రాజుల కాలంలోనూ ధర్మ ప్రభువులుండేవారు. ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకునేవారు. బీదసాదల పట్ల ఆదరణ చూపేవారు. అలాంటి వారిని ధర్మప్రభువులని ఇప్పటికీ చరిత్రలో చెప్పుకొంటాం. మనం ఇప్పుడు ఆధునిక, ప్రజాస్వామిక యుగంలో ఉన్నాం. ఇప్పుడు ప్రజానుకూలత అనేది ఓ అదనపు లక్షణం కాదు, ప్రధాన లక్షణమే అని చెప్పాల్సిన పనిలేదు. అట్టడుగువర్గాల పట్ల సున్నితమైన స్పందన కూడా అంతే. కానీ, ఆధిపత్య భావజాలం ఇంకా వీడని రేవంత్రెడ్డి వంటి వారి విషయంలో మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటాం. వారి మాటల్లో, చేతల్లో వివక్షలు పొడసూపుతుంటాయి. పైవాళ్లు, కిందివాళ్లు అనే విభజనల గురించిన ప్రస్తావనలు వస్తుంటాయి. దళిత, బహుజనుల గురించి మాట్లాడాల్సి వచ్చిన సందర్భాల్లో తెలియకుండానే తన భావజాలపు నీడలు బయటకు పాకుతుంటాయి.
కేవలం సీఎంను పరుషంగా విమర్శించారనే అక్కసుతో ఓ దళితుడు, అందులోనూ డెబ్బయ్యో వడిలో ఉన్న వృద్ధ రైతును అన్నం తింటుండగా పెడరెక్కలు విరిచి పట్టుకుపోయిన ఉదంతం ఈ ధోరణికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఆయన కడుపు మండి యూట్యూబర్ ముందు వాపోతే ఆయనకు చెందిన అసైన్డ్ భూమిని సర్కారు లాగేసుకున్నదన్న సంగతి మరుగున పడిపోయింది. సర్కారు కాఠిన్యం వల్ల ఆయన ఆక్రోశమే మెడకు చుట్టుకున్నది. ఆయన ఓ ఉగ్రవాది కాడు. హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న హంతకుడు అసలే కాదు. ఏమిటీ దాష్ఠీకం? ఎందుకూ దౌర్జన్యం? ఓ సామాన్య, నిస్సహాయ, వృద్ధ దళిత రైతు మీద ఇంతటి ప్రతాపమా? ప్రజా పరిపాలన పేరిట సీఎం సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలన మీద యూట్యూబర్లు చేస్తున్న కార్యక్రమాల మీదా ప్రభుత్వం విరుచుకుపడుతున్నది. ఇద్దరు మహిళా యూట్యూబర్లను అరెస్టు చేసిన సంగతి విదితమే. సీఎం సొంత ఇలాకాలో, సొంత ఊరిలో మహిళా జర్నలిస్టులపై ఘాతుక దాడి జరిగిన సంగతి మనం మరిచిపోలేం. అసలేం జరుగుతున్నది. ఇందిరమ్మ పాలన మాటున మళ్లీ ఎమర్జెన్సీ రోజులను చూస్తున్నామా? సీఎం రేవంత్ రెడ్డి దుర్భర, దుస్సాహస బూతుపురాణం మాటేమిటి? అర్థ రహితమైన ఆ అనర్థ సంభాషణలకు ఎవరు జవాబుదారీ వహిస్తారు?
ఇది ఓ దర్శనం వెంకటయ్య కథ కాదు. రాష్ట్రంలోని దళిత, బహుజనులను బాధిస్తున్న, వేధిస్తున్న సమస్య. దళిత తహసీల్దార్కే కాంగ్రెస్ నేతల నుంచి రక్షణ లేకపోతే సామాన్యుల మాట చెప్పేదేమిటి? ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడే కాంగ్రెస్ నేతలను అదుపు చేసేదెవ్వరు? దళిత ఎమ్మెల్యేలపై పోలీసులు ప్రతాపం చూపితే ఆపేదెవ్వరు? అంతెందుకు, యాదగిరీశుడి సన్నిథిలో దళిత వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంకు చిన్నపీట వేసిన పెద్దలను అడ్డుకునేదెవ్వరు? గుట్టుగా దళిత గురుకులాలకు కోత వేస్తే ఎవరేం చేయగలిగారు? దళిత జవాన్పై దాడి జరిగితే రక్షణగా నిలిచిందెవ్వరు? ఇటీవల దళిత బిడ్డల గురించి అవమానకరమైన రీతిలో సీఎం మాట్లాడితే నిలదీసిందెవ్వరు? యథారాజా తథాప్రజా అన్నట్టుగా పోలీసులూ, యంత్రాంగం అదే దోవన పోతుంటాయి. ఫలితంగా కష్టజీవులు, అట్టడుగు వర్గాలు యాతనల పాలవుతుంటారు. ఇదీ కాంగ్రెస్ తెచ్చిన మార్పు అనుకోవాలా? సీఎం రేవంత్రెడ్డి మార్కు అనుకోవాలా?