దేశ నిర్మాణం, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఉత్పాదక వర్గాలైన ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీలు) దశాబ్దాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా దేశ జనాభాలో దాదాపు 56 శాతం ఉన్న ఓబీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో సరైన వాటా లభించడం లేదు. మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు కూడా నిరాకరిస్తున్నారు. అందుకే కుల ఆధారిత జనాభా గణన చేయాలి. తద్వారా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించి, బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్న బీసీలకు దామాషా పద్ధతిలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు అమలుచేయాలి. అప్పుడే వారికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టవుతుంది. అంతేకాదు, సంపూర్ణ సామాజిక న్యాయం జరుగుతుంది.
BC Reservations | మన దేశంలో కులమనేది సామాజిక గుర్తింపు మాత్రమే కాదు, అది ఆత్మగౌరవ సాధనం కూడా. కుల గుర్తింపు ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ ఈ నాటిది కాదు, దశాబ్దాలుగా కొనసాగుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా, కొద్దిమంది చేతుల్లోనే దేశ ఆర్థిక సంపద, రాజకీయ పదవులు బందీ అయ్యాయి. చైతన్యానికి, ఉద్యమాలకు, విప్లవాలకు నిలయమైన తెలంగాణలో కూడా ఒక కులం మాత్రమే రాజ్యం, అధికారం, ఆర్థిక వనరులు, అవకాశాలను హస్తగతం చేసుకొని ప్రజాపాలన పేరిట ఫ్యూడల్ రాచరికాన్ని, దోపిడీ స్వామ్యాన్ని కొనసాగిస్తున్నది. కులగణనను తిరస్కరించడమనేది కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగానే భావించాలి. అంతేకాదు, ఓబీసీల వృత్తి అవకాశాలను నాశనం చేయడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని, గుర్తింపును, అస్తిత్వాన్ని హరించే ప్రయత్నంగా పాలకవర్గాలు గ్రహించాలి.
కుల ఆధారిత జనాభా గణన చేయడమంటే సమాజంలో ఉన్న అన్ని కులాలకు చెందిన జనాభాతో పాటు వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులపై సమాచారం సేకరించడం. ఓబీసీ జనాభా వివరాలతో పాటు, వారి వెనుకబాటుతనాన్ని కూడా నిర్ధారించాలనేది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్. ప్రజల జీవన స్థితిగతులు, వారి కష్టాలు, కన్నీళ్ల గురించి పాలకవర్గాలకు పూర్తి సమాచారం, అవగాహన లేకపోతే ఉన్నవాడికి, లేనివాడికి, సామాజికంగా అణచివేతకు గురైనవాడికి, అధిపత్య వర్గాలకు ఉన్న అంతరాలు ఎలా తెలుస్తాయి? నిరుపేదల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు రూపొందించి, వాటిని ఎలా అమలు చేస్తాయి? వెనుకబాటుతనంపై శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేయకుండా, గణించకుండా వారి అవసరాలను ఎలా తీర్చగలరు? వ్యాధి ని నిర్ధారించకుండా వైద్యం చేయడం సాధ్యమా? ఓబీసీల గణన చేయకుండా వారి అవసరాలు, సమస్యలు తీరుస్తామని మాట్లాడటం వ్యాధి గురించి తెలియకుండా మందు ఇవ్వడం లాంటిదే.
అయితే, ఓబీసీ జనాభా వివరాలు లేనందున ఈ అణగారినవర్గాలకు ఉద్దేశించిన ప్రస్తుత రిజర్వేషన్లను కూడా అగ్రవర్ణ పాలకులు తిరస్కరిస్తున్నారు లేదా అనుభవిస్తున్నారు. ఉదాహరణకు అనేక పీఎస్‌యూలు (పబ్లిక్ సెక్టార్ యూనిట్లు), కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమల్లో లేవు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వంటి ప్రధాన కేంద్ర సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లను నిరాకరించిన విషయాన్ని ఎన్సీబీసీ ద్వారా గతంలో మేం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాం.
మేం తీవ్రంగా పోరాడితే తప్ప, నల్సార్‌లో బీసీ రిజర్వేషన్లు అమలు కాలేదు. ఇఫ్లూలో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఐఐటీ, ఐఐఎంలలో కూడా అదే పరిస్థితి. మన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ జీవితాల్లో కులం ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, బహుళంగా కుల ఆధారిత నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, 1931 నుంచి విశ్వసనీయమైన కుల డాటా అందుబాటులో లేకపోవడం విచిత్రం. 1951 నుంచి 2011 వరకు స్వతంత్ర భారతదేశంలోని ప్రతి జనాభా గణన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపైనే జరిగిందే తప్ప ఇతర కులాలపై కాదు.
రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్‌గా గుర్తింపు పొందిన బీపీ మండల్ కమిషన్ 1931 జనాభా లెక్కల్లో ఓబీసీలకు సంబంధించిన డాటా ఆధారంగా నివేదిక రూపొందించి, 27 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించింది. నేటికీ కొన్ని ప్రభుత్వాలు దానిపై ఆధారపడుతున్నాయి. జంతువులు, పక్షులు, నిర్జీవ వస్తువుల డాటా కూడా ప్రభుత్వాల వద్ద ఉంది. కానీ, దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఓబీసీలకు సంబంధించిన డాటా మాత్రం లేదు. ఫలితంగా, ఓబీసీలు రాజ్యాంగపరమైన రక్షణ లేకుండా సమాజంలో తీవ్ర వివక్ష, ప్రాథమిక హక్కుల తిరస్కరణను ఎదుర్కొంటున్నారు.
వాస్తవానికి, 2021 జనాభా లెక్కల్లో అన్ని కులాల లెక్కింపు ఉంటుందని 2019 ఎన్నికలకు ముందు అప్పటి హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. అయితే ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఆ నిర్ణయంపై యూ టర్న్ తీసుకున్నారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం జనాభా గణన అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కానీ, ఆ విషయం తెలిసినా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా కులగణన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టివేస్తున్నది. ఈ విధంగా తీవ్రమైన రాజ్యాంగ గందరగోళానికి గురిచేస్తూ తన ద్వంద్వ వైఖరిని బీజేపీ సర్కార్ ప్రదర్శిస్తోంది. అయితే, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మాత్రం కులగణన జరపాలని అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని జాతీయ స్థాయిలో కులగణన చేయాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు.
140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో దాదాపు 65-75 కోట్ల మంది ఓబీసీలు ఉన్నారని ఓ అంచనా. కానీ, దురదృష్టవశాత్తు 2-5 శాతం కులాలు మాత్రమే విద్య, ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ, ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మెజారిటీ ఓబీసీలు కడు పేదరికంలో మగ్గుతున్నారు. అంతేకాదు, అనేక వెనుకబడిన తరగతులవారు (ఎంబీసీ), డీనోటిఫైడ్ సంచార తెగలవారు (డీఎన్టీ) ఇప్పటికీ ఎలాంటి సామాజిక భద్రత లేకుండా కడు పేదరికాన్ని అనుభవిస్తూ బిచ్చగాళ్లలా జీవిస్తున్నారు. రాజకీయ అణచివేతను ఎదుర్కొంటున్నారు.
‘రాజకీయ శక్తి అన్ని రకాల అభివృద్ధికి మాస్టర్ కీ’ అని పేర్కొన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిజమైన సాధికారతకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని ప్రతిపాదించారు. వెనుకబడిన తరగతుల్లో 100 కంటే ఎక్కువ కులాలవారు ఇప్పటివరకు ప్రజాప్రతినిధులుగా ఒక్క అవకాశమూ పొందలేదు. ఇది అత్యంత వెనుకబడిన తరగతులు, సంచార తెగల దయనీయ స్థితికి నిదర్శనం. ఎన్నికల వ్యవస్థ, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని లోపాలను ఇది ఎత్తిచూపుతున్నది.
దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీ డిక్లరేషన్‌లో ఉన్న 26 హామీల్లో ఏ ఒక్కదానికి అందులో స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు, ఏ ఒక్క హామీకి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. తెలంగాణలో 56 శాతం జనాభా ఉన్న బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్‌ను పట్టించుకున్న దాఖలాలు లేవు.
‘సంఖ్య తెలియకుండా సమగ్ర సంక్షేమం చేయలే’మన్న దార్శనిక దృక్పథంతో తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే నాటి సీఎం కె.చంద్రశేఖర్ రావు ఒక్కరోజులోనే సమగ్ర కుటుంబ సర్వేను పూర్తిచేశారు. అయితే, ఆ సమాచారానికి చట్టబద్ధత లేకుండా చట్టపరమైన చిక్కులు రావడంతో ప్రణాళికలు తయారు చేసుకోవడానికి ఆ డాటాను వాడారు. దాని ఆధారంగా అన్ని కులాల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. అంతేకాదు, ఓబీసీ జనాభాను లెక్కించడానికి కుల ఆధారిత జనాభా గణన కోసం 2021 అక్టోబర్‌లో నాటి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సమానత్వం, సామాజిక న్యాయం కోసం సమగ్ర ఓబీసీ సహిత జనాభా గణన అవసరమని సీఎం హోదాలో కేసీఆర్ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ అంశంపై త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కూడా కోరారు.
ఈ నేపథ్యంలో 2023లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ఆవిష్కరించి, కులగణన నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2023 నవంబర్ 10న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో ఈ డిక్లరేషన్‌ను ప్రకటించారు. కులగణన చేపట్టడం, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో 42 శాతానికి బీసీ రిజర్వేషన్లను పెంచడం అందులోని కీలకమైన హామీలు. బీసీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణను అమలు చేయాలని, అతి వెనుకబడిన, సంచార గిరిజనులకు న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ డిక్లరేషన్ ప్రతిపాదించింది. పంచాయతీలు, పురపాలక సంఘాల్లో 23,973 కొత్త నాయకత్వాన్ని ఇది పెంపొందిస్తుంది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి, బీసీల సంక్షేమానికి ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడం, అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖను ఏర్పాటు చేయడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయడం వంటి హామీలు వాటికి అదనం. ప్రభుత్వ సివిల్ నిర్మాణ, నిర్వహణ కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామని కూడా కాంగ్రెస్ వాగ్దానం చేసింది. చిన్న వ్యాపారాలు స్థాపించడానికి, ఉన్నత విద్యనభ్యసించేందుకు ఎలాంటి తాకట్టు లేకుండా బీసీ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును, ముఖ్యంగా కళాకార వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీల అర్హత వయస్సును 57 నుంచి 50 ఏండ్లకు తగ్గిస్తామని చెప్పింది. ముదిరాజ్, ముత్రాసి, తెనుగోలు వంటి కులాలను బీసీ-డీ నుంచి బీసీ-ఏ రిజర్వేషన్ కేటగిరీకి మారుస్తామని డిక్లరేషన్‌లో ప్రతిపాదించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కార్ జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వును పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది.
అయితే, దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీ డిక్లరేషన్‌లో ఉన్న 26 హామీల్లో ఏ ఒక్కదానికి అందులో స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు, ఏ ఒక్క హామీకి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. ‘ఓడలో ఉన్నప్పుడు ఓడ మల్లన్న ఒడ్డెక్కినంక బోడి మల్లన్న’ అన్నట్లుగా.. తెలంగాణలో 56 శాతం జనాభా ఉన్న బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్‌ను పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణను ఒక సామాజికవర్గానికి భోజ్యంగా మలచుకుని, అన్ని పదవులను ఒకే సామాజికవర్గానికి కట్టబెడుతూ తన అణచివేత ఫ్యూడల్ వైఖరిని రేవంత్ ప్రదర్శిస్తున్నారు. అణచివేతకు గురైన వర్గాల ఆత్మగౌరవాన్ని మరింతగా అణచివేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి 16న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీల కులగణన కోసం సమగ్ర సామాజిక-ఆర్థిక సర్వేను నిర్వహించాలని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కులగణన కోసం రూ.150 కోట్లు కేటాయిస్తున్నట్టు 2024 మార్చి 16న జీవో నెం.26ను కాంగ్రెస్ సర్కార్ జారీచేసింది. రాజకీయ లబ్ధి కోసం ఈ తీర్మానాలు, ఉత్తర్వుల గురించి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ భారీగా ప్రచారం చేసింది. కానీ, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అయితే, సమగ్ర కులగణన చేసి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని, కర్ణాటక, బీహార్ రాష్ర్టాల్లో లాగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేయాలని క్షేత్రస్థాయిలో గళమెత్తిన మేం న్యాయ పోరాటాన్ని ప్రారంభించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశాం. తెలంగాణలో సమగ్ర కులగణన చేయాలని, అంతేకాకుండా బీసీల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయాలని కోరాం. కులగణన సర్వే 9 నెలలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ కొనసాగుతుండగానే.. సమగ్ర కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్ల పెంపును నిర్లక్ష్యం చేయాలని ఒక పథకం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కుట్రపన్నారు. అదే సమయంలో నేను (దాసోజు శ్రవణ్‌కుమార్), జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన మూడు వేర్వేరు రిట్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విస్తృత విచారణ జరిపింది. వాదోపవాదాలు విన్న తర్వాత ‘వికాశ్ కృష్ణారావు గవాలి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని విప్లవాత్మకమైన తీర్పు ఇచ్చింది. రాష్ర్టాన్ని యూనిట్‌గా కాకుండా, ప్రతి స్థానిక సంస్థను యూనిట్‌గా తీసుకొని వెనుకబాటుతనాన్ని, స్థితిగతులను అధ్యయనం చేయాలని అందులో పేర్కొంది. తద్వారా తగిన రిజర్వేషన్లను అమలుచేయాలని ఆదేశించింది.
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సమగ్ర కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరమున్నది. అన్ని కులాల స్థితిగతులను పోల్చి, తులనాత్మకంగా బీసీల వెనుకబాటుతనంపై సమగ్ర శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేయాలి. దాని ఆధారంగా పూర్తి సమాచారంతో రిజర్వేషన్ల పెంపును సమర్థించడానికి వీలుగా పటిష్ఠమైన ఆధారాలను సుప్రీంకోర్టులో సమర్పించాలి.
భారత రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతున్న సామాజిక న్యాయాన్ని అమలుచేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించినట్టయితే.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన విధంగా రిజర్వేషన్లను పెంచాలి. దాంతో పాటు ఉపవర్గీకరణను స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో మాదిరిగా అమలు చేయాలి. దానికి మూలాధారం సమగ్ర కులగణన. అయితే అంతర్జాతీయ వేదికలపై కులగణన గురించి మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న అరాచకాలను, అణచివేతలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ‘తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి మాత్రమే ఇతరులను సంస్కరించే అధికారాన్ని పొందుతాడు’ అనే విషయాన్ని ఆయన గుర్తెరగాలి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భారత అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని విధించింది. కాబట్టి దానిని అధిగమించలేమనే తీవ్రమైన దురభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ, సమగ్ర కులగణనను నిర్వహించి, బీసీల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ వెనుకబాటుతనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించినట్టయితే రిజర్వేషన్ల పెంపును పరిశీలించవచ్చని ‘కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో, ఇతర అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తెలిపింది. అయినప్పటికీ, ఫ్యూడల్ పాలకవర్గాలు ఈ విషయాన్ని తొక్కిపెట్టి, పక్కదారిపట్టించి, రిజర్వేషన్ల పెంపు జరగకుండా బీసీలను మోసం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలంటే, తెలంగాణలో జరుగుతున్న ఆధిపత్యవర్గం అణచివేత ధోరణి పోవాలంటే సమగ్ర కులగణన జరగాల్సిందే. ముఖ్యంగా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే అమలుచేయించాలి.