నిరుద్యోగుల పోరాట పునాదుల మీద ముఖ్యమంత్రి కొలువును కొట్టేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే నిరుద్యోగుల కన్నీటి ఆవేదనను కనీసం అర్థం చేసుకోవడం లేదు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన ఐదు అంశాలతో కూడిన 17 హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అంతేకాదు, అమావాస్య అర్ధరాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవడమే కాకండా, ఏడు నెలల్లో సుమారు 17 సార్లు హస్తినకు వెళ్లిన రేవంత్‌కు.. నిరుద్యోగుల గోసను వినేందుకు కనీసం ఒక అరగంట సమయం లేకపోవడం శోచనీయం.
అధికారమే పరమావధిగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్రంలో తొలిసారిగా అధికార పీఠమెక్కింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ నిరుద్యోగుల హామీలను ఆదిలోనే అటకెక్కించారు. ‘ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన’ చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నది. ఏడు నెలలుగా పాలకులు నిర్లక్ష్య పరీక్ష పెడుతుండటంతో.. పస్తులుంటూనే పుస్తకాలతో కుస్తీ పట్టే నిరుద్యోగులు రోడ్డెక్కి ఎర్రచీమల దండులా కదులుతున్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుంటే తేనెటీగలై ప్రభుత్వాన్ని చుట్టుముడతామని హెచ్చరిస్తున్నారు.
సరూర్‌నగర్‌లో గతేడాది మేలో జరిగిన సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్వయంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, తొలి, మలి ఉద్యమ అమరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేలు పింఛన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 18 ఏండ్లు నిండిన విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ వంటి హామీలను గుప్పించారు. ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎవరూ ఊహించని విధంగా అశోక్‌నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి నిరుద్యోగులతో భేటీ అయ్యారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై ఆయన కూడా బహిరంగంగా హామీ ఇచ్చారు. ఈ హామీల ను సంపూర్ణంగా విశ్వసించిన నిరుద్యోగులు ప్రభు త్వ మార్పులో కీలక భూమిక పోషించారు. తీరా అధికారంలోకి వచ్చాక ‘ప్రజా పాలన’ అంటూ బీరాలు పలుకుతున్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహారశైలిలో క్రమంగా ‘మార్పు’ కనిపిస్తున్నది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆయ న అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దాటవేత ధోరణితో యువతను మరోమారు దగా చేస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ రూపకల్పనలో ఎందుకింత అలసత్వం? రెండు రోజుల వ్యవధిలో డీఎస్సీ అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను ఎలా రాయగలరు? ప్రభు త్వ పెద్దలు ఆలోచించాలి. రెండింటి మధ్య కనీసం రెండు నెలల సమయం ఉండాలన్న న్యాయమైన అభ్యర్థనను పట్టించుకోవడం లేదు. అంతేకాదు, గ్రూప్-2లో రెండు వేలు, గ్రూప్-3లో మూడు వేల పోస్టులు పెంచుతామని మాట ఇచ్చి, ఇప్పుడు మాట మార్చారు. జీవో 46 బాధితుల మొర ఆలకించడం లేదు. గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి మమః అనిపించేశారు. ఇప్పటి వరకు వారిని విధుల్లో చేర్చుకోలేదు. ఇవన్నీ పరిష్కారమయ్యే అంశాలే. కానీ, పక్కదోవ పట్టించాల నే ఉద్దేశంతో ప్రభుత్వం సాకులు చెప్తూ కాలయాప న చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకలు మూగబోయాయి. ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి గడపదాటడం లేదు. విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి ముర ళి స్వరంలో తీవ్రత తగ్గింది. నిరుద్యోగుల తరపున పోరాటం ముసుగులో ఫక్తు రాజకీయం చేసినవారు పదవులు రాగానే పెదవులు మూసుకున్నారు. ప్రస్తు తం వారి ముసుగు తొలగిపోయింది. నిజస్వరూపం బట్టబయలైంది.
పీడితవర్గాల తరపున పోరాడే ఓయూ విద్యార్థుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా గతంలో రేవంత్ మాట్లాడినప్పుడే ఆయనను నిలువరించాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఆయన ఇప్పుడు ఓయూ గడ్డపై పోలీసులతో కవాతు చేయిస్తున్నా రు. అన్యాయాన్ని ఎదిరించిన వారిని నిర్బంధిస్తున్నారు. అరకొర వసతుల నడుమ.. అర్ధాకలితో అక్షర యుద్ధం చేస్తున్న నిరుద్యోగులను కించపరుస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి.
నాడు మహిళలకు న్యాయం చేసే ‘హిందూ కోడ్’ బిల్లు విషయంలో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏకంగా కేంద్ర మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని మరుగున పడేసే కుట్రలకు యూపీఏ ప్రభుత్వం తెరలేపినందుకు నిరసనగా నాడు కేంద్ర మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. కోట్లాది ప్రజల ఐదు దశాబ్దాల ఆకాంక్షకు అండగా నిలిచారు.
ఆ సందర్భం ఈతరం కండ్లముందే చరిత్రగా నిలబడింది. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిరుద్యోగులు చేస్తున్న పోరాటం న్యాయమైనది. అందుకే బుద్ధిజీవులు, ఉద్యమకారులు, ప్రజా గొంతుకలు వారికి అండగా నిలవాలి.
– నరేష్ పాపట్ల
95054 75431