నాటికి 2508 యూనిట్లకు పెరిగింది. విద్యుత్తు రంగంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా కేసీఆర్ 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసిరైతుల గోస తీర్చారు. పరిశ్రమలకు పవర్హాలిడేల బెడద లేకుండా చేశారు.
దేశంలోవిద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ చాలా రోజులుగా భారీ ఎత్తుగడలు వేస్తున్నది. రేవుల్ని, విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తూ దోస్తులకు లాభాలు దోచిపెడుతున్నది చాలక ఇప్పుడు ప్రజల నిత్యావసరమైన విద్యుత్తును ధారపోయడానికి తెగించింది. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నది. డిస్కమ్‌లతో చెడుగుడు ఆడుతూ క్రాస్ సబ్సిడీలకు అంతిమంగా మంగళం పాడాలనేది మోదీ సర్కారు వ్యూహం. బడేభాయ్ బాటలో నడుస్తున్న చోటేభాయ్ ప్రైవేటీకరణలో రెండాకులు ఎక్కువే చదివినట్టు కనిపిస్తున్నది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలను లాభాపేక్ష తప్ప ప్రజాహితం ఆలోచించని కంపెనీలకు కట్టబెడితే విద్యుత్తు వాణిజ్య సరుకుగా మారుతుంది. ఉచిత విద్యుత్తు, సబ్సిడీలు ఆగమైపోవడం ఖాయం. విద్యుత్తు ప్రైవేటీకరణకు సర్కార్ తెగిస్తే ఉద్యమ బాట పడుతామని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. నిజానికి ఈ ఆరోవేలు లాంటి మూడో డిస్కమ్‌పై రైతులు, సామాన్య ప్రజలకు అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత సర్కారుపై ఉన్నదని చెప్పక తప్పదు.