డిజిటల్ సాక్షరత గురించి, దాని ప్రాముఖ్యం గురించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల తరచూ మాట్లాడుతున్నారు. వర్తమానంలో ఈ అంశం అత్యంత కీలకమైనది. ఆ దిశగా ప్రభుత్వాలూ, వ్యక్తులూ, విద్యావేతలూ ఆలోచించాల్సి ఉంది. ‘చీకటికి ఉనికి లేదు/ వెలుతురు క్షీణించడమే చీకటి’.. అందుకే పిల్లలకు చిన్న వయసులోనే మనస్సుల్లో వెలుగులు నింపే ప్రయత్నం జరగాలి. ఆధునిక సాంకేతిక యుగంలో డిజిటల్ లిటరసీని పెంపొందించాలి. ఇది ఆర్డర్ ఆఫ్ ది డే.
నిజానికి 21వ శతాబ్దంలో ఆధునిక తరం ‘చదివే’ సంస్కృతికి దూరమైపోతూ ‘చూసే’ సంస్కృతికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలం నుంచి ఒక్క చదివే అలవాటు మినహా అన్నీ మాధ్యమాలూ పెరిగాయి. అంతా చూడటమే.. టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, కంప్యూటర్ చూస్తారు, స్మార్ట్ ఫోన్‌ను మాట్లాడటం కంటే బొమ్మలు, వీడియోలు చూడటానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి అన్నీ చూడటమే. చిన్న పిల్లల్నుంచీ మొదలు అందరూ ఇలా చూసేందుకు అలవాటు పడిపోతున్నారు. అక్షరాలు రాయడానికీ, చదవడానికీ కూడా ఇమేజ్‌లనే వాడే సంస్కృతిని మనం చూస్తున్నాం. అయితే, ఈ చూడటమనే ప్రక్రియలో అంతా సరిగ్గానే ఉందా? చూస్తున్న వాళ్లపైన ఈ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్‌కు సంబంధించిన ప్రభావాలు ఎలా ఉంటున్నాయి? వాటి ప్రతిఫలాలు సమాజంపై ఎట్లా ఉంటున్నాయనే అవగాహన కొరవడటం విచారకరం.
డిజిటల్ సంస్కృతికి, డిజిటల్ సాక్షరతకు సంబంధించిన కనీస పరిజ్ఞానం లేకపోవడం వల్ల టీవీలూ, ఇంటర్నెట్లూ నట్టింట్లో కుమ్మరిస్తున్న చెత్తనంతా చూస్తూ పిల్లలూ, పెద్దలే కాదు, మొత్తం సమాజమే గాడితప్పి కనీస విలువలు లేని ఒక విష సంస్కృతికి అలవాటు పడిపోతున్నారు. వాళ్లు చూపిస్తున్నదాన్ని గుడ్డిగా చూస్తూ మంచేదో, చెడేదో భేదం గుర్తించగలిగే పరిస్థితి లేకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారవుతున్నది.
ముఖ్యంగా భావి సమాజానికి ప్రతినిధులుగా ఉండాల్సిన విద్యార్థులకు డిజిటల్ లిటరసీకి సంబంధించిన మౌలిక విషయాలేమైనా అందుతున్నాయా, లేదా? అన్న విషయాన్ని ప్రభుత్వాలూ, మేధావులూ, విద్యావేత్తలూ ఆలోచించాలి. ఒకవైపు ప్రభుత్వాలు డిజిటల్ తరగతి గదులూ, స్కిల్ డెవలప్మెంట్ అంటుంటే, మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థలు ఈ-స్కూల్స్, డీజీ స్కూల్స్ అంటూ విద్యను మొత్తంగా వ్యాపారం చేసి తరగతి గదుల్లో ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు అంటూ ఊదరగొడుతున్నాయి.
నిజానికి ఒక బొమ్మ వెయ్యి పదాలకు సమానం. ఇక వీడియో లేదా సినిమా అయితే ఎన్నో భావాల్ని నేరుగా ప్రేక్షకుని మనసులోకి తీసుకెళ్తుంది. అంతగా ప్రభావం చూపించగల డిజిటల్ మాధ్యమం గురించి సమాజం కనీసం ఆలోచన చేస్తున్నదా? అంటే జవాబు నిరాశాజనకంగానే ఉంది. అసలు మంచి విజువల్ ఏదో, చెడు విజువల్ ఏదో, మంచి సినిమాను లేదా మంచి వీడియోను ఎట్లా అర్థం చేసుకోవాలో నేర్పించే వ్యవస్థను రూపొందించుకోలేకపోవడం విషాదమే. ఆ స్థితిలో అర్థం లేని చెత్త దృశ్యాలను చూస్తూ పిల్లలు పాడైపోతున్నారని బాధపడటంలో అర్థం లేదు. చూసే దృశ్యాలకు సంబంధించి డిజిటల్ సాక్షారత (విజువల్ లిటరసీ కూడా)ను అందించలేనప్పుడు పిల్లలే కాదు పెద్దలు కూడా విలువలు లేని బొమ్మలకూ, సినిమాలకూ, వీడియోలకూ అలవాటు పడిపోతారు. అందుకు వాళ్లని కాకుండా పాలకుల్నీ, ప్రణాళికా నిర్మాతల్ని, మేధావుల్నీ నిందించాల్సి ఉంటుంది.
నిజానికి వర్తమాన సమాజం ప్రసార మాధ్యమాల ప్రభావంలో పడి కొట్టుకుపోతున్నది. అంతేకాదు పూర్తిగా ఇమేజ్ చట్రంలో కూరుకుపోతున్నది. ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారం వర్తమాన తరం అత్యధిక ఫొటోలు దిగిన తరంగా తేలింది. అంతేకాదు విద్యార్థులు రోజుకు ఏడు గంటలకుపైగా బొమ్మలో, వీడియోలో చూస్తున్నట్టుగా తేలింది. అప్పటికే టీవీ ప్రపంచంలో కూరుకుపోతున్న సమాజాన్ని 1991లో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన వరల్డ్ వైడ్ వెబ్(www) ఒక సాలీడులాగా మానవాళిని కప్పేసింది. అయితే దీనివల్ల సమాచార వ్యాప్తికి, జ్ఞాన విస్తృతికీ అమితమైన ఉపయోగం కలిగింది. దాంతోపాటు డిజిటల్ పరిజ్ఞానానికి సంబంధించి కనీస సాక్షరత లేకపోవడం వల్ల విద్యార్థులు మొదలు అందరూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు.
వర్తమాన ఆధునిక తరంలో పెల్లుబుకుతున్న అనేక చెడు ధోరణులకు మౌలికమైన కారణాల్ని తరచి చూడాల్సి ఉంది. విద్యా వ్యవస్థలోని లోపాలు, మార్కులూ, ర్యాంకులూ, అనారోగ్యకరమైన పోటీతత్వం మాత్రమే కాదు, అలాంటి అంశాలను పరిశీలిస్తూనే పెరుగుతున్న డిజిటల్ మాధ్యమం కూడా. దృశ్య సంస్కృతి గురించి తీవ్రంగా ఆలోచించాల్సి ఉంది.
ఇంటా బయటా, విద్యాలయాల్లో ఉపయోగిస్తున్న దృశ్య మాధ్యమం గురించి, డిజిటల్ సంస్కృతి గురించి శాస్త్రీయంగా పరిశీలించాల్సి ఉంది. దృశ్యమాధ్యమం వల్ల కలిగే దుష్ప్రభావాల్ని నిరోధించగలగాలి. దుష్ట సంస్కృతిని పెంపొందించే ఇంటర్నెట్, టీవీ, సినిమా కార్యక్రమాల్ని నిరోధించలేనప్పుడు మంచిచెడుల విచక్షణ కలిగించే డిజిటల్ సంస్కృతిని పెంపొందించే కృషి ప్రారంభం కావాలి. దానికి డిజిటల్ సాక్షరత ఒక విద్యా విషయం కావాలి. ఈ స్థితి నుంచి బయటపడాలనుకుంటే పాఠశాల స్థాయి నుంచే డిజిటల్‌కు సంబంధించి కార్యక్రమాల్ని రూపొందించాలి. ఇప్పటికే దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వీడియో ప్రదర్శనలకు చెందిన సాంకేతిక వసతులు సమకూరి ఉన్నాయి. వాటి ద్వారా మంచి చెడుల నడుమ తేడాలు అర్థమయ్యేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. మానవీయ విలువల ప్రోత్సాహం కోసం సాహిత్యంతో పాటు అర్థవంతమైన దృశ్య మాధ్యమాన్ని, డిజిటల్ పరిజ్ఞానాన్ని పరిచయం చేసే కృషి కొనసాగాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా విషయక అవసరాలతో పాటు డిజిటల్ విద్య దృశ్య సాక్షరత అవసరాన్ని గుర్తించాలి.
– వారాల ఆనంద్