కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంజన్‌కుమార్ యాదవ్ గత నెల 24న తమ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణను అడ్డుకున్నది తమ పార్టీకి చెందిన రెడ్డి నాయకులేనని అన్నారు. వారిపై మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వార్తలు అన్నింటిలో వెలువడినందున ఆయన ఆ మాటలు అనటం నిజమే అనుకోవాలి. తన వ్యాఖ్యలు సంచలనం రేపగా, బహుశా పార్టీ నుంచి ఒత్తిడి రావటం వల్ల కావచ్చు, తాను ఏ సామాజిక వర్గాన్ని ‘దూషించలేద’ంటూ వివరణ ఇచ్చారు. ‘దూషించ’ లేదన్నారు గానీ, వారు
తెలంగాణకు అడ్డు పడినారన్న మాటలను మాత్రం ఉపసంహరించుకోకపోవటం గమనించదగినది.
అంజన్‌కుమార్ యాదవ్ మాజీ ఎంపీ కావటమే గాక, ప్రస్తుతం పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులలో ఒకరు. అందువల్ల ఆయన మాటలకు తగిన విలువ సహజంగానే ఉంటుంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏమిటన్నది మొదటినుంచి అందరికీ తెలిసిందే. కేంద్రం 1953లో ఫజల్ అలీ కమిషన్‌ను నియమించినప్పుడు, తెలంగాణ ప్రజలు కాదన్నా సీమాంధ్ర ధనిక వర్గాల ప్రభావానికి లోనై 1956లో ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసినప్పుడు, 1969-70 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సీమాంధ్ర పాలకులు అణచివేసినప్పుడు, 1990ల చివర తిరిగి మొదలై 2001లో టీఆర్ఎస్ స్థాపన నుంచి ఉధృతంగా సాగినప్పుడు, రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో మంత్రులుగా ఉండి కపట రాజకీయాలు చేసినప్పుడు, సోనియాగాంధీ అనుకూల వైఖరి చూపుతుండిన దశలోనూ ఇక్కడొక మాట, ఢిల్లీలో మరొక మాటల నాటకం ప్రదర్శిస్తుండినపుడు, ప్రతి ఒక్క దశలోనూ వారు చేసిందేమిటన్నది ఎంతమాత్రం రహస్యం కాదు.
అంజన్‌కుమార్ యాదవ్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఇదంతా స్వయంగా గమనించిన వ్యక్తి. తెలంగాణను ప్రేమించినవాడు. అందువల్లనే, ‘కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టి తెలంగాణను ఇవ్వకుండా కన్నమ్మ బాధలు పెట్టా’రని సాధికారికంగా చెప్పగలిగారు. వీరంతా ఎంత వ్యతిరేకించి ఎన్ని నాటకాలాడినా సోనియగాంధీ గట్టిగా పట్టుబట్టడం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. అనగా, ఆమె ఆ వైఖరి తీసుకోనట్టయితే, తెలంగాణ వ్యతిరేకులైన ఈ వర్గం సీమాంధ్ర ధనిక పాలక వర్గాలకు యథావిధిగా ఊడిగం చేస్తూ ప్రత్యేక రాష్ట్రం రాకుండా ఆపి ఉండేదన్న మాట. ఈ వర్గాలు ఇప్పుడు తమ ద్రోహ పాత్రను సోనియా సానుకూలత వెనుక కప్పిపెట్టుకుంటూ, ‘ఇచ్చింది సోనియా, తెచ్చింది కాంగ్రెస్’ అని ప్రచారాలు చేసి ప్రజల కండ్లుగప్పి లాభపడజూస్తున్నారు. ఇది మరొక కపటపు ఎత్తుగడ. ఆ కాలమంతా వాస్తవంగా జరిగిందేమిటన్న తెర వెనుక కథను అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు వెల్లడించిన పక్షంలో, ఈ వర్గాల సైంధవ పాత్ర ప్రజలకు ఇంకా బాగా తెలియవస్తుంది.
అట్లా అడ్డుపడి కాంగ్రెస్ వారిలో వేర్వేరు సామాజిక తరగతుల వారున్నా, ప్రధానమైన పాత్ర, నాయకత్వం ఇక్కడి ఫ్యూడల్ రెడ్లదే. రెడ్లలో అందరూ ఫ్యూడల్ తరగతి కాదు. ఆ తరగతిలో తెలంగాణ వెనుకబాటుతనం వల్ల స్వయంగా పీడితులైనవారు, అందుకు వ్యతిరేకంగా రకరకాలుగా తిరగబడినవారే అధిక సంఖ్యలో ఉన్నారు. కాకపోతే ఎప్పుడైనా ధన బలం, రాజకీయ బలం గలవారే ఒక ఉన్నత తరగతిగా ఏర్పడి వ్యవహారాలు నడుపుతారు. తెలంగాణ ఫ్యూడల్ రెడ్లు కూడా అదే పనిచేశారు. అందువల్లనే వారిని కాంప్రడార్ క్లాస్ అనవలసి వస్తున్నది. ఆ సూత్రీకరణ ప్రకారం వారు చేసిందేమిటో చూసేముందు ఆ మాటకు అర్థమేమిటో తెలుసుకోవాలి.
కాంప్రడార్, కాంప్రడార్ క్లాస్ అన్నవి అకడమిక్ పరిభాషా పదాలు. కాంప్రడార్ అనే మాటకు నిర్వచనం ఈ విధంగా ఉంది. ‘పెట్టుబడులు, వ్యాపారం, లేదా ఆర్థిక, రాజకీయ దోపిడీలో విదేశీ సంస్థలకు ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తి. విజయవంతంగా పనిచేసే కాంప్రడార్లు చాలా సంపదలను గడిస్తారు’ ఇక కాంప్రడార్ క్లాస్ అన్నమాటకు నిర్వచనం ఏమిటి? ‘వలసపాలన నుంచి స్వాతంత్య్రానికి మారే సమయంలో కాంప్రడార్లు స్థానిక దళారీలుగా తయారై, పాలకుల కోసం ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడం, వలస ప్రాంతాల నిర్వహణను చూడటం వంటివి చేస్తారు. ఈ కొత్త తరగతి, విదేశీ పెట్టుబడులతో దానికి ఉండే సన్నిహిత సంబంధాలూ నయా వలసవాదానికి మార్గాన్ని సుగమం చేస్తాయి.’ దీని అర్థాన్నంతా సూటిగా, నిర్మొహమాటంగా, సామాన్య ప్రజల పరిభాషలో చెప్పాలంటే, తమ స్వార్థంతో పాటు బయటివారి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు నెరవేరే విధంగా వారి ఏజెంట్లుగా పనిచేసే తొత్తుల తరగతి అన్నమాట.
ఇదే విషయం అంజన్ కుమార్ యాదవ్ తన పద్ధతిలో తాను వెల్లడించారు. అయితే, వీరికి ఈ స్వభావం 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్న దశ నుంచి వచ్చింది కాదు. ఆ తర్వాత పైన పేర్కొన్న వివిధ దశలలో కొనసాగింది మాత్రమే కాదు. ఇందుకు పునాదులు నిజాం పాలనా కా లం నుంచే పడ్డాయి. అప్పటి ఆర్థిక వ్యవస్థ, భూ మి వ్యవస్థ నిర్మాణాన్ని బట్టి వీరు ఒక ఫ్యూడల్ తరగతి. రాజకీయ, సామాజిక వ్యవస్థను బట్టి పెత్తందారీ తరగతి. ఆ రెండు విధాలుగానూ ప్రభువులకు ఏజెంట్లు. అందువల్ల బాధలకు గురవుతుండిన ప్రజలను, నిరసిస్తుండిన ప్రజలను ఆ ప్రభువుల కోసం, తమ కోసం, ప్రభువుల సైన్యాలతో, తమ సొంత బలగాలతో వారు అణచివేశారు. ఇవన్నీ కాంప్రడార్ లక్షణాలు.
భారతదేశం స్వతంత్రం కావటం, పాత ప్రభువులు పోవటం, ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడటంతో సాంకేతికంగా ఆ దశ ముగిసిపోయింది. అటువంటపుడు గతకాలపు కాంప్రడార్ తరగతికి అందుకు తగిన జ్ఞానోదయం, చైతన్యంతో పాటు, ఆర్థికంగా, రాజకీయంగా స్వతంత్రంగా ఎదిగేందుకు అదొక మంచి అవకాశం అనే స్పృహ కలిగిన పక్షంలో, వారిక ఆ విధంగానే ఎదగజూస్తారు. తమ నేలను అదే మార్గంలో నిలబెట్టి స్వతంత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తారు. అంతే తప్ప, సరికొత్త ప్రభువులుగా రాగోరే వారిని అనుమతించరు. వారికి తిరిగి కాంప్రడార్ ఏజెంట్లుగా మారరు.
1953లో హైదరాబాద్ రాష్ట్రం అవతరించి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మధ్యకాలంలో ఈ తరగతి ఆలోచనలు, కార్య విధానాలు ఏ విధంగా ఉండేవో తెలియదు గానీ, సరిగా అవే మూడు సంవత్సరాల కాలంలో ఫజల్ అలీ కమిషన్‌కు, ఆంధ్ర రాష్ట్రంతో విలీనానికి మధ్య వారి కాంప్రడార్ స్వభావం మాత్రం మారలేదన్నది స్పష్టం. నిజాం ఫ్యూడల్ వ్యవస్థలో వీరికి విస్తారమైన భూములున్నా నీటి వసతి, వ్యవసాయ సంపదలు, వాటిని పెట్టుబడి పెట్టి వ్యాపార, పారిశ్రామిక దశలోకి ప్రవేశించకపోవటంతో తెలంగాణ జాతి స్పృహ ఏర్పడక, ఈ నేలపై, ప్రజలపై ప్రేమ కలగలేదు. దానితో ఆంధ్రప్రదేశ్ ఏర్పడగా వచ్చిన అటువంటి కోస్తా తరగతిపై ఆధారపడిపోయారు. ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా తాము మైనారిటీ అయి కోస్తావారు మెజారిటీ కావటం అందుకు తోడైంది. కేంద్రంలోనూ కోస్తా వారిదే పైచేయి అయింది.
ఆ విధంగా వారి కాంప్రడార్ చరిత్రలో 1956 నుంచి రెండవ అధ్యాయం మొదలైంది. అప్పటినుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు 58 సంవత్సరాల సుదీర్ఘకాలంలోనూ వారి స్వభావంలో మార్పు లేకపోవటమన్నది ఒక చారిత్రక విషాదం. ఆ కాంప్రడార్ ఫ్రేమ్‌వర్క్ నుంచి వారు బయటపడలేకపోయారు. ఆ దశాబ్దాల పొడవునా వారు గతంలో వలెనే ప్రభువులపై ఆధారపడే డిపెండెంట్ క్లాస్‌గా, వారితో కుమ్మక్కై ప్రజలను పీడించి అణచివేసే కొల్లాబరేటివ్ క్లాస్‌గా మారి, సీమాంధ్ర పాలక వర్గాలకు ఊడిగం చేశారు. ఒక క్లాసికల్ కాంప్రడార్ క్లాస్‌గా వ్యవహరించారు. నిజాం పోయినప్పుడు ఏర్పడని స్పృహ, 58 ఏండ్ల తర్వాత తెలంగాణ ప్రజలు తమంతట తాము పట్టువదలక పోరాడి, త్యాగాలు చేసి, సీమాంధ్ర ప్రభువులను పారదోలే వరకు కూడా ఏర్పడలేదు. ఆ ప్రభువులపై రాజకీయ అవకాశాల కోసం, ఆర్థికావకాశాల కోసం ఆధారపడుతూ తమ ప్రజలకు, నేలకు చెప్పరానంత ద్రోహం చేశారు.
అందువ్లలనే, అంజన్ కుమార్ యాదవ్ మాటల్లోనే మరొక మారు చెప్పుకోవాలంటే , ‘కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టి తెలంగాణను ఇవ్వకుండా కన్నమ్మ బాధలు పెట్టారు’. ఈ విధమైన తమ అనుభవాలను బట్టి తెలంగాణ ప్రజలు, ఒక కాంప్రడార్ తరగతి ఏమిటి, అది చేసే నష్టాలూ ద్రోహాలు ఏమిటనే చారిత్రక పాఠాలను నేర్వటం అవసరం. ఆ తరగతిని ప్రతిఘటించటం ఎట్లానో కూడా వారికి తెలియాలి. ఈ మాటలు కాంగ్రెస్‌లోని, నాన్-ప్యూడల్, నాన్-కాంప్రడార్ వర్గాలకు కూడా వర్తిస్తాయి.
-టంకశాల అశోక్