కొన్నాళ్ల క్రితం ఖమ్మంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసిన బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చండి.. ఏమన్నా అయితే నేంజూసుకుంటా అని ఎన్టీఆర్ అభిమానులకు చంద్రబాబు అనుచరగణానికి రెచ్చగొట్టారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ చిద్విలాసంగా నవ్వుతూ తనవైపు రమ్మని బహిరంగానే రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. వెనువెంటనే ప్రత్యేకమైన సందర్భమేదీ లేకుండా హైదరాబాదులో చంద్రబాబు ఇంటికి వెళ్లి సుదీర్ఘ మంతనాలు జరిపారు. అదేపనిగా పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. అమిత్ షా, పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన వ్యవహారంలో ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కూటమి మద్దతుదారులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాడికి ఎగబడ్డారు.
అమిత్‌షాతో, పవన్ కల్యాణ్ భేటీకి సంబంధించిన వ్యవహారంలో నాగేశ్వర్ చేసిన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నప్పటికీ జనసేన కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆంధ్రాలో ఒకటి రెండు చోట్ల పోలీస్ కేసులు నాగేశ్వర్ తెలంగాణ పోలీసులను ఆశ్రయించడం వరకు వ్యవహారం తీవ్రస్థాయికి చేరింది. ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో జరిగిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. ఆంధ్ర పదం ఉన్నది తప్ప, తెలంగాణ పదం అసలు డిక్షనరీలోనే లేదని, దాన్ని స్వార్థపరులు సృష్టించారని ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు అన్నారు. అదే రోజు హైదరాబాద్‌లో సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణకు పోకుండా అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటిలాగే తెలుగుదేశం రాగం ఎత్తుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఒక సభ ఏర్పాటు చేశారు. ఈ వరుస ఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయంటే నమ్మలేం. తెలంగాణపై మళ్లీ ఏవో కుట్రల మేఘాలు కమ్ముకుంటున్నాయి.
కేసీఆర్ ధాటికి తెలంగాణ రాజకీయాలకు క్రమక్రమంగా దూరమైన చంద్రబాబుకు పదేండ్ల తర్వాత మళ్లీ రావడానికి ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఏడాది తిరగకముందే ఓటుకు నోటు ఉదంతంలో దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖం చాటేశారు. అనంతరం ఏడాదిన్నరకి జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లోకేశ్ రంగంలోకి దిగి ప్రచారం చేసినా తెలుగుదేశం పార్టీ ఒక్క సీటుకే పరిమితమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పునఃప్రవేశానికి ప్రయత్నించినా రెండు సీట్లకే పరిమితమైంది.
2023 ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. తెలుగుదేశం పార్టీ కదలికలు, కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కే పరిమితమైపోయాయి. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం పార్టీ ఆశలు మళ్లీ చిగురించడం ప్రారంభమైంది. అందు కారణం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధినేత అయినప్పటికీ ఏనాడు చంద్రబాబుతో సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల పక్షాన బరిగీసి నిలువలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతంతో. కాంగ్రెస్ పార్టీ సైతం సమైక్య రాష్ట్రంలో 35 ఏండ్ల పాటు తెలుగుదేశం పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో, కార్యక్రమాల్లో తెలుగుదేశం జెండాలు ఎగురుతున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రచార సమయంలో చంద్రబాబు సహా తెలుగుదేశం అగ్రనేతలను అక్కడికే పరిమితం చేశారు. తెలంగాణలో అడుగుపెట్టనీయలేదు. రేవంత్‌రెడ్డి అటు మోదీని ఇటు చంద్రబాబును భుజాన ఎక్కించుకుని ఊరేగుతున్నా నియంత్రించలేని దీనస్థితికి కాంగ్రెస్ చేరుకున్నది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీకి చిక్కని యోధుడు కేసీఆర్. తెలంగాణ ప్రయోజనాల విషయానికొస్తే ఎవరికీ తలవంచని నైజం కేసీఆర్ సొంతం. ఉద్యమంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణపై ఈగ వాలినా ఆయన సహించరు అనేది జగమెరిగిన సత్యం. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. కేసీఆర్ అధికారంలో లేరు. రేవంత్‌రెడ్డిని తెలుగుదేశం, బీజేపీ అవకాశం అనుకుంటున్నాయి. ఆ రెండు పార్టీల మూలాలు తనలో ఉన్నాయని రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఇదే అదనుగా తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవాలను భగ్నం చేయడానికి, బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఒక్క తాటి మీదికి వచ్చాయిని వరుస పరిణామాలను బట్టి స్పష్టమవుతున్నది. కుడి, ఎడమల మిత్రపక్షాల భుజాలపై చేతులు వేస్తే తప్ప రాజకీయంగా ఒక్క అడుగూ ముందుకువేయలేని చంద్రబాబు నెరపే రాజకీయ స్నేహాలకు ఒక శాశ్వతత్వం ఉండదు. అవసరాన్ని బట్టి ఎవరితోనైనా జత కట్టడం, వదిలి పెట్టడం ఆయన ఎత్తుగడల నైజం. స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నేతలు పావులు మాత్రమే. జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్న సంకేతం అదే. పుష్కర తెలంగాణదీపం కొడిగట్టే ప్రమాదమున్నది. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!