మన భాషలన్నిటికీ మూల భాష సంస్కృతం. కొద్దిగా వ్యాకరణ సూత్రాలు మారి కొద్దిపాటి తేడాలుంటాయి కానీ పదాలు మాత్రం సంస్కృతంలోంచే వస్తాయి. ఉదాహరణకు ‘మహనీయుడు’ అన్న పదం తీసుకుంటే సంస్కృతంలో అది ‘మహనీయః’ అని ఉంటుంది. ఈ మధ్య పొగడ్తలలో ఉత్సాహం, అభ్యాసం కొంచెం శృతిమించి ఉండే ఆంధ్ర పేపర్లో రాజకీయాలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని – ఆయన నాయకుడు కూడా కాదు – మహనీయుడని ఆ సంపాదకుడు రాయడం చూసి కొద్దిగా ఆశ్చర్యపడి, ఆ పదానికి ఉన్న మూల అర్థం వెతికాను.
‘మహత్’ అన్న మూలపదంలోంచి దానికి సంబంధించిన మిగతా పదాలు కూర్పు జరిగింది. మహత్ అంటే ‘గొప్పది’ చేరుకోవటానికి దుస్సాధ్యమైనదని అర్థం. ‘ని’ అంటే ఎటువంటి గుణాలు లేని నిరాకారమైనది అని అర్థం. ‘య’కారం యోగాన్ని – అం టే కలయిక లేక విలీనాన్ని- సూచించే అక్షరం. అంటే ఏ గుణములేని అన్నిటికంటే గొప్పదైన దానిని చేరుకునేవాడు మహనీయుడు.
సాధారణంగా ఇది ఆధ్యాత్మిక రంగంలో వాడవలసిన పదం. ఎందుకంటే ఏ గుణాలు లేనిది పరమాత్మ ఒక్కటే! అందుకే ప్రపంచంతో సంబంధం లేకుండా నిర్వికార జీవితం గడిపిన శ్రీ రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్యులని మహనీయులని అనవచ్చు. వారు ఏ వికారాలు, లౌకిక కోరికలు లేకుండా బ్రతికిన మహనీయులు. ఒకసారి ఒక శిష్యుడు తెలియనితనంతో తన దగ్గర ఉన్న కొద్ది పాటి డబ్బును గుడిలో చెట్టు కింద గల మంచం మీద ఉన్న పరుపు కింద పెట్టాడట మళ్లీ అవసరమైనప్పుడు తీసుకోవచ్చని.
కొద్దిసేపటికి ఎవరో కలవటానికి వస్తే రామకృష్ణ పరమహంస వచ్చి ఆ మంచం మీద కూర్చున్నారు. నిముషంలో వారి శరీరంలో మంటలు పుట్టాయి. ఆ వేడి పొగలుగా బయటికి రావడం చూసి చటుక్కున లేచారుట. ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మంచం మీద పరుపు తీసిదులుపుదామనుకున్నప్పుడు ఆ డబ్బు కనిపించిందట! అంటే ప్రపంచానికి సంబంధం ఉన్న ఏదీ రామకృష్ణకు సరిపడదు. అది మహనీయత్వం అంటే!
ఇక సామాజిక రంగంలో కొందరుంటారు. ఏమీ ఆశించకుండా తమ స్థాయికి తగ్గట్టు, ఇతరులకు సహాయం చేసేవారు, నిష్కామకర్మగా. ఆస్పత్రులలో రోగులకు అన్నం పెడతారు. కానీ వారి పక్కనుండి వారిని చూసుకునే వారు అష్టకష్టాలు పడతారు. బయట హోటళ్లకు వెళ్లి భోజనం చేయాలి. రోగుల పక్కనుండే వారికి తమ ఇంటి దగ్గర వండి తీసుకువచ్చి భోజనాలు పెట్టేవారి గురించి విన్నాం. అది వారు కేవలం కష్టంలో ఉన్న సాటి మనిషికి సేవ చేయాలన్న దృక్పథంతో చేసే గొప్ప పని. కరోనా సమయంలో కూడా చాలాచోట్ల ఇట్లా భోజనాలు పంపిణీ చేశారు కొందరు ఉచితంగా. నిజానికి వీరిని కూడా మహనీయులు అనవచ్చు. బాల కార్మికులని రక్షించేవారు, అనాథ, వీధి బాలల గురించి శ్రద్ధ తీసుకునేవారు కూడా గొప్పవారు. అయితే టీఆర్పీలు మాత్రం కావాలనుకునే మన మీడియా వారికి వీరు కనపడరు.
మరి రాజకీయరంగంలో ఒకే పార్టీలో రెండు విభిన్న వ్యక్తిత్వాలున్నవాళ్లని చూస్తున్నాం. వాజపేయికి 1996లో అకస్మాత్తుగా జయలలిత తన సమర్థన ఉపసంహరించుకున్నప్పుడు కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడు తక్కువయ్యాడు. వేరే పార్టీలలోంచి తీసుకుందామని చెప్పినా, వాజపేయి ఒప్పుకోకుండా ప్రధాని పదవి వదులుకున్నారు. రాజకీయరంగంలో వి లువలంటే అవి! మరి అదే పార్టీ ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఇదివరకు పక్కపార్టీ వాడిని ప్రలోభపెట్టి తమ పార్టీలోకి మార్పించడాన్ని హార్స్ ట్రేడింగ్ అనేవారు, అంటే గుర్రాలను కొన్నట్టు. మరి మహనీయుడు వాజపేయి పార్టీలో హార్స్ ట్రేడింగ్ చేసేవాళ్లు ఉండటానికి తగినవారేనా?
రాజకీయరంగంలో గొప్పవారి గురించి చెప్పినప్పుడు ఎవరికైనా అబ్రహాం లింకన్ గుర్తురాక మానడు. అమెరికా 16వ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన అబ్రహాం లింకన్ అరుదైన వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నేత. కట్టెలు కొట్టుకుంటూ, చెప్పులు కుట్టుకొని కుటుంబాన్ని పోషించుకున్న తండ్రికి పుట్టి అగ్రరాజ్యానికి అధినేత అయిన ధీరుడు. అమెరికాలో బానిసత్వాన్ని రూపుమాపడానికి శాయశక్తులా ప్రయత్నించి ఆ కారణంగానే హత్యకు గురై అసువులు బాశాడు. ఆయన అధ్యక్షుడైనపుడు, ఒక ముఖ్యమైన సమావేశంలో ప్రత్యర్థి ఆయనను కించపరచటానికి ప్రయత్నించాడు.
‘మా నాన్నకి మీ నాన్న కుట్టి ఇచ్చిన చెప్పులు కొంచెం వదులయ్యాయి. సరిగ్గా లేవు’ అని హేళనగా అన్న ఆయనకు లింకన్ సమాధానం చెప్పాడు. ‘మా నాన్న గారు ఇప్పుడు లేరు, ఆయన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. వారి దగ్గర నేనూ పని నేర్చుకున్నాను. మీ నాన్న గారు ఆ చెప్పుల జత ఉపయోగించదల్చుకుంటే చెప్పండి. నేను రిపేర్ చేసి ఇస్తాను’ అని ఎంతో వినయంగా సమాధానం ఇచ్చాడు. ఆయన మహనీయుడు!
తన కుమారుడికి చదువులో ఏమి చెప్పాలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునికి రాసిన లింకన్ సందేశం ప్రపంచంలోని విద్యారంగాలన్నీ అనుసరించతగ్గది. తన ఉత్తరంలో ఈ విధంగా రాశాడు అబ్రహాం లింకన్. ‘ప్రపంచంలో మనుష్యులందరూ మంచివారే ఉండరని మీరు నా కుమారుడికి బోధిస్తారని నాకు తెలుసు. కానీ, ఇంకో విషయం చెప్పండి. ప్రతి దుర్మార్గుడికి ప్రతిగా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కూడా ఉంటాడని చెప్పండి.
స్వార్థపూరిత రాజకీయాలు నడిపే ప్రతి ప్రతినిధికి ప్రతిగా ఒక నిస్వార్థ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కూడా ఉంటాడని నమ్మకంగా చెప్పండి. ప్రతి శత్రువుకు ప్రతిగా ఒక చక్కటి స్నేహితుడు కూడా దొరుకుతాడని చెప్పండి. కష్టపడి సంపాదించిన చిన్న మొత్తం, మోసం చేసి సంపాదించిన పెద్ద మొత్తం కంటే విలువైనదని చెప్పండి. నా కొడుకు విజయాలను, అపజయాలను ఒకేరకం గా ఎదుర్కొనేటట్టు చేయండి. అసూయ కాకుం డా ఆహ్లాదకరంగా నవ్వుకోవటం నేర్పండి.
పుస్తకాలు చదవటం ప్రకృతిని ఆస్వాదించటం నేర్పండి. విశాలమైన ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులని, తోటలలోని చక్కటి పూలను చూసి ఆనందించటం నేర్పండి. మోసం చేసి పైకి రావటం కంటే పాఠశాలలో అయినా, జీవితంలో అయినా వైఫల్యం చెందడం గౌరవప్రదం అని చెప్పండి. తన మీద, తన ఆలోచనల మీద నమ్మకం కలిగి ఉండాలని నేర్పండి. సున్నిత మనస్కులతో సున్నితంగా ఉండటం, కరకుగా ఉండే మనుష్యులతో దృఢంగా ఉండటంలో శిక్షణ ఇవ్వండి. అందరూ చేస్తున్నారు కదా అని ఒక పని చేయడమో, గుంపులో కలవటమో కాకుండా, తన ఆలోచనలకు పదునుపెట్టి, సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పండి. అందరూ చెప్పింది విని, మంచి మాత్రం గ్రహించేటట్టు చేయండి.
విచారంలో కూడా నవ్వటం లేదా కన్నీరు పెట్టడానికి సిగ్గపడనక్కరలేదని కూడా నమ్మేటట్టు చేయండి. నిరాశావాదులని నమ్మవద్దనీ, అతి వినయంగా ఉండేవాళ్లు ప్రమాదకరమనీ, ఆత్మను అమ్ముకోవద్దనీ శిక్షణ ఇవ్వండి. ఒంటరిగా అయినాసరే సత్యం కోసం పోరాడాలని నమ్మకంగా చెప్పండి. గారాబం చేయకండి, అతి చనువు ఇవ్వకండి, కానీ సున్నితంగా చెప్పండి. ఏదైనా, ఓపిక, ధైర్యం ఉండాలనీ, ఆత్మవిశ్వాసం ముఖ్యమనీ, నా కొడుకుకు అర్థం చేయించండి’ గౌరవభావంతో అబ్రహాం లింకన్.
ఈ సందేశం ప్రతి తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు పాటిస్తే బహుశా వచ్చే తరాల్లో రాజకీయాల్లో కూడా మోసగా ళ్లు, దుర్మార్గులు కాకుండా, మహావ్యక్తి త్వం ఉన్న మనుష్యులు నాయకులయ్యే అవకాశం ఉన్నది. జై తెలంగాణ.
మరి రాజకీయరంగంలో ఒకే పార్టీలో రెండు విభిన్న వ్యక్తిత్వాలున్నవాళ్లని చూస్తున్నాం. అటల్ బిహారీ వాజపేయి 1996లో అకస్మాత్తుగా జయలలిత తన సమర్థన ఉపసంహరించుకున్నప్పు డు కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడు తక్కువయ్యాడు. వేరే పార్టీలలోంచి తీసుకుందామని చెప్పినా, వాజపేయి ఒప్పుకోకుండా ప్రధాని పదవి వదులుకున్నాడు. రాజకీయరంగంలో వి లువలంటే అవి! మరి అదే పార్టీ ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఇదివరకు పక్కపార్టీ వాడిని ప్రలోభపెట్టి తమ పార్టీలోకి మార్పించడాన్ని హార్స్ ట్రేడింగ్ అనేవారు, అంటే గుర్రాలను కొన్నట్టు. మరి మహనీయుడు వాజపేయి పార్టీలో హార్స్ ట్రేడింగ్ చేసేవాళ్లు ఉండటానికి తగినవారేనా?
– కనకదుర్గ దంటు 89772 43484