‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం దయతలచి వేసే భిక్ష కాదు. అవి మానవ హక్కుల కిందకు వస్తాయి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు. సెక్రటేరియట్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ విసిగి వేసారి పోరుబాట పట్టాల్సి రావడం దురదృష్టకరం. జీవితంలో ప్రధాన భాగం ప్రభుత్వ సేవలో గడిపి, మలిసంజెలో విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు ఉద్యోగులు. మలిసంజెకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రాణాధారం లాంటివి. ఎన్నెన్నో ఆలోచనలు, ఆశలు ఆ బెనిఫిట్స్ కోసం వేచి చూస్తూ ఉంటాయి. పిల్లల పెండ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం వంటివి షరా మామూలే. ఇక అలసి, సొలసిన శరీరం అనారోగ్యం పాలైతే ఆదుకునేది ఈ సొమ్ములే. కానీ కాంగ్రెస్ పాలనలో పదవీ విరమణ ప్రయోజనాలు అనేవి అందని పండ్లయిపోవడం విడ్డూరం.
ప్రభుత్వం ఈ చెల్లింపుల భారాన్ని తప్పించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేసింది. బడా కాంట్రాక్టర్లకు భారీ నిధులు బిల్లుల రూపంలో విచ్చలవిడిగా విడుదల చేస్తూ, విశ్రాంత ఉద్యోగులకు మాత్రం బాండ్లు చేతిలో పెట్టింది. ఖర్చులకు రొక్కం లేనప్పుడు కాగితాలతో ఏం లాభం? కొందరికి అప్పుల సమస్య కూడా ఉంటుంది. వాటిని తీర్చేసి నిమ్మలంగా గడపవచ్చని వారు అనుకుంటారు. ఎంతగా మొరపెట్టుకున్నా సర్కార్ పైసా విదల్చకుండా నరకం చూపింది. ఈ పరిస్థితుల్లో రిటైర్మెంట్ అంటేనే దిగులుపడే రోజులొచ్చాయి. ఎందుకంటే నెలనెలా వచ్చే జీతం ఆగిపోతుంది. పైగా రావాల్సిన బెనిఫిట్స్ రావు. ఏటేటా వేల మంది పదవీ విరమణ చేస్తారు. వారిలో ఏ ఒక్కరికీ ప్రయోజనాలు అందని పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొనడం విడ్డూరం.
మలిసంజెలో ఆదుకుంటాయని అనుకున్న బెనిఫిట్స్ ఎంతకూ చేతికి అందకపోవడంతో కొంతమంది నిస్పృహకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీధుల్లోకి దిగి పోరుబాట పట్టినా ప్రభుత్వం దిగిరాలేదు. బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ రిటైర్డు ఏఎస్ఐ విడుదల చేసిన వీడియో విశ్రాంత ఉద్యోగుల్లో పేరుకుపోయిన నిరాశానిస్పృహలకు నిదర్శనం. అయినా సర్కార్ మనసు కరుగలేదు. దీంతో అత్యధికులు గత్యంతరం లేక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
హైకోర్టు పలుసార్లు బెనిఫిట్స్ చెల్లింపు జరపాలని ఆదేశించినా సర్కార్‌లో కదలిక రాకపోవడంతో తదుపరి అస్త్రంగా కొందరు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారు. వీటిపైనా ప్రభుత్వానికి, అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. ఆరు మాసాలు గడిచినా వాయిదాల మీద వాయిదాలు కోరుతుండటం న్యాయస్థానానికి విసు గు తెప్పించింది. ఎన్ని ఆదేశాలిచ్చినా తాత్సా రం చేస్తుండటంతో ఓపిక నశించిన ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్ 9వ తేదీని గడువుగా విధించింది.
రిటైరైన యావన్మంది ఉద్యోగుల కు ఆలోగా బెనిఫిట్స్ అందజేయాలని అల్టిమే టం విధించడం కీలక పరిణామం. అంతేకాకుండా ఫైనాన్స్ సెక్రెటరీ హాజరు కావాలని కోర్టు పట్టుబట్టడం గమనార్హం. ఆయన డిజిటల్‌గా హాజరుకావడం, కోర్టు అక్షింతలు వేయ డం జరిగిపోయాయి. ఆ సం గతి అలా ఉంచితే మరింతగా గడువు ఇవ్వడానికి కోర్టు ససేమిరా అన్నది. ‘మీరు ఇస్తున్నది వారు సంపాదించుకున్న సొమ్మేనని మరిచిపోరాదు’ అని నొక్కిచెప్పింది. హైకోర్టు జోక్యం చే సుకుంటే గానీ విశ్రాంత ఉద్యోగుల సమస్య పరిష్కారం కాని పరిస్థితి తీసుకురావడం కాం గ్రెస్ సాధించిన గొప్ప ‘మార్పు’గానే భావించవచ్చు.