‘ఇగురం గల్ల పనోడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట..’ రేవంత్ సర్కార్ పని గూడ అచ్చం గట్లనే ఉన్నది. ‘మంచి తరుణం మించిన దొరకదు. ఇదే మహదవకాశం. దరఖాస్తు చేసుకోండి. డబ్బులు తీసుకోండి’ అన్నట్టుగా బాకాలూది మరీ ప్రచారంచేసిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీల వలె విజయవంతంగా చెత్త బుట్టలోకి చేరిపోయింది. యువ వికాసందరఖాస్తులను హోల్డ్‌లో పెట్టాలని రేవంత్ సర్కార్ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడమే అందుకు తాజా ఉదాహరణ.
పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం యూనిట్లను పొందినవారు వాటిని తిరిగి అమ్ముకునే అవకాశం ఉన్నదని, అసలు సిసలైన లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఈ యూనిట్లపై పునరాలోచన చేయాలని ప్రభుత్వం సూచించింది. రాజీవ్ యువ వికాసం అమలుపై మళ్లీ విధివిధానాలను రూపొందిస్తామని, అప్పటివరకు ఎవరికీ ఎలాంటి యూనిట్లు కేటాయించవద్దని పేర్కొన్నది. అంటే ‘మేం పథకాన్ని అమలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ, తెలంగాణ ప్రజలే దొంగలు’ అన్నట్టుంది ఈ పార్టీ వైఖరి. కానీ, వాస్తవానికి అసలు విషయం ఏమంటే రేవంత్ వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. ఆదాయం పడిపోయింది. పథకం అమలుకు పైసల్లేవు. కనీసం దాన్ని ప్రారంభించే పరిస్థితి కూడా లేదు. అందుకే రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలను.. కాదు కాదు, యువతను దొంగల కింద లెక్కగట్టింది.
సాధారణంగా ఏ పథకం రూపొందించినా.. ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఆ పథకాన్ని ప్రారంభిస్తున్నారు? అనర్హులు పథకాన్ని దుర్వినియోగం చేయకుండా ఎలాంటి నిబంధనలు పెట్టాలి? పథక అమలుకు నిధుల సమీకరణ ఎట్లా?.. ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతనే పథకాన్ని ప్రకటిస్తారు. కానీ, రేవంత్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. సోనియా గాంధీ కుటుంబానికి తాను వీర విధేయుడినని ప్రకటించుకునేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో ముందుగా అట్టహాసంగా ఆ పథకాన్ని ప్రకటించేశారు. రూ.50,000, రూ.1,00,000, రూ.3,00,000, రూ.4,00,0 00.. ఇలా 4 స్లాబ్‌లు పెట్టి ఎంత మంది దరఖాస్తు పెట్టుకుంటే అం తమందికి పథక ఫలాలు అందుతాయని మం త్రులు గొప్పగా చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచే లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తామని సర్కార్ గప్పాలు కొట్టింది. తీరా అమలుకు వచ్చేసరికి, అర్జీదారులు పెట్టుకున్న దరఖాస్తులను చూసే రేవంత్ సర్కారు బెంబేలెత్తిపోయింది. 16.23 లక్షల మంది యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది.
మొదట రూ.50 వేల లోపు యూనిట్ల వాళ్లకే చెక్కులు అందజేస్తామని ఓ మంత్రి ప్రకటించారు. ఆ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తడంతో లేదు, లేదు.. జూన్ 2న పథకాన్ని ప్రారంభించి అక్టోబర్ కల్లా విడుతల వారీగా చెక్కులిస్తామని మరో మంత్రి ఆయన ప్రకటనను కప్పిపుచ్చారు. గత జూన్ 2 నాటికి చెక్కు లు అందించాల్సిన లబ్ధిదారుల జాబితా కూడా సిద్ధమైంది. ఎల్లుండి పథకం ప్రారంభం అనగా.. ఎమ్మెల్యేల సిఫారసులతో అనర్హులు కూడా లబ్ధిదారుల జా బితాలో చేరినట్టు ప్రభుత్వానికి తెలిసిందట. దీంతో వెనక్కి తగ్గింది. ‘ఈ పథకం అమలు విధానంపై పునరాలోచన చేస్తాం’ అని రాష్ట్ర క్యాబినెట్ తెలంగాణ యువతపై ఓ పిడుగును పడేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు చేయించిన కాంగ్రెస్, తాను అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కాంగ్రెస్ చేస్తున్న మోసపూరిత ప్రకటనలను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తూనే ఉన్నారు. ఎంతో ఆర్భాటంతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఉద్యోగాల కల్పన అటుంచితే కనీసం స్వయం ఉపాధికి కార్పొరేషన్ రుణాలు తీసుకుందామన్నా యువతను మోసగాళ్లుగా చిత్రించి కాంగ్రెస్ ఆ పథకాన్ని కూడా ఆపేయడం ఆక్షేపణీయం. ఎంతో తెలివితో ఆలోచించే తెలంగాణ యువత ఇప్పటికైనా కాంగ్రెస్ కపట నాటకాలను గుర్తించాలి. ‘ఒడ్డెక్కే దాన్క ఓడ మల్లన్న ఒడ్డు దాటినాక బోడ మల్లన్న’ అనే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో, సరైన రీతిలో బుద్ధి చెప్పాలి.