తమను పెంచి పోషించే రాజకీయ పక్షం కోసం ఏ పాపం తెలియని హీరోయిన్ల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం మీడియా దృష్టిలో విలువలు పాటించడం అవుతుందా? ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో 600 మంది పేర్లున్నాయి, వీరిలో సినిమా హీరోయిన్లు ఒక్కరు కూడా లేరు’ అని పోలీసు అధికారులు వెల్లడించిన తర్వాత ఇంతకాలం హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, వారిని వేధించారని ప్రచారం చేసిన మీడియా ఇప్పుడేం చెప్తుందో?
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు… దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్టు… ఒక మహిళా కాంగ్రెస్ నాయకురాలు సాటి మహిళ గురించి మాట్లాడుతున్నాననే విషయం కూడా మరిచిపోయి ‘హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, హీరోయిన్ను రావే అని పిలిచేవాడు’ అంటూ నిస్సిగ్గుగా మీడియా ముందు నోటికొచ్చింది మాట్లాడారు. తానూ ఒక మహిళనేనని, తనకూ పిలల్లున్నారని, తానో మహిళ గురించి అసభ్యంగా మాట్లాడకూడదనే ఇంగితం లేకుం డా నాయకులు, మీడియా పోటాపోటీగా ఫోన్ ట్యాపిం గ్ కథలు అల్లారు. ఎలక్ట్రానిక్ మీడియా అనేది దృశ్య ప్రధానమైనది. సంఘటన కన్నా ఇక్కడ దృశ్యం ప్రధానంగా ఆకట్టుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నా, రూ. లక్ష కోట్ల కుంభకోణం అన్నా ఆ వార్తలో పెద్ద మజా ఉండదు. ఒక్కసారి ప్రసారం చేసిన వార్తను మరోసారి ప్రసారం చేస్తే పెద్దగా ఆసక్తి ఉండదు. అదే రాజకీయ నాయకులు, అందమైన హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అనే కథను సస్పెన్స్ సినిమాను మించి వండి వార్చవచ్చు.
హీరోను పేరు పెట్టి పిలవడానికి సైతం వణికిపోయే మీడియా హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి వారి గురించి ఏమైనా అవాకులు చెవాకులు పేలవచ్చు. పవన్‌కల్యాణ్ ఇంట్లో పెళ్లికి దక్కన్ క్రానికల్ ఫొటోగ్రాఫర్ వెళ్తే అతన్ని చితగ్గొట్టి పంపారు. కెమెరా ముక్కలు ముక్కలైంది. బతుకు జీవుడా అని అతను ఆఫీస్‌కు పారిపోయి వచ్చాడు. అదే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ వివాహంలో పిలువకపోయినా మీడియా వెళ్లింది. పెళ్లి పందిరిలోనే పలానా హీరోతో మీకు సంబంధం ఉంది కదా? అంటూ పెళ్లి కూతురుగా ఉన్న ఆర్తి అగర్వాల్‌పై ప్రశ్నల వర్షం కురిపించి పెళ్లిలోనే పెంట పెంట చేశారు. చివరికి పెళ్లి దుస్తుల్లోనే ఆర్తి అగర్వాల్, ఆమె కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో కూర్చునేట్టు చేశారు. పిలవని పేరంటానికి వెళ్లడం మొదటి తప్పు, వెళ్లినా అలా ఒక పెళ్లి దుస్తుల్లో ఉన్న ఒక ఆడపిల్లను అలా అడగడం రెండో తప్పు, పైగా తామే రచ్చ చేసి, కేసు పెట్టి పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చారు. హీరోయిన్ల విషయంలో ఇలా ఉండే మీడియా వీరులు హీరోల విషయానికి వస్తే చేతులు కట్టుకొని, మూతికి చేయి అడ్డం పెట్టుకొని ‘జీ హుజూర్’ అని నిలబడతారు. 30 ఏండ్ల వయసు దాటిన హీరోయిన్ను ముదురు హీరోయిన్ అని రాస్తారు, అదే 65 ఏండ్ల హీరోను యువరత్న, చాకోలెట్ బాయ్ అని నిస్సిగ్గుగా రాయగలరు. మహిళల పట్ల వీరికి ఉండే గౌరవం దీన్నిబట్టే అర్థమవుతుంది. టీడీపీ కోసం పరితపించే ఓ ఛానల్లో ఓ జర్నలిస్ట్ ఏకంగా సినిమా రంగంలోని ఆడవారిని కించపరిచేలా ఒక ప్రశ్నను లైవ్‌లో అడిగారు. మరో జర్నలిస్ట్ సినీ నటి కవితను ఇలాంటి ప్రశ్ననే అడిగితే ఆమె ఏ మాత్రం బెదరకుండా మొహం మీదే కొట్టినట్టు సమాధానం చెప్పారు.
ఇక తనకు సినిమాల్లో అవకాశాలు లేవనే దశకు చేరినప్పుడు అలా ధైర్యంగా బదులివ్వగలరు. కానీ, హీరోయిన్లు అవకాశాల కోసం ఎదురుచూస్తూ అవమానాలను భరిస్తుంటారు. ఎదురు తిరగరు, బదులివ్వరు. ఫోన్ ట్యాపింగ్ గురించి తమను పోషించే పార్టీ కోసం ఎంత తప్పుడు ప్రచారం చేస్తే అంత లాభం అనేది ఛానళ్ల వ్యూహం.
అదే సమయంలో వివాదంలో హీరోయిన్ల పేరు చేరిస్తే న్యూస్‌కు గ్లామర్ వస్తుంది, వ్యూవర్షిప్ పెరుగుతుందనేది ఛానళ్ల వ్యూహం. తన తల్లి, తన భార్యా పిల్లలకు ఓ జీవితం ఉన్నట్టే, వారికి మనసు ఉన్నట్టే హీరోయిన్ కూడా ఒక మహిళనే. కేవలం సంచలనం సృష్టించడానికి హీరోయిన్ల పేర్లు వాడుకోవడం తప్పు అనే ఆలోచన అస్సలు రాదు.
అదే హీరోల గురించి రాయాలంటే భయమేస్తుంది, హీరోయిన్ల గురించి ఏదైనా ప్రసారం చేయవచ్చనే ధైర్యం వస్తుంది. ఇప్పుడే కాదు, రాజరికం ఉన్నప్పుడు కూడా గూఢచారి వ్యవస్థ ఉన్నది. మొత్తం ప్రపంచంపై అమెరికా నిఘా ఉంటుంది. ఓ రెండేండ్ల కిందట ముంబైకి చెందిన యువకుడు ఏదో బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి కంప్యూటర్‌పై లెటర్ టైప్ చేస్తుండగానే, ముంబై పోలీసులకు అమెరికా గూఢచార వ్యవస్థ నుంచి ఫోన్ వచ్చింది. ‘ముంబైలోని పలానా అడ్రస్‌లోని యువకుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు ఆపండి’ అని. పోలీసులు వెంటనే వెళ్లి యువకుడిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ చేశారు. గూఢచార వ్యవస్థ ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతుంది. లాడెన్‌ను టెలిఫోన్ సహాయంతోనే మట్టుపెట్టారు. అనుమానం ఉన్నవారిపై గతంలో నిఘా ఉండేది, ఇప్పుడూ ఉంది. భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేదని ప్రభుత్వం చెప్పగలదా? మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా ఉండేదే.
600 ఫోన్ నంబర్లలో ఒక్క హీరోయిన్ కూడా లేదని పోలీసులే ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు ఒకరు ‘రాజకీయంగా ఎన్నో అంటాం’ అని తేలికగా బదులిచ్చారు. రాజకీయాలు నీచ స్థాయికి చేరుకున్నాయి, మధ్యలో తమ నీచ ప్రయోజనాల కోసం హీరోయిన్లపై బురద జల్లడం నీచ వ్యాపారమవుతుంది. దాదాపు ఐదు దశాబ్దాల కిందట కాగడా అని ఓ సినిమా బూతు పత్రిక ఉండేది. హీరోలకు, హీరోయిన్లకు సంబంధాలు అంటగడుతూ బూతులు రాసేవారు. ఆ పత్రిక తాలూకు వారిని చితగ్గొట్టడం, బహిష్కరించడం జరిగింది. కాలక్రమంలో కాగడాలకు కాలం చెల్లింది. ఇప్పుడు చిన్నాచితక న్యూస్ ఛానళ్లు కాగడాను తలదన్నుతూ రాజకీయాలను, హీరోయిన్లను కలిపి వంటలు వండి బతకాలని చూస్తున్నారు. చివరికి ఒక మహిళా మంత్రి సైతం ఒక హీరోయిన్ గురించి అసభ్యంగా కొన్ని ఆరోపణలు చేసింది. హీరో నాగార్జున మంత్రి మాటలపై కేసు పెట్టారు. కేసులు ఎంత కాలానికి తేలుతాయో అందరికీ తెలిసిందే. కానీ, ఆ హీరోయిన్ల మీద ఈ అసభ్య మాటల ప్రభావం ఎంతగా ఉంటుందో సంపాదన కోసమే రాజకీయాలు చేసేవారికి అర్థం కాదు.
బూతు ఛానళ్ల మీద దాడి జరిగినప్పుడు స్పందించిన యూనియన్లు, రాజకీయ పక్షాలు, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరగలేదని పోలీసులు చేసిన ప్రకటనపై కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేయాలి. బూతులు అమ్ముకొని బతకాలనుకొనే ఛానళ్ల వల్ల మొత్తం జర్నలిజం వృత్తికే ప్రమాదమని గ్రహించాలి. పోలీసుల ప్రకటన తప్పు అని చెప్పదలుచుకొంటే హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయినట్టు తమ వద్ద ఉన్న ఆధారాలు ధైర్యంగా బయటపెట్టాలి.