యూపీలోని ప్రయాగరాజ్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ‘బుల్డోజర్ న్యాయ’ విధానానికి చెంపపెట్టు లాంటిదే. ఆరోపణలు, అపోహలతో అర్థరహితంగా ఇండ్లను కూల్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. మన దేశంలో ఎవరైనా, ఏదైనా కేసులో దోషులుగా తేలితే వారి ఇండ్లను కూల్చాలని చెప్పే చట్టం ఏదీ లేదు. అలాంటి చట్టం తేవడానికి ప్రయత్నించినా అది రాజ్యాంగ విరుద్ధమే. ఇది కనీసం ఇంగితానికి అర్థమయ్యే విషయం. కానీ, యూపీ సర్కారు మాత్రం అర్థం పర్థం లేని కారణాలతో ఇండ్లు కూల్చివేసి పిల్లాపాపలను రోడ్డు పాల్జేసింది. ‘ఇలా ఇండ్లు కూల్చివేయడం అమానుషం’ అని సుప్రీం తప్పుబట్టింది. ప్రాథమిక హక్కు కిందికి వచ్చే జీవించే హక్కులో ఆవాస హక్కు ఓ విడదీయరాని భాగం. ఆ హక్కును యూపీ సర్కార్ చర్య కాలరాస్తున్నదని సుప్రీం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అం తేకాకుండా, ప్రయాగ్రాజ్ బాధితులకు కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించడం విశేషం. ‘ఇదొక ఫ్యాషన్’గా మారకూడదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
మనది రాజ్యాంగబద్ధ పాలన సాగే ప్రజాస్వామిక దేశం. నేరము-శిక్షలు ఖరారు చేయడానికి మనకు చట్టాలున్నాయి. న్యాయ వ్యవస్థలున్నాయి. శిక్షాస్మృతులున్నాయి. ఎంతటి నేరస్థుడినైనా తగిన రీతిలో విచారణ జరిపి శిక్షించాలని చెప్పే నిబంధనలున్నాయి. కానీ, ఈ నిబంధనలేవీ యూపీలోని బీజేపీ సర్కార్కు పట్టవనుకోవాలా? మరి బుల్డోజర్ న్యాయం అనే వైపరీత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా నేరం చేస్తే ఆ వ్యక్తినే శిక్షించాలి. కానీ, ఈ నేరస్థుల ఇండ్ల మీదకు బుల్డోజర్లను తోలుతున్నది యూపీ సర్కార్. ఉగ్రవాద కార్యకలాపాలు లేదా నేరపూరిత చర్యలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు చెందిన ఇండ్లను ఉన్నపళంగా నేలమట్టం చేస్తున్నారు. దీనికి ‘సత్వర న్యాయం’ అనే బిరుదు కూడా తగిలించుకున్నారు. కానీ, ఇది అన్యాయమే. కేవలం కేసులు దాఖలైతే చాలు బుల్డోజర్లు కదులుతాయి. యాజమాన్యం విస్పష్టంగా తేలకపోయినా ఇండ్లు నేలమట్టమవుతాయి. ఇలా ఇష్టారాజ్య కూల్చివేతలపై తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా మైనారిటీలను భీతావహులను చేసేందుకే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
నిజానికి ఈ బుల్డోజర్ జాడ్యం దేశమంతటా భయాందోళనలు సృష్టిస్తున్నది. మొదట్లో బీజేపీ రాష్ర్టాలకు పరిమితమైనా ఆ తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకూ విస్తరించింది. తెలంగాణలో హైడ్రా పేరిట జరుగుతున్న కూల్చివేతలూ ఆ కోవలోకే వస్తాయి. కానీ, చాలీచాలని సమయంతో నోటీసులిచ్చి, కోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టడం వంటి కుటిల విధానాలు ఇక్కడా అమలవుతున్నాయి. కూల్చివేతల సమయంలో ఓ అమ్మాయి బడి పుస్తకాలతో వీధిలోకి పరుగెత్తే దృశ్యాలు కలచివేశాయని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అలాంటి దృశ్యాలే హైదరాబాద్ మహా నగరంలోనూ హైడ్రా కూల్చివేతల్లో ఆవిష్కృతమయ్యాయి. పలు సందర్భాల్లో న్యాయస్థానాలూ మందలించినా హైడ్రా తీరు మారకపోవడం మనం చూశాం. ఇంలాటి విశృంఖల విధ్వంసాలు ఇంకానా ఇకపై సాగవనేదే విస్తృతార్థంలో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం.