అవినీతి ఆరోపణలు చుట్టుముట్టినప్పుడు, విపక్షాలు నిలదీసినప్పుడు నిరంకుశ పాలకులకు రెండు ఎత్తుగడలు గుర్తుకువస్తాయి. ఒకటి, తమను వేలెత్తి చూపేవారిపై దేశ వ్యతిరేక శక్తులుగా ముద్రవేయడం. రెండు, ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి అత్యవసర పరిస్థితి విధించడం. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆ పనే చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్ చేస్తున్న విపక్షాలను జాతి ద్రోహులుగా దూషించారు. ఉత్తరకొరియా బూచిని భూతద్దంలో చూపారు. విపక్షాలు శత్రుదేశ ఏజెంట్లుగా మారారని బట్టకాల్చి మీద వేశారు. చేజారిపోతున్నట్టు కనిపిస్తున్న తన అధికారాన్ని పదిలం చేసుకునేందుకు చివరి అస్త్రంగా సైనిక పాలన (మార్షల్ లా)ను ప్రయోగించారు. ఈ హఠాత్ పరిణామం దక్షిణ కొరియా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 50 ఏండ్లుగా మరచిపోయిన సైనిక పాలన పీడకల మరోసారి తమను కమ్మేసే సరికి వారు అప్రమత్తమయ్యారు. విపక్షాలు సకాలంలో స్పందించి ప్రజల మద్దతు కూడగట్టి గట్టిగా ప్రతిఘటించడంతో కొన్ని గంటల్లోనే పరిస్థితి తారుమారైంది.
సైనిక పాలనకు వ్యతిరేకంగా పార్లమెంటు తీర్మానం చేయడంతో యూన్ తన ఫర్మానాను వెనక్కి తీసుకున్నారు. అధ్యక్ష పదవిలో కొనసాగే నైతిక అర్హతను యూన్ కోల్పోయారని, దుస్సాహసానికి పాల్పడినందుకు గానూ అభిశంసన తప్పదని విపక్షాలు పట్టుబడుతున్నాయి. రాజ్యాంగ న్యాయస్థానం అభిశంసనకు అనుకూలగా తీర్మానిస్తే యూన్ అధ్యక్ష పదవిని కోల్పోవడమే కాకుండా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. 1979లో సైనిక నియంత పార్క్ చుంగ్ హీ హత్య జరిగిన సమయంలో చివరిసారిగా దక్షిణ కొరియాలో మార్షల్ లా విధించారు. సుదీర్ఘకాలం సైనిక నియంతృత్వం కింద కొనసాగిన దక్షిణ కొరియా 1987 నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మారిపోయింది. ఆ తర్వాత మార్షల్ లా విధించాల్సిన అవసరం రాలేదు. తీవ్ర జాతీయవాది అయిన యూన్ 2022 మే నెలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు విపక్ష లిబరల్ డెమొక్రాట్లను అధిక సంఖ్యలో గెలిపించి ఆయన అధికారానికి ముకుతాడు వేశారు. దీంతో తీవ్ర జాతీయవాదానికి, ఉదారవాదానికి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.
పార్లమెంటు నిర్ణయాలను యూన్ వీటో చేస్తుండటం, అధ్యక్షుని నిరంకుశ ఫర్మానాలను తిరస్కరిస్తూ పార్లమెంటు తీర్మానాలు చేస్తుండటంతో దక్షిణ కొరియాలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అవినీతి ఆరోపణలు, వివాదాలు ఈ ఘర్షణకు ఆజ్యం పోశాయి. అధ్యక్షుని సతీమణి విదేశీయుల నుంచి విలువైన కానుకలను అందుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. దీనిపై విచారణకు యూన్ మోకాలడ్డు పెట్టడంతో రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య వైరం తారస్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలోనే తనను చుట్టుముట్టిన సమస్యల నుంచి బయట పడేందుకు సులభ మార్గంగా సైనిక పాలనను ఎంచుకుని యూన్ భంగపడ్డారు. మొత్తం మీద సైనిక పాలన ముప్పు తొలగిపోయినందుకు దక్షిణకొరియా ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి రక్ష అనే విజ్ఞుల మాట ఈ సందర్భంగా గుర్తుకు రాక మానదు.