నాలుగు దశాబ్దాల క్రితం ఓ భారతీయుడు తొలిసారిగా అంతరిక్షంలోకి దూసుకుపోయినప్పుడు మన తొలి అడుగు పడింది. తర్వాత ఇన్నేళ్లకు మలి అడుగు పడింది. ఈ మధ్యకాలాన్ని గమనిస్తే వ్యోమ అన్వేషణలో భారత అంతరిక్ష పరిశోధన రంగం వేసిన అంగలు అబ్బురపరుస్తాయి. సోవియట్ యూనియన్ సహకారంతో తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ మబ్బుతెరలను దాటి ఖగోళ సీమలను చుట్టిరావడం ఓ నాందీ గీతం. అప్పటికి భారత్ అంతరిక్ష పరిజ్ఞానం పరిమితం. ఇప్పటి భారత్ వేరు. రాకెట్ టెక్నాలజీలో మన దేశం అనేక ఇతర దేశాలకు సేవలు అందించే స్థాయికి ఎదిగింది. చంద్రుడిపైకి, ఆపై అంగారక గ్రహంపైకి భారత్ అంగలు వేస్తున్నది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారత్ మరో మైలురాయిని దాటింది. మంగళవారం సాయంత్రం సుమారు 3 గంటలకు శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర ముగించుకుని భూమికి చేరుకోవడం ముదావహం. అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో స్పేస్ మాడ్యూల్ నుంచి బయటకు వస్తూ శుభాన్షు చిందించిన చిరునవ్వు అంతరిక్ష జగత్తులో రెపరెపలాడుతున్న భారత కీర్తి కాంతులను ప్రతిబింబించింది.
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఇది ప్రభుత్వాలపరంగా కాకుండా వాణిజ్యపరంగా జరిగిన యాత్ర కావడం విశేషం. అంతరిక్ష పరిశోధనలో ప్రైవేటు రంగం ఎదిగివస్తున్న తీరును ఇది తెలియజేస్తున్నది. ఏగ్జియం-4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లిన బృందంలో ఇస్రో తరఫున పాల్గొన్న శుభాన్షు 18 రోజులపాటు పలు వైద్య, జీవశాస్త్రపరమైన పరిశోధనల్లో పాల్గొన్నారు. భారత్, అమెరికా, పోలండ్, హంగరీ, సౌదీ అరేబియా, బ్రెజిల్, నైజీరియా తదితర 31 దేశాల తరఫున 60కి పైగా పరిశోధనలను ఈ బృందం నిర్వహించింది. ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకుంటే అంతరిక్ష పరిశోధనలు కొత్తపుంతలు తొక్కడం ఖాయమని తిరుగు ప్రయాణానికి ముందు శుభాన్షు చేసిన వ్యాఖ్యలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
స్పుత్నిక్ రాకెట్ ప్రయోగంతో అంతరిక్ష విజ్ఞానంలో రష్యా వినూత్న అధ్యాయాన్ని ఆవిష్కరించిన 1957లోనే ఇస్రో పురుడు పోసుకుంది. భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రం సారాభాయ్ నేతృత్వంలో అడుగులు వేయడం నేర్చుకుంది. సైకిళ్ల మీద రాకెట్ విడిభాగాలు తరలించిన రోజులున్నాయి. పేద దేశానికి రాకెట్ విజ్ఞానం దేనికని ఈసడించినవారూ ఉన్నారు. కానీ, ఎన్నో అవరోధాలను అధిగమించి ఇండియా ఇప్పుడు పెద్ద దేశాల సరసన నిలిచింది. ఆనాడు సోవియట్ సౌహార్దంతో యాత్ర జరిగితే నేడు భారత్ తన స్వయం ప్రతిభతో, సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో అంతరిక్ష యాత్రలు దిగ్విజయంగా పూర్తి చేసే స్థాయికి ఎదగడం గర్వకారణం. రాకేశ్ శర్మ తరహాలోనే శుభాన్షు కూడా గగన వీధుల నుంచి పుడమిని వీక్షిస్తూ, ‘సారే జహాసే అచ్ఛా హిందూస్థాన్ హమారా’ అని చాటడం ప్రతి భారతీయునికి ఎదలు ఉప్పొంగే క్షణం.