కాలం కర్పూర ధూమదీపంలా కాలుతూనే ఉంటుంది. గడియారం ఎవ్వరికోసమూ ఆగదు. రోజుకు ఇరవై నాలుగ్గంటలు. వాడుకో, మానుకో అంతే. కార్యభారం ఎప్పుడు మొదలు పెట్టాం.. ఎక్కడిదాకా వచ్చాం అనేది కాదు. ఏం సాధించామనేదే ముఖ్యం. వార్షికోత్సవాలు, దశాబ్ది ఉత్సవాలు, రజత, స్వర్ణ, వజ్రోత్సవాలు ఇలా కాలరేఖపై ఎన్ని కొలతలు గీసుకుంటేనేం.. ఎన్ని శిఖరాలు అధిరోహించామనేది లెక్కలోకి వస్తుంది. గత దశాబ్దం పైచిలుకు కాలంగా, కచ్చితంగా చెప్పాలంటే పుష్కర కాలంగా, దేశానికి నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారు. ఆయన పదవీకాలాన్ని రోజుల్లోకి మార్చి లెక్కగట్టి 4,399 రోజులుగా తేల్చారు భక్తగణం. పైగా అది ప్రథమ భారత ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించిందని సంబరాలు చేసుకుంటున్నారు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధానిగా పదవీ భారం చేపట్టారు. 1964 మే 27 వరకు కొనసాగారు. అయితే 1951-52లో ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి మాత్రమే నెహ్రూ పదవీకాలాన్ని లెక్కగట్టి.. ఆ రోజుల సంఖ్యను మోదీ దాటేశారని బీజేపీ నేతలు వితండవాదం తీస్తున్నారు. అదే గొప్ప ఘనతగా చిత్రీకరిస్తున్నారు. నిజానికి నెహ్రూ నాయకత్వం వహించిన 1947-52 ఆ తొలి అయిదేండ్ల టర్మ్ జాతి జీవితంలో కీలకమైనవని చెప్పాల్సిన అవసరం లేదు. నెహ్రూ నవస్వతంత్ర భారత నూతన ప్రధానిగా జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నుంచి శ్యామాప్రసాద్ ముఖర్జీ వరకు అన్నివర్గాల నాయకులతో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని ఏకతాటి మీద నడిపించారు. వలసపాలన నుంచి విముక్తమైన దేశాన్ని పునర్నిర్మించే బృహత్తర బాధ్యతను ప్రతిభావంతంగా నెరవేర్చారు. శాస్త్రసాంకేతికాభివృద్ధికి పునాదులు వేసి ప్రపంచస్థాయి అందుకునేలా చేశారు. చాలాకాలం ప్రధాని పదవితోపాటు విదేశాంగ శాఖను నిర్వహించి విశ్వవేదికలపై దేశ ప్రతిష్టను సమున్నతంగా నిలబెట్టారు. ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయి ప్రచ్ఛన్నయుద్ధంలో తలమునకలు అవుతుంటే, అలీనోద్యమాన్ని నిర్మించి ప్రపంచ అగ్రనాయకుల్లో ఒకరిగా నిలిచారు.
భారత స్వాతంత్య్రపోరాట యోధుల్లో నెహ్రూ అగ్రగణ్యుడు. వృద్ధి, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అనుకోవాల్సిన దశలో ఏడు సంవత్సరాలకు పైగా దేశం కోసం జైలుజీవితం అనుభవించారు. ఆనంద్ భవన్ వంటి ఆస్తిపాస్తుల్ని దేశానికి ధారపోశారు. దేశవిదేశీ పాత్రికేయులతో ధారాళంగా ముచ్చటించేవారు. పత్రికా సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించేవారు. తన మీద వచ్చే కార్టూన్లను సరదాగా తీసుకునేవారు. జైలు నుంచి తన కూతురు ఇందిరకు రాసిన లేఖలు ఉద్గ్రంథాలయ్యాయి. ఇలా బహుముఖీన వ్యక్తిత్వం, సమర్థ నాయకత్వం నెహ్రూ సొంతం.
అయితే, కృతకంగా కుదించిన నెహ్రూ పదవీకాలాన్ని చూపి దానిని మోదీ దాటేశారని కాషాయ శ్రేణులు హంగామా చేస్తున్నాయి. ఈ ప్రచార పటాటోపంలో నెహ్రూ కన్నా మోదీ గొప్ప అనే శ్లేష ఉన్నది. పొద్దునలేస్తే నెహ్రూపై బురదజల్లే అభిమానులు, మోదీ ఏదో గొప్ప మైలురాయి దాటినట్టుగా చూపిస్తున్నారు.
ఇక, ఇందిరాగాంధీ కూడా రెండు టర్మ్‌లలో కలిపి, 5,829 రోజులు ప్రధానిగా ఉన్నారు. ‘ఎన్నికల్లో గెలిచి, నిరంతరాయంగా కొనసాగటం’ అనే లెక్కతో మోదీనే గొప్ప అంటూ ఆయన బృందం ప్రచారం చేసుకుంటున్నది. పోనీ మోదీ సుదీర్ఘ పదవీకాలాన్ని గుర్తించినా, ఆయన సాధించిన విజయాలేమిటి? నెహ్రూ, ఇందిరాగాంధీ విజయాలతో మోదీకి పోలిక సాధ్యమా?
ప్రజాజీవితంలో విజయాలు ఎప్పుడూ నిగూఢ రహస్యాలు కావు. అవి అనుభవైకవేద్యాలు. మోదీ పరిపాలన సుదూర గతం కాదు కదా. గత పన్నెండేండ్లుగా చూసినది, ఇప్పటికీ చూస్తున్నదే కదా. నెహ్రూ, మోదీ మధ్య ప్రధానంగా చాలా వైరుధ్యాలున్నాయి. వాటిని పక్కన పెట్టి స్థూలంగా తేడాలేమిటో చూద్దాం. నెహ్రూ లాగా దేశపరిపాలన ప్రథమంగా పట్టాలెక్కించాల్సిన స్థితిలో మోదీ ఏమీ లేరు. నడుస్తున్న చరిత్ర మీద నాయకత్వం సాగించటమే ఆయన కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణలో చెప్పుకోవాల్సిన ఘనతలు ఏవైనా ఉన్నయా అని పరిశీలిస్తే మనకు ఏం కనిపిస్తాయి? ప్రజల బతుకుతెరువులోని బాగోగులే మోదీ పాలనకు గీటురాయి. నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థతో సమతూకం సాధిస్తే, మోదీ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అసమతూకం తారస్థాయికి చేరింది. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల ఆధిపత్యం పాతుకుపోయింది. దేశం అప్పు 214 లక్షల కోట్లు దాటింది. పారిశ్రామికంలో అట్టహాసంగా మొదలుపెట్టిన మేకిన్ ఇండియా గుట్టుచప్పుడు కాకుండా అటకెక్కింది.
కోట్లాది ఉద్యోగాల హామీ గాలికెగిరిపోయి దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. నోట్ల రద్దు, జీఎస్టీలో అవకతవకలు వంటి అనాలోచిత నిర్ణయాల ఫలితంగా పరిశ్రమలు మూతపడటం ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. విద్యారంగంలో పరీక్ష ప్రశ్నా పత్రాల లీకుల రూపంలో ఘోరవైఫల్యాలు ఎదురవుతున్నాయి. రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి.
రైతుల ఆదాయం రెట్టింపు ఉత్తమాట అయ్యింది. నల్లచట్టాలతో రైతుల మెడలు వంచి సాగును కార్పొరేట్‌కు కట్టబెట్టే కుట్రలు సాగుతున్నాయి. న్యాయం బుల్డోజర్ల కింద నలిగిపోతున్నది. బేటీ బచావ్, బేటీ పఢావ్ శుష్క నినాదమైంది. అత్యాచారాలు పెరిగిపోయి బేటీకి రక్షణ కరువైంది. సంపన్నులు మరింత సంపన్నులవుతుంటే పేదలు మరింత పేదలవుతున్నారు. దేశ జీడీపీ పెరుగుతున్నదని ప్రచారం చేసుకుం టున్నారు. అదే సమయంలో అసమానతలు అగాథంలా విస్తరిస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. రాజ్యాంగ సంస్థలను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంటున్నది. దర్యాప్తు సంస్థలను పార్టీ ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నది. మతం పేరిట దేశ ప్రజలను విభజించటం అంతకంతకూ తీవ్రతరమవుతున్నది.
మోదీ ప్రభుత్వంలో, పాలకపక్ష ఎంపీల్లో ఒక్కరంటే ఒక్కరు మైనారిటీ సభ్యుడు లేకపోవడం దేనికి తార్కాణం? సూటూబూటూ, కరచాలనాలు, కావలింతలనే విదేశాంగ విధానంగా చలామణి అవుతుండటంతో ఘోర వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఒకనాడు ప్రపంచానికి దారిచూపిన భారతదేశం ఇప్పుడు విశ్వవీధుల్లో మిత్రులను కోల్పోయి ఒంటరిగా నిలిచినట్టు కనిపిస్తున్నది. ఇరుగుపొరుగు దేశాలు చైనా ప్రాపకంతో భారత్ పైకి గుడ్లెర్రజేసే రోజులు దాపురించాయి. సంతోషం, పత్రికా స్వేచ్ఛపై రూపొందించే అంతర్జాతీయ సూచీల్లో భారత్ స్థానం నానాటికి దిగజారిపోతున్నది. ప్రధాని మీడియాతో వ్యవహరించే తీరు అంతర్జాతీయంగా అపహాస్యం పాలవుతున్నది. వీటన్నిటిలో నెహ్రూ పాలనతో పోల్చదగింది ఏదైనా ఉందేమో ఎవరికి వారు ఆలోచించాల్సిందే. ఓ కవి చెప్పినట్టుగా ’పదం-పద్యం పట్టి నిలుచును నేతల కీర్తులపకీర్తుల్’. అంతిమంగా చరిత్రదే అంతిమ తీర్పు.
– తుమ్మలపల్లి రఘురాములు