‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్నట్టుంది తెలంగాణ ప్రజల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు నట్టేట మునిగారు. మార్పు.. మార్పు.. అని ఊదరగొట్టిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత నిజంగానే మార్పు తీసుకొచ్చింది. కానీ, అది ప్రజలు కోరుకున్న మార్పు మాత్రం కానేకాదు.
తెలంగాణ ప్రజలను తొమ్మిదిన్నరేండ్ల పాటు కంటికిరెప్పలా కాపాడుకున్న కేసీఆర్ మార్కు పాలనకు తిలోదకాలిచ్చిన కాంగ్రెస్.. పాతకాలపు హస్తం మార్కు పాలనను మళ్లీ ప్రజలకు రుచి చూపిస్తున్నది. కేసీఆర్ మీద అక్కసు ఉంటే ఉండొచ్చు గానీ, ఆయన చేపట్టిన కార్యక్రమాలపై అక్కసు చూపించడం కాంగ్రెస్ పాలకుల వెర్రితనమే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నం, జయ జయహే తెలంగాణ గీతంలో మార్పులు చేయడాన్ని చూసి.. ‘గీళ్లు గీ మార్పు కోసమే అధికారంలోకి వచ్చారా?’ అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పాలకులెవరైనా తమ గుర్తులను భవిష్యత్తు తరాలకు అందిస్తారు. వారి గుర్తుగా శిలాశాసనాలు, గుమ్మటాలు, కోటలు, చిహ్నాలను ఏర్పాటు చేసుకుంటారు. తర్వాతి తరాలవారు వాటినే జ్ఞాపకాలుగా చేసుకొని, ఆదర్శంగా తీసుకొని పాలన సాగిస్తారు. ఆ కోవలోనివే కళాతోరణం, చార్మినార్. నాటి తెలంగాణ కళా వైభవానికి గుర్తుగానే కేసీఆర్ సర్కార్ వాటికి అధికారిక చిహ్నంలో చోటు కల్పించింది. కేసీఆర్ కూడా తన గుర్తులుగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నవాటిని తొలగిస్తూ అపహాస్యం పాలవుతున్నారు.
పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కొంత మందే ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి అరుదైన నాయకుడే కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడమే కాకుండా, సంక్షేమ తెలంగాణను మన కండ్లముందే సాక్షాత్కరింపజేశారాయన. కేసీఆర్ హయాంలో జరిగిన తెలంగాణ అభివృద్ధిని యావత్ దేశం కీర్తిస్తుంటే.. కాంగ్రెస్ పాలకులు మాత్రం గోరంతను కొండంతగా చిత్రీకరిస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినప్పటికీ తెలంగాణలో 70 ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నరేండ్లలో జరిగిందన్నది మాత్రం వాస్తవం.
మరోవైపు కాంగ్రెస్ ఆరు నెలల పాలనలోనే రాష్ట్రం ఆగమాగమైంది. ఉమ్మడి పాలనలో ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ తెలంగాణను చుట్టుముడుతున్నాయి. మరీ ముఖ్యంగా రైతుల బాధలు వర్ణనాతీతం. మొన్నటివరకు వడ్లు అమ్ముకునేందుకు నానా తిప్పలు పడ్డ రైతన్నలు ఇప్పుడు విత్తనాల కోసం రోడ్కెక్కాల్సిన దుస్థితి వచ్చింది. గత తొమ్మిదిన్నరేండ్లలో ఎన్నడూ కానరాని చెప్పుల లైన్లు మళ్లీ దర్శనమిస్తుండటం దురదృష్టకరం. ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కోసం బారులుతీరిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషం. కాంగ్రెస్ పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. ఏదైనా అంటే ఖజానా ఖాళీ అని అంటారు. మరి కేసీఆర్ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా?
కాంగ్రెస్ పాలనలో రైతుబంధు అటకెక్కింది. రైతు భరోసా ఇవ్వనే లేదు. యాసంగి సీజన్ రైతుబంధు పైసలను నిన్నమొన్నటి వరకు ముక్కుతూ ములుగుతూ ఇచ్చారు. ఇక వానాకాలం రైతుబంధు ఎప్పుడు ఇస్తారో తెల్వదు. రూ.2 లక్షల రుణమాఫీ సంగతి సరేసరి.
వరికి బోనస్‌పై మాట మార్చేశారు. సన్న వడ్లను ఎక్కువగా వానాకాలంలోనే సాగు చేస్తారు. దానికి చీడపీడల బెడద ఎక్కువ. అందుకే తిండి గింజల కోసమే ఆ రకాన్ని రైతులు సాగు చేస్తారు. పైగా సన్న వడ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. దాంతో రేటు ఎక్కువే పలుకుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్‌తో రైతులకు ఒరిగేదేమీ లేదనేది సుస్పష్టం.
ఆడబిడ్డ పెండ్లికి కేసీఆర్ ఇచ్చే రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ నాయకులు చేతులు ఎత్తేశారు. తులం బంగారం సంగతేమో కాని లక్ష అయినా ఇవ్వాలని ఆడబిడ్డల తల్లిదండ్రులు వేడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఊసే లేదు. విద్య, వైద్యం పడకేశాయి. వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించి.. నేడు డీడీలను వాపస్ ఇస్తున్నారు.
సమైక్యాంధ్ర పాలనలో కరవును తాళలేక వలసబాట పట్టిన రైతన్నలు కేసీఆర్ హయాంలో వాపస్ వచ్చారు. వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉన్నారు. కానీ, నేడు మళ్లీ కరెంటు కష్టాలు మొదలయ్యాయి. వలసలు షురూ అయ్యాయి. ఆరు మాసాల్లోనే ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకుంటున్నారు. రైతులతో సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్నారు. గడీల పాలన, దొరల పాలన, మద్యం ఏరులై పారుతుంది.. అంటూ ఊదరగొట్టిన యూట్యూబ్ చానళ్ల దుష్ప్రచారాన్ని ప్రజలు నేడు అసహ్యించుకుంటున్నారు.
‘ఏం చేశారో, ఎలా చేశారో తెలియదు కానీ, కేసీఆర్ ఉన్నన్ని రోజులు కరెంటు, తాగు, సాగునీటికి కరవు లేదు. పింఛన్ ఆగలేదు. పంట వేయకముందే రైతుబంధు ఇచ్చారు. గరీబోళ్లను కడుపుల పెట్టుకొని చూసుకున్నారు. తొమ్మిదిన్నరేండ్లు కష్టమన్నదే తెల్వకుండా ఎంతో సంతోషంగా ఉన్నాం. గీ రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే నమ్మి ఓట్లేసినం. ఆగమైపోయాం’ అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు వాపోతున్నారు. కేసీఆర్‌ను తల్సుకుంటున్నారు.
– జీడిపల్లి రాంరెడ్డి
96666 80051