అన్నాన్ని పరబ్రహ్మ
స్వరూపం అంటారు
అదంతా సుద్దతప్పు
అన్నం రైతన్న వేలికొనల నుండి
రాలిపడిన చెమట చుక్కల సారం
పయ్యంత మట్టి పూసుకొని
రేయంత ఒడిగట్టుకొని
భూమి కండ్లలో కండ్లు పెట్టి
విత్తనాలకు పురుడుబోసి సాదుకుంటేనే
కల్లంల పంట రాశులయ్యేది.
ప్రతి గింజ మీద
తినేవాడి పేరుంటదంటారు
ఇదీ కూడా తప్పే అనుకుంటాన్నేను
ప్రతి గింజ మీద రైతు పేరైతే
కచ్చితంగా రహస్య లిఖితమే.
ఈ భూమ్మీద
యుద్ధం జరిగినా
ఏ విప్లవం చెలరేగినా అదంతా
అన్నం కోసం జరిగినదే
మీలో ఎవరైనా కాదంటారా?
నేనైతే అన్నం పెట్టిన చేతికి
పంట పండిన పొలానికి
పొద్దుకోసారి ప్రణమిల్లుతా
బహుశా!
ఆకలిదీర్చినందుకు
కృతజ్ఞత భావమేమో!
మా ఊరి పెద్దలంటుంటే విన్నాను
అన్నానికి ఆత్మగౌరవాలు
తాకట్టుబడ్డయి.!
పాసిన బువ్వకు పయిటాలదాకా
దున్నపోతుల గెడం
దున్నిన జీవితాలున్నయి
ఆలికి కట్టిన తాళిపుస్తెలు తెంపబడ్డయి
ఆరు ఎకరాల భూమి పిడికెడు
అన్నానికి అమ్మబడింది.
అన్నం నిర్వచనం సరిగ్గా నిర్వచించలేనిది!
ఒక్కొక్కరికి ఒక తీరు
ఉన్నోడికి అరగనిది
లేనోడికి దొరకని నిధి
-అవనిశ్రీ ,99854 19424