ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు అని కేసీఆర్ తరచుగా అంటుంటారు. పరిపాలనను ప్రజల వద్దకు చేర్చే గురుతర బాధ్యత వారి భుజాలపైనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం మలిదశ పోరులో ఉద్యోగుల పాత్ర మరువరానిది. ఈ అనుబంధాన్ని గుర్తుంచుకొని రాష్ట్ర సాధకుడు కేసీఆర్ పరిపాలన పగ్గాలు చేపట్టిన వెంటనే ఉద్యోగుల సమస్యలపై, డిమాండ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. రాష్ట్ర సాధనలో స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారు. ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వాన్ని నెలకొల్పి నిబద్ధతతో పనిచేసేందుకు కావాల్సిన గౌరవాదరాలను వారికి కల్పించారు. ఆరంభంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంక్రిమెంట్ పేరిట ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను ఇచ్చి అభిమానం చాటుకున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేండ్లలో రెండుసార్లు వేతన సవరణ చేపట్టింది. 2015లో భారీగా 43 శాతం, 2020లో 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. దీంతో దేశంలోనే అత్యధిక జీతాలు పొందుతున్నవారిగా తెలంగాణ ఉద్యోగులు రికార్డు సాధించారు. ఖజానాపై రూ.12,595 కోట్ల అదనపు భారం పడుతున్నా లెక్కచేయకుండా కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. అంతేకాకుండా 2014 జూన్ నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నవారిని రెగ్యులరైజ్ చేసింది. ప్రమోషన్ విధానాన్ని సరళీకృతం చేసి కనీస సర్వీసును రెండేండ్లకు కుదించింది. ఉద్యోగంలో ఉన్నవాళ్లకే కాకుండా పదవీ విరమణ చేసినవారికీ అదనపు ప్రయోజనాలు చేకూర్చింది. 15 శాతం అదనపు పింఛన్ కోసం రూ.1500 కోట్లు కేటాయించి వయో పరిమితిని 75 నుంచి 70 ఏండ్లకు తగ్గించింది. పదవీ విరమణ గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచారు. అరకొర జీతాలకే పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, చిరుద్యోగులకూ జీతాలు భారీగా పెంచి ఔదార్యం చాటుకున్నది కేసీఆర్ సర్కారు. ఇలా సకల ఉద్యోగవర్గాల సంక్షేమం కోసం చేపట్టిన బహుముఖ చొరవలతో ఉద్యోగ మిత్ర ప్రభుత్వంగా మన్ననలు అందుకున్నది.
మార్పు అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి మారిపోయింది. తెలంగాణ సోయిలేని, ఉద్యోగుల సంక్షే మం పట్టని రేవంత్ పాలనలో ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. ‘అందరికీ అన్నీ’ అంటూ గారడీ చేసిన కాంగ్రెస్ ఉద్యోగులనూ మోసకారి హామీలతో బురిడీ కొట్టించింది. అధికారం చేపట్టిన వంద రోజుల్లో పీఆర్సీ అమలు చేస్తామనేది అతిముఖ్యమైన హామీ. కానీ ఏడాదిన్నర దాటినా అతీగతీ లేకుండా పోయింది. పీఆర్సీ గడువు ముగిసి రెండేండ్లు అయినా కమిటీ గడువు పొడిగిస్తూ కాలక్షేపం చేస్తున్నది. కమిటీ నివేదిక సిద్ధమైనా దానిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం విడ్డూరం. జీతాలు పెంచాల్సి వస్తుందన్న భయమే అందుకు కారణం. జీతాలు ఇవ్వడమే గొప్ప అన్నట్టుగా నిస్సహాయ స్థితిలోకి ఉద్యోగులను నెట్టివేసి తమాషా చూస్తున్నది. రెండు డీఏలు ఇచ్చినా ఇంకా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అటు రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్లు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నది. జీపీఎఫ్ డబ్బులూ తీసుకోలేని పరిస్థితి. జీవితకాలాన్ని సర్కారు సేవలో గడిపిన ఉద్యోగులు మలిసంజెలో తమకు న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సి రావడం, ధర్నాచౌక్‌లో గొంతెత్తాల్సి రావడం దురదృష్టకరం.
హామీలు ఇచ్చి గాలికి వదిలేసిన అబద్ధాలకోరు సర్కారుపై ఉద్యోగులు సమరశంఖం పూరించారు. చర్చలు, కమిటీలంటూ అనుసరిస్తున్న దాటవేత ధోరణిని నిలదీస్తున్నారు. విశ్రాంత జీవితం హాయిగా గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు సైతం బెనిఫిట్స్ కోసం పోరుబాట పడుతున్నారు. 57 డిమాండ్లు నెరవేర్చాలంటూ సర్కారుపై పోరును రోజురోజుకూ ఉ ధృతం చేస్తున్నారు. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా సర్కా రు మొద్దునిద్ర వీడి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తే మంచిది.