ఖమ్మం జిల్లా మధిరల జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్పీచ్ విని అక్కడి జనం.. తలలు బుర్రలు గోక్కుంటా ఇండ్లకు పోయిన్రు. ఏం మాట్లాడిండో ఆయనకన్నా అర్థమైందా అనుకొంటూ నిట్టూర్చిన్రు. ఎందుకంటే సభల సీఎం స్పీచ్ మొదలుపెడుతూనే ఎన్నికలు ఎప్పుడో, ఎవరు పోటీ చేస్తరో తెల్వకుండానే.. అన్నం తినెటోడు ఎవడైనా గెలుస్తామని అంటాడా? అని అన్నడు. ఆ మాట అన్నడో లేదో.. అంతలోనే మరో మాట అనేసిండు.
భద్రాచలం రాముని మీద ఆన.. 117 సీట్లలో గెలుస్తాం! అని వ్యాఖ్యానించిండు. అప్పుడు జనం.. నాలుక మడతేసి ఏందిదీ.. సీఎంకు ఏమైంది? అనుకున్నరు. ఎన్నికలు ఎప్పుడో తెల్వకుండా గెలుస్తామని చెప్పేటోళ్లను తిట్టిన రేవంత్, ఇన్ని సీట్లు గెలుస్తామని మరి ఆయనెట్ల చెప్పిండు..? అన్నం తినెటోడు అట్ల చెప్పడు అని అన్నడు కదా.. మరి ఆయనేంది అట్ల చెప్తున్నడు? అంటే…! సరే ఏమోలే! ఇట్ల మాట్లాడే మనిషిని ఏమనుకోవాలె? సీఎం పొంతన లేని మాటలు విన్న జనాలైతే ఇప్పటిదిప్పుడే గిట్ల మాట్లాడవట్టే! అనుకున్నరు.
చాలా మీటింగ్స్‌లో సీఎం పేరు చాలా మంది మర్చిపోయిన్రు… మర్చిపోతున్నరు. ఇప్పుడు కొత్తగా సీఎం ఏం మాట్లాడిండో అప్పటిదప్పుడే మర్చిపోవుడు ట్రెండ్ అన్నట్టు. అయినా.. ఏం చేసినా వెంటనే దొరికిపోవుడు రేవంత్‌కు అలవాటే కదా! ఇప్పటికే దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి హామీలు ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డి, రాముడి మీద ఒట్టు పెట్టి గెలుస్తానంటే నమ్మేదెవరు? మధ్యలో దేవుళ్ల ప్రస్తావన ఎందుకు తీసుకచ్చుడు? అంటూ భక్తులు మండిపడుతున్నరు.

సీఎం రేవంత్‌రెడ్డి గద్దె మీద కూసొని రెండున్నరేండ్లయిపాయె. రోజురోజుకు ఇంకింత దిగజారుతున్నడు కానీ.. మాట తీరు మారుతలేదు. టీవీల, ఫోన్ల సీఎం మాట్లాడిన వీడియో వస్తే.. జనమే మొఖం తిప్పుకొనే పరిస్థితి వచ్చింది. ఒక సీఎం అయి ఉండి, ఇట్లెట్ల మాట్లాడుతడు? అని జనం ఛీదరించుకుంటున్నరు. ప్రజలకు ఏం చేసిన్రో, ఏం చేస్తరో చెప్పకుండా.. ఎప్పుడు చూసినా తిట్లేనా? బడి పిల్లలతో మీటింగ్ పెట్టినా అదే భాష. ఛీ.. అని జనం అనుకుంటున్నరు. నోరు తెరిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఏదో ఒకటి అనడం తప్ప.. ఆయనకు ఇంకో ముచ్చట తెల్వదా? అని ప్రశ్నిస్తున్నరు. ప్రభుత్వ పాలన గురించి కల్లు దుకాణాలు, బార్ షాపులు, వైన్ షాపుల కాడ ముచ్చట పెట్టుకోన్రి అని చెప్పె కదా సీఎం. హా.. ఇగ ఛాయ్ దుకాణాల కాడ ముచ్చట్లలో సీఎం గురించి మాట్లాడేదే వినలేకపోతున్నం. ఇప్పుడు మందు కేంద్రాల వద్ద మాటలంటే.. వామ్మో… ఆ భాష వినేంత సాహసం ఎవరు చేస్తరు! రెచ్చగొట్టేందుకు సీఎం ఎన్ని చిందులు తొక్కినా.. గులాబీ పార్టీ వాళ్లు మాత్రం డైవర్ట్ కాకుండా ఓపికగా, ఓర్పుగా నిలదీస్తున్నరు. తిడితే తిట్టుకో ఏం కాదు.. కాళేశ్వరం నీళ్లు కిందికి ఎందుకు ఇడిసిపెడ్తున్నవు? రైతులకు ఎందుకు ఇస్తలేవు? అని ప్రశ్నిస్తున్నరు. సీఎం ఎంత మొత్తుకున్నా.. లైట్ తీసుకుంటూ.. అసలు సంగతి అడుగుతున్నరు బీఆర్ఎస్ నేతలు. దీంతో సీఎంలో మరింత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తున్నది.

ఇక్కడ చూస్తేనేమో పొలాలకు నీళ్లు లేక, ఎవుసం చేయాల్నంటనే రైతన్నల గుండెలు ఝల్లుమంటున్నయి. అక్కడ చూస్తేనేమో కాళేశ్వరం నీళ్లు ఉరకలేస్తూ, 90 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఆంధ్రప్రదేశ్ వైపు పోతున్నది. కన్నెపల్లి పంపులు ఇంకెప్పుడు ఆన్ చేస్తవు? నీళ్లెప్పుడు ఎత్తిపోస్తవు? అని బీఆర్ఎస్ లీడర్లతోపాటు సాగునీటి నిపుణులు సీఎంను గట్టిగ నిలదీస్తున్రు. ఇక పెద్ద తెలిసినట్టే సీఎం, మంత్రులు, ఆఫీర్లతో కలిసి పెద్ద ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ ఇచ్చిండు. ఏముంటది.. ఏం చెప్తడు.. గదే పాత కథ. కేసీఆర్ మీద నోటికొచ్చిన ఆరోపణలు చేస్తూ ’మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నింపితే ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతయి’ అని అబద్దాలు చెప్పుకొచ్చిం డు. అధికారంలోకి వచ్చి 30 నెలలైనా కేసీఆర్‌కు ఎలాంటి శిక్షా వేయలేకపోయాం అంటూ తెగ బాధపడిపోయిండు. ఇది చూసిన జనం, సోషల్ మీడియా పిలగాళ్లు ఏమంటున్నరంటే కేసీఆర్ తప్పు ఏమైనా చేసి ఉంటే.. నువ్వు 30 నెలలు కాదు కదా, 3 నెలలు కూడా ఆగకపోదువు. ఎంత వెతికినా తప్పులేం కనిపించలేదు కాబట్టే.. చేతులు ముడుచుకొని కూర్చున్నవు. నోరు కూడా అట్లనే మూసుకుంటే మంచిగుంటది అని పోస్టులు పెడుతున్నరు. కన్నెపల్లి కాడ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే ఏం కాదని, రిటైర్డ్ ఇంజినీర్లు కచ్చితంగా చెప్తుంటే.. ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉన్నదో తెల్వని సీఎం ఏదో అయిపోతదని చెప్పుడు ఇచ్ఛంత్రంగా ఉన్నదని అంటున్నరు.

రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ జరుగుతున్న కదా! ఈ సందర్భంగా గమ్మతు ముచ్చట బయటపడింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో 36 వేల దొంగ ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు లెక్క చెప్తున్నరు. దీనిపై రాజకీయవర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతున్నది. 36 వేలు సంఖ్య ప్రత్యేకతను కలిగి ఉండటమే ఇందుకు కారణం. అసలు విషయం ఏంటంటే, 2018లో రేవంత్‌రెడ్డి ఓడిపోయినప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు 71 వేలు. 2023లో గెల్చినప్పుడు వచ్చిన ఓట్లు 1.07వేలు. తేడా 36 వేలు. ఈ లెక్క భలే కుదిరింది కదా అని పొలిటికల్ సర్కిళ్లలో అనుకుంటున్నరు. అంటే… రేవంత్‌రెడ్డికి పోలైన వాటిలో భారీగా దొంగ ఓట్లు ఉన్నయా అనేది కొందరి అనుమానం. రేవంత్‌రెడ్డి ఎట్లాగైతే నిరాధారమైన ఆరోపణలు చేస్తడో.. మరి కొందరైతే అట్లనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నరన్నమాట. కొంపదీసి.. 36 వేల దొంగ ఓట్లే.. రేవంత్‌రెడ్డికి పెరిగిన 36 ఓట్లా అని అడుగుతున్నరు. ఏమో.. మరి ఏం జరిగిందో..!