ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బీహారీ డీఎన్ఏ’ అనే వ్యాఖ్యలు చేసి ఏడాదిన్నర అవుతున్నది. వ్యాఖ్యలు వివాదాస్పదమైనా అవి సాధారణంగా కాలక్రమంలో మరపున పడుతుంటాయి. కానీ, ఈ వ్యాఖ్యలు మళ్లీ మళ్లీ చర్చలోకి వస్తున్నాయంటే అందుకు కారణమేమిటో అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కాగా, తాజాగా శనివారం నాడు అదే పార్టీకి చెందిన బీహార్ నాయకుడు కన్హయ్య కుమార్, రేవంత్‌ను ప్రశాంత్ కిశోర్‌కు మించిన పరుషమైన భాషలో విమర్శించారు. ఇట్లా ఎందుకంటే, ఒక వ్యక్తి, లేదా జాతి డీఎన్ఏ అన్న ప్రస్తావన చాలా సెన్సిటివ్ విషయం. హీనమైన డీఎన్ఏ అనడమంటే ‘నువు ఛండాలుడివి’ అనటం వంటిది. ఇదంతా ఒక కోణం కాగా, అసలు కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో వస్తున్న మౌలికమైన మార్పుల గురించి రేవంత్ ఆలోచనలు ఏమిటో తెలియవు. తన పార్టీ డీఎన్ఏయే మారుతున్న సంగతి ఆయనకు తెలుసో లేదో తెలియదు.
వాస్తవానికి డీఎన్ఏలు, వాటిలో తేడాలు, వేల సంవత్సరాల కాలంలో వాటికి మ్యుటేషన్లు అనేవి ఉంటాయి గాని, గొప్ప డీఎన్ఏలు, హీనమైనవి అంటూ ఉండవు. ఏ ప్రాంతపు ఏ ప్రజలైనా తమ నైసర్గిక పరిస్థితులు, వాతావరణాల మధ్య తమవైన గొప్ప చరిత్రలు, సంస్కృతులు రూపొందించుకున్నారు. ప్రాకృతికంగా అనేక పరిమితులుండే పర్వత ప్రాంతాల వారు, ఎడారి వాసులు కూడా. బీహార్ విషయానికి వస్తే అక్కడి మహా సామ్రాజ్యాలు, ప్రాచీన విశ్వవిద్యాలయాలు, బౌద్ధం, శిల్పకళా వైభవం, సంస్కృతి గురించి అందరికీ తెలిసిందే. వర్తమానానికి వస్తే, అక్కడి ప్రజలు ఎంతో ఆలోచనాపరులని, శ్రమకు వెరవనివారని, అక్కడితో కొద్దిపాటి పరిచయం గలవారికి కూడా తెలుసు. ఆ సమాజంలోని డైనమిజం గురించి సోషియాలజిస్టులు చెప్తుంటారు.
బీహార్‌లో నదులకు, సుక్షేత్రాలకు కొరత లేదు. ఝార్ఖండ్ వేరే రాష్ట్రంగా ఏర్పడక ముందువరకు అడవులు, ఖనిజ సంపదలో మొత్తం దేశంలోనే అగ్రగామి రాష్ట్రం. ఉపాధి కోసం బయటివారు అక్కడికి వలసవెళ్లటమే తప్ప, అక్కడినుంచి బయటకు పోవలసిన అవసరం లేదు.
అటువంటిది పరిస్థితులు క్రమంగా మారటానికి ఏకైక కారణం దేశానికి స్వాతంత్య్రం లభించినది మొదలు (రేవంత్ రెడ్డికి చెందిన) కాంగ్రెస్ పార్టీ సాగించిన దుష్పరిపాలన, భయంకరమైన దోపిడీ పాలన. ఆఫ్రికాను పాశ్చాత్యులు దోచుకొని బాగుపడగా, పేదలుగా మారిన ఆఫ్రికన్లు ఉపాధి కోసం వలస పోవటం వంటి పరిస్థితే ఇది కూడా.
కనీసం ఢిల్లీలో కూర్చునే కాంగ్రెస్ పెద్దలైనా ఈ మాట తనకు చెప్పి ఉంటారా అనే సందేహం కలుగుతున్నది. ఆయన బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ముందు కూడా చర్చలో ఉండిన ఈ విషయం ఆ నాయకుల దృష్టికి వెళ్లకపోవచ్చునని మాట వరసకు అనుకుందాం. కానీ, ఆ ప్రచార సమయంలో ఒక వాహనంపై రేవంత్ రెడ్డి మధ్యలో ఉండగా రెండువైపులా నిల్చుండిన రాహుల్, ప్రియాంకలకు, కనీసం ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్ తదితరులు లేవనెత్తినప్పుడైనా విషయం తెలిసి ఉండాలి. ఇప్పుడు తమ పార్టీకే చెందిన కన్హయ్య కుమార్ ఘాటు వ్యాఖ్యలైనా చెవిన పడి ఉండాలి.
బీహార్‌లో కాంగ్రెస్ గొడుగు కింద చేరిన భూస్వామ్య కులాలవారు వేలకు వేల ఎకరాలను తమ అధీనంలోకి తీసుకొని, బడుగువర్గాలకు ఏమీ చెందకుండా చేసి, దోపిడీ చేసి, అణగదొక్కి, కూలీల ప్రపంచం ఒకటి తయారుచేశారు. మరొకవైపు అపారమైన ఖనిజ సంపదను, అటవీ సంపదను బయటి పెట్టుబడిదారులకు అప్పగించారు. ఆ పరిశ్రమలలో కూలీ పని కోసం స్థానిక బడుగులను, చిన్న రైతులను, గిరిజనులను నియోగించారు. ఇవన్నీ (రేవంత్ రెడ్డికి చెం దిన) కాంగ్రెస్ పాలనలోనే జరిగాయి. ఇదే కాలంలో, స్థానికంగా ఎన్నెన్నో వనరులున్నా, భూస్వాముల వద్ద పరిశ్రమలలో కూలీలుగా పనిచేసినా, తగినన్ని అవకాశాలు లేనివారు లక్షల సంఖ్యలో ఇతర రాష్ర్టాలకు వలసలు పోయారు, ఇప్పటికీ పోతున్నారు. ఇటువంటి పరిస్థితులలోనే అక్కడ పేదలు లెక్కలేనన్ని తిరుగుబాట్లు చేశారు. ‘సేన’లు అనేవి ఏర్పాటు చేసుకొని భూస్వాముల సేనలతో తలపడ్డారు. నక్సలైట్లయ్యారు. వివిధ కుల పార్టీలు, సోషలిస్టు పార్టీలకు మద్దతుగా నిలిచి (రేవంత్ రెడ్డికి చెందిన) కాంగ్రెస్‌ను పదే పదే చిత్తుగా ఓడించారు. ఇప్పటికీ ఓడిస్తున్నారు. ఇటువంటి తన సుదీర్ఘమైన ‘పాపపు చరిత్ర’ ఫలితంగానే (రేవంత్ రెడ్డికి చెందిన) ఆ పార్టీ గత కొన్ని ఎన్నికలుగా ప్రతిసారి, ఇతర పార్టీలను సీట్లు అడుక్కోవలసిన స్థితికి పతనమైంది.
కనుక ‘బీహారీ డీఎన్ఏ’ అంటూ మాట్లాడదలిస్తే ఇటువంటి నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని తప్పక మాట్లాడవచ్చు. మాట్లాడాలి కూడా. స్వాతంత్య్రానంతరం నుంచి మొదలుకొని (రేవంత్ రెడ్డికి చెందిన) కాంగ్రెస్ పాలనలో రూపుదిద్దుకుంటూ వచ్చిన ‘బీహారీ దోపిడీదార్ల డీఎన్ఏ’ ఒకటైతే, వారి బారినపడి తరతరాలుగా మగ్గుతున్న ‘బీహారీ బడుగుల డీఎన్ఏ’ మరొకటి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక వివరణ ఇవ్వబూనవచ్చు. తాను దృష్టిలో ఉంచుకున్నది గత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘అనుకూలంగా, అక్రమ పద్ధతులలో పనిచేసిన’ బీహార్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లను మాత్రమేనని. కానీ, ఆయనకు అర్థం కానిది అప్పటికీ ఒక్కటి ఉంది.
అది సంస్కృతి, స్వాభిమానాల సంబంధమైనది. తన ఉద్దేశం అటువంటి అధికారుల గురించి మాత్రమే అయితే నేరుగా వారిపైనే విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ పనిచేసే అఖిల భారత సర్వీసు అధికారులలో అనేక రాష్ర్టాలకు చెందినవారు ఉంటారు గనుక, తెలుగువారూ ఉంటారు గనుక, ఎవరు అక్రమంగా వ్యవహరించినా చర్యలు తీసుకోవచ్చు. వారిలో ఒక రాష్ట్రం వారిని మాత్రమే ఎత్తిచూపదలిస్తే, అది అయినా ఎంతమాత్రం భావ్యం కాదు గాని కనీసం తక్కువ అభ్యంతరకరమవుతుంది. కానీ, అందుకు డీఎన్ఏ అనే మాటను జోడించటం లక్ష్మణరేఖను అతిక్రమించటమే. అది జాతి, కులం, మతం వంటి జోడింపులతో నిందించటం వంటిది అవుతుంది. సెన్సిటివ్‌గా మారుతుంది. అటువంటి జోడింపులతో నిందలు సెన్సిటివ్‌గా మారినప్పుడు అవి ఆ అధికారులకు పరిమితమైన భావనలు కాబోవు. మొత్తం బీహారీలు ఒక జాతిగా, సాంస్కృతికంగా, మనోభావనల పరంగా స్పందిస్తారు.
బహుశా రేవంత్ రెడ్డి వంటి వ్యక్తులు అర్థం చేసుకోలేని విషయమిది. కనీసం ఢిల్లీలో కూర్చునే కాంగ్రెస్ పెద్దలైనా ఈ మాట తనకు చెప్పి ఉంటారా అనే సందేహం కలుగుతున్నది. ఆయన బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ముందు కూడా చర్చలో ఉండిన ఈ విషయం ఆ నాయకుల దృష్టికి వెళ్లకపోవచ్చునని మాట వరసకు అనుకుందాం. కానీ, ఆ ప్రచార సమయంలో ఒక వాహనంపై రేవంత్ రెడ్డి మధ్యలో ఉండగా రెండువైపులా నిల్చుండిన రాహుల్, ప్రియాంకలకు, కనీసం ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్ తదితరులు లేవనెత్తినప్పుడైనా విషయం తెలిసి ఉండాలి. ఇప్పుడు తమ పార్టీకే చెందిన కన్హయ్య కుమార్ ఘాటు వ్యాఖ్యలైనా చెవిన పడి ఉండాలి.
అటువంటి జోడింపులు, వ్యాఖ్యలు తగనివని, తాము ఆమోదించలేనివని రేవంత్ రెడ్డికి చెప్పే సాహసం గత ఏడాదిన్నరగా చేయలేకపోయిన గాంధీ కుటుంబం, కనీసం ఇప్పుడు ప్రశాంత్ కిశోర్, కన్హయ్య కుమార్ల హెచ్చరికల తర్వాతనైనా చేస్తుందా? లేనిపక్షంలో రేవంత్ సంస్కృతి, సంస్కారాల స్థాయి ఏదో ఆ కుటుంబపు స్థాయి కూడా అదే స్థితికి చేరినట్లు భావించవలసి వస్తుంది. ఏడాదిన్నరగా పెచ్చరిల్లుతున్న ఈ సమస్యకు పరిష్కారం ఉంది. అది, రేవంత్ రెడ్డి బీహార్ ప్రజలకు బేషరతుగా, స్పష్టమైన రీతిలో, ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా క్షమాపణలు చెప్పటం. గాంధీ కుటుంబం ఆయన చేత చెప్పించటం. లేనట్లయితే, ఆయన బీహార్ ప్రజల మనస్సుకు చేసిన ఈ గాయం పెచ్చరిల్లుతూనే ఉంటుంది.
పోతే, మొదటనే ఒక మాట అనుకున్నాము. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో మార్పులంటూ. వాస్తవానికి ఆ పార్టీ డీఎన్ఏ బీహార్‌లో మారటానికి విస్తృత రూపమే దేశమంతటా మారటం. స్వాతంత్య్రానంతర తొలిదశ నాటికన్న కాలం గడిచినా కొద్దీ దేశమంతటా మారుతున్నది అది. కాంగ్రెస్ రాజకీయ, ఆర్థిక, సామాజికపరమైన డీఎన్ఏ తొలుత ఏ విధంగా ఉండేదో క్రమంగా ఏ విధంగా మారుతున్నదో అందరూ గమనిస్తున్న విషయమే. అందువల్ల ఇక్కడ వివరించవలసిన పనిలేదు. ఆ విధమైన మార్పు, లేదా క్షీణత, లేదా పతనం కారణంగానే బీహార్‌లో అధికారం ఎట్లానూ దశాబ్దాల తరబడి లేకపోగా సీట్లు సైతం భిక్షమడగవలసిన దుస్థితి ప్రాప్తించిందో, అందుకు విస్తృతరూపంలో కేంద్రస్థాయిలో అదే కనిపించింది. వరుసగా 1989 నుంచి 10 ఎన్నికల్లో సొంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు. ఇటీవలికి చూస్తే, వరుసగా గత మూడు పర్యాయాలు ఓడిపోయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
గతకాలపు డీఎన్ఏతో మొత్తం దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన పార్టీ, ఇప్పుడు మారిన డీఎన్ఏతో కేవలం మూడు రాష్ర్టాలలో మిగిలి ఉంది. ఇటువంటి డీఎన్ఏ మార్పుల పర్యవసానంగానే సరిగా ఈ మార్పులను ప్రతిఫలించే వ్యక్తిత్వం గల రేవంత్ రెడ్డి తరహా నాయకుడికి అధికారం అప్పగించింది. కనుక ఆయన నుంచి గాని, గాంధీ కుటుంబం నుంచి గాని ఇంతకన్న వేరే ఆశించలేమేమో.
కాంగ్రెస్ వంటి చరిత్రాత్మకమైన పాత్ర నిర్వహించి, ఆ దశలో మొత్తం ప్రపంచంలోనే ఎన్నెన్నో స్వాతంత్య్రోద్యమాలకు, ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణాలకు ఆదర్శంగా నిలిచిన ఒక సంస్థ, ఈ స్థితికి పతనం కావటం ఒక పెద్ద విషాదం. ఇండియా ఒక సువిశాలమైన, అనేక వైవిధ్యతలు గల దేశం. ప్రకృతి వనరులకు, మానవ సంపదలకు ఎటువంటి కొరతలు లేనిది. చరిత్ర, సంస్కృతులపరంగా చెప్పనక్కరలేదు. అటువంటి దేశాన్ని వలసకాలపు పేదరికం నుంచి, తదనంతర వర్ధమాన స్థితి నుంచి సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకుపోవటం తప్పకుండా సాధ్యమే. వాస్తవానికి స్వాతంత్య్రోద్యమ కాలపు కాంగ్రెస్‌లో పలు కొరతలు ఉన్నప్పటికీ దేశానికి అటువంటి నాయకత్వం వహించగల శక్తి, అటువంటి దార్శనికత ఉండేవి. కానీ, అటువంటి అవకాశాలను స్వీయ వైఫల్యాలతో క్రమంగా చేజార్చుకుంటూ, ప్రస్తుతం మనం చూస్తున్న స్థితికి బలహీనపడిపోయింది. ఇందుకు గల అనేక ప్రతిఫలనాలలో ప్రస్తుత గాంధీ కుటుంబవారసులు జాతీయస్థాయిలో, రేవంత్ రెడ్డి వంటివారు రాష్ట్రస్థాయిలో కనిపిస్తున్నారు. ఈ స్థితి నుంచి నిష్కృతి మాత్రం కనిపించటం లేదు.
– టంకశాల అశోక్