ఆపరేషన్ సిందూర్ తొలి అంకం ముగిసింది. పాకిస్థాన్‌ను భారతసైన్యం కోలుకోలేని విధంగా దెబ్బతీసి, ప్రపంచానికి తన శక్తి ఏమిటో చాటిచెప్పింది. పహల్గాం పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయని పాక్ రాజకీయ ప్రభుత్వం ఊహించలేకపోయింది. తినడానికి తిండే లేని ఆ దేశం యుద్ధానికి తయారుగా లేదు. అయితే, అక్కడ ప్రభుత్వం నామమాత్రమే. అంతా సైన్యం, ఐఎస్ఐ చేతుల్లోనే ఉంటుంది. దానికి నిదర్శనం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత అదే రాత్రి మళ్లీ భారత్‌పై డ్రోన్ దాడులు జరగడం. పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్‌కు విరమణ ఒప్పందం రుచించలేదనడానికి ఆ దాడులే రుజువు.
ఆపరేషన్ సిందూర్ సాధించిన విజయమంతా భారత సాయుధ దళాలకే చెందుతుంది. వారు వీర విక్రమ పరాక్రమాలతో పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఈ దశలో భారత ప్రభుత్వం సంపూర్ణ విజయానికి ఓ అడుగు దూరంలో వెనకడుగు వేయడం సమస్త భారతావనిని నివ్వెరపరిచింది. అంతర్జాతీయ ‘ఒత్తిళ్ల’తో తనకు కావాల్సిందేమిటో స్పష్టం చేయకుండానే వెనుదిరిగింది.
ఆశ్చర్యకర విషయమేమిటంటే, కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం. కారణమేదైనా, ఇది పరాయి దేశపు అనవసర జోక్యం. ఉగ్రదేశానికి ఐఎంఎఫ్ సాయం అందకుండా చేయగలిగేంత అధికారం ఉన్నా ఆ పనిచేయని అమెరికా.. భారత్‌ను మాత్రం కాల్పుల విరమణకు ఒప్పించగలిగింది. అమెరికాకు అధ్యక్షుడు ఎవరైనా, వారి లాభమే వారికి ముఖ్యం. అణుబాంబులు వాడకుండా తాను ఉపఖండాన్ని కాపాడానని అమెరికా ‘వ్యాపారవేత్త’ డొనాల్డ్ ట్రంప్‌కు పిచ్చిమాటలు మాట్లాడే అవకాశం భారతే ఇచ్చింది. ఇక మరో తప్పిదం. పాకిస్థాన్ మనకు భయపడి లొంగిపోయిందని ముందుగా ఒప్పందాన్ని ప్రకటించాం. పాకిస్థాన్ ఎక్కడా వెనక్కి తగ్గినట్టు మాట్లాడలేదు. పాక్ ప్రధాని మాత్రం విజయం తమదేనని, భారత్‌కు తీవ్ర నష్టం కలుగజేశామని తమ పార్లమెంట్లో ప్రకటించుకున్నాడు. ఇక్కడ ఎవరి చేయి పైన? ఎవరి చేయి కింద? అని కాదు.
ఒక్కటి మాత్రం నిజం. నిశ్చయంగా భారత ప్రభుత్వ ఈ నిర్ణయం ప్రజలకు నచ్చలేదనేది నిర్వివాదాంశం. ఇక మీదట ‘ఒక్క గుండు హద్దు దాటినా, అది యుద్ధంగా పరిగణిస్తామ’ని ప్రకటించి ఎంతగా సముదాయింపజూసినా, లక్ష్యం నెరవేరనప్పుడు ఎవరూ సంతృప్తి చెందరు. భారత అమాయకపు ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ, చనిపోయిన ఉగ్రవాదులకు పాక్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తున్న వైనాలు చూసిన భారత ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఉత్తుత్తి బెదిరింపు మాటలతో సంతృప్తి చెందరు.
పాకిస్థాన్ పీచమణిచే వేదికను, దశాబ్దాలుగా రగులుతున్న రావణకాష్ఠాన్నీ ఆర్పే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్న భారత్, కాల్పుల విరమణకు ఒప్పుకొని షరతులు విధించే అవకాశాన్నీ కోల్పోయింది. ప్రస్తుతానికి కొంతకాలం అంతా స్తబ్ధుగా ఉంటుంది. ఈలోపు ఐఎంఎఫ్ ఇచ్చిన డబ్బులతో భారత్ కూలగొట్టిన భవంతులను, ఫ్యాక్టరీలను పునర్నిర్మించుకొని మళ్లీ ఒక పుల్వామానో, ఉరినో, పహల్గాంనో అమలు చేస్తారు. తీవ్రవాదులంతా తిరిగి ఏకం కావడానికి ఈ దౌత్యపరమైన స్తంభన వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే ఒక్కటి మాత్రం నిజం. మనకు తెలిసినంతవరకూ, తెలియని విషయాలు తెలువకపోయినా పాకిస్థాన్‌కు మాత్రం తీవ్ర నష్టమైతే వాటిల్లింది. కొన్ని విషయాలు బయటికి తెలియకపోవచ్చు కానీ, పాకిస్థాన్ అణుస్థావరం కూడా పాక్షికంగా దెబ్బతిన్నదని, అందులో నుంచి రేడియేషన్ లీకవుతున్నదన్న వార్తలు కూడా అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాక్‌కు అణుబాంబు బయటికి తీయడం తప్ప వేరే మార్గం లేదనే నిఘా సమాచారం దృష్ట్యా అమెరికా జోక్యం చేసుకున్నదని వాటి సారాంశం. ఏదేమైనా ఓ ఇరవైయేండ్ల కిందటి భారత సైన్యం, ఈనాటి సైన్యం సామర్థ్యాలను పోల్చలేం. ఇప్పుడు అత్యంత శక్తిమంతమైన ఆయుధాలతో భారత త్రివిధ దళాలు దుర్భేద్యంగా మారిపోయాయి. దాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచదేశాలు కండ్లారా చూశాయి. విచిత్రంగా అమెరికా ఆయుధాలు వాడని ఈ యుద్ధం ట్రంప్ లాంటి వ్యాపారవేత్తకు కంటగింపుగా మారిందనేది కూడా సత్యమే.
ఉగ్రవాదులు కర్మాగారాలు నెలకొల్పింది ‘మన’ భూభాగమైన ఆక్రమిత కశ్మీర్లో. అది పూర్తిగా మనలో విలీనమైతేనే మన లక్ష్యం సిద్ధించినట్టు. ఉగ్రవాద నాయకులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తదితరులను అప్పగిస్తేనే పహల్గాం బాధితులకు ఊరట. ఈ రెండూ లేకుండా ఆపరేషన్ సిందూర్ అసంపూర్ణమే.
1972లో జర్మనీలోని మ్యూనిక్‌లో వేసవి ఒలింపిక్స్ సందర్భంగా 11 మంది ఇజ్రాయెల్ క్రీడాకారులను యూదులనే మత ప్రాతిపదికన పాలస్తీనా తీవ్రవాదులు దారుణంగా ఊచకోత కోశారు. దీనికి తీవ్రంగా స్పందించిన నాటి ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మెయిర్ ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వదలిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశారు. ఆ బాధ్యత చేపట్టిన మొసాద్, విదేశాలకు పారిపోయి, వేష భాషలను, గుర్తింపును మార్చుకున్న ఆ తీవ్రవాదులను వెంటాడి, వేటాడుతూ, చివరి తీవ్రవాదిని 1979లో చంపేసింది. ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించేవరకు వాళ్లను ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఎవరికీ తెలియదు. ఈ ఆపరేషన్‌కు పట్టిన సమయం దాదాపు ఏడేండ్లు. వాస్తవానికి ఇదే పద్ధతిని ఇప్పుడు భారత్ అవలంబించాల్సి ఉన్నది. భారత గడ్డపై ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల ఉగ్రదాడులకు మూలకారకులైన వారిని ఎక్కడున్నా ఇదేరీతిన మట్టుపెడితేనే తీవ్రవాదాన్ని నిర్మూలించగలం. ప్రభుత్వాలు మారినా, కాలం మారినా.. స్థిరంగా ఆపరేషన్‌ను కొనసాగించడం, అందుకు కావాల్సిన స్వయం ప్రతిపత్తి ‘రా’కు ఇవ్వడం జరగాలి.
భారతదేశం కూడా అంతర్జాతీయంగా, దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చి, పాకిస్థాన్ ఉగ్రవాదులను అప్పగించే చర్యలను ఉధృతం చేస్తూనే ఉండాలి. పరిస్థితులు ఎటునుంచి ఎటుమారినా, ఆక్రమిత కశ్మీర్ మన పరం కానంతవరకు ఉగ్రవాదాన్ని అదుపు చేయడం అసాధ్యం. పాకిస్థాన్‌ను ముక్కలు చేస్తామన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లకాలం ప్రజలను ఏమార్చలేదు. పీవోకేను తీసుకురాలేకపోతే అది బీజేపీకి ఆత్మహత్యాసదృశమే అవుతుంది. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.