బీసీ ప్రజలు తమ రిజర్వేషన్ పరిధిలోనే ఉండి ఎదగాలని, స్వతంత్రతలో గానీ, ఓపెన్ కేటగిరిలో గానీ బీసీలు పోటీ చేయరాదని బీసీల మనసుల్లో మన దేశంలోని రాజకీయ పార్టీలు ఒక పరిధిని విధించాయి. ఈ మానసికత ప్రకారం బీసీ ప్రజలు రిజర్వ్ స్థానాలకే పరిమితమైపోయారు. జనరల్ (ఓపెన్) స్థానాల్లో బీసీలు పోటీ చేయడం ‘అసాధ్యం’ అని భ్రమించారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఆచరణాత్మకంగా అగ్రకుల ఆధిపత్యం కొనసాగేలా చేయడంలోని రాజకీయ వ్యూహం.
రిజర్వేషన్ విధానం బీసీలకు (ఒక్క బీసీలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు) సామాజిక న్యాయం కల్పించే సాధనమైనా… రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని ‘ఆధారం’గా మలిచాయి. జనరల్ సీట్లలో మీకు గెలిచే ఛాన్స్ లేదు‘మీరు రిజర్వ్ సీట్లలోనే సురక్షితం’ అనే సందేశాన్ని పదే పదే ప్రచారం చేశాయి. ఫలితంగా జనరల్ సీట్ అంటే అగ్రకులాలకు మాత్రమే అనే ఆలోచన బీసీల్లో లోతుగా పాతుకుపోయింది. డబ్బు, మద్యం, కండ బలం, బంధు బలం.. ఇలా అన్ని అస్ర్తాలతో జనరల్ స్థానాల్లో అగ్రకుల అభ్యర్థులే నిలబడుతున్నారు. జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేయాలనుకున్నా రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వకపోవడం, ఇచ్చినా పార్టీ మద్దతు లేకుండా చేయడం, రెబల్‌గా బీసీయేతర కులాల అభ్యర్థులను నిలపడం సర్వసాధారణం. ఓసీలు రిజర్వ్ సీట్లలో పోటీ చేయలేరు కాబట్టి, మీరు కూడా జనరల్ సీట్లకు రాకూడదనే వక్రబుద్ధితో బీసీలను మానసికంగా బంధిస్తున్నారు. అంతేకాదు, కొన్ని పార్టీల నాయకులు తరచూ ‘ఈ ఓసీ నాయకుడు పార్టీ కోసం లక్షలు ఖర్చుపెట్టాడు, ఎన్నో ఏండ్లుగా కష్టపడుతున్నాడు అతనికి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి నష్టం కదా?’ అని వాదిస్తుంటారు. ఈ వాదనల్లో రెండు పెద్ద అబద్ధాలున్నాయి. 1. పార్టీ కోసం ఖర్చు పెట్టడం కాదు అసలు మర్మం ‘టికెట్ కొనుగోలు’ చేసుకోవడం కోసమే. అంటే ప్రజాసేవ కాదని. ఈ వాదనలో డబ్బున్నవాడే టికెట్ పొందాలంటే రాజకీయం బహిరంగ వేలం అవుతుంది. 2. పార్టీ కోసం ఓటు బ్యాంకుగా మాత్రమే బీసీలు ఉపయోగపడతారు తప్ప, ‘ఖర్చు పెట్టే సామర్థ్యం’ లేదని అప్పుడే నిర్ణయిస్తారు. ఇది ఆర్థిక, సామాజిక అసమానతలను రాజకీయంగా స్థిరీకరించడమే.
ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర జనాభాలో బీసీలు సుమారు 60 శాతం ఉన్నా, జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు తక్కువే. ఇది బీసీలను ‘ఓటు యంత్రాలుగా’ మాత్రమే రాజకీయ పార్టీలు చూస్తున్నారనడానికి స్పష్టమైన నిదర్శనం. కర్ణాటకలో లింగాయత్, వొక్కలిగలు (బీసీ వర్గాలు) జనరల్ సీట్లలోనే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తమిళనాడులో థెవర్, వన్నియర్, గౌండర్ వంటి బీసీ వర్గాలు జనరల్ సీట్లలోనే ముఖ్యమంత్రులు, మంత్రులుగా ఎదిగారు. బీహార్‌లో యాదవులు, కుర్మీలు జనరల్ సీట్లలోనే రాజకీయ ఆధిపత్యం సాధించారు. ఈ రాష్ర్టాల్లో బీసీలు రిజర్వేషన్‌ను కనీస ‘హామీ’గా మాత్రమే తీసుకొని, జనరల్ సీట్లలో పోటీ చేసి గెలిచారు. ఇది చట్టసభల్లోనే కాదు, స్థానికసంస్థల్లో అమలుచేస్తే తెలంగాణలో చట్టసభలకు కూడా బీసీలు అధికారాన్ని సాధ్యపరుచుకుంటారు. ఇది ఎందుకు సాధ్యం కాదో నేటి నుంచే బీసీలు ఆలోచించాలి.
కాబట్టి రిజర్వ్ సీట్లు హక్కే, కానీ పరిమితి కాదనే విషయం తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలు ఏర్పరిచిన మానసిక బంధనం నుంచి బీసీలు బయటపడాలి. అగ్రకుల ఆధిపత్యాన్ని కాపాడేందుకే బీసీలను (ఇక్కడ ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు కూడా పోటీలో ఉండాలి) రిజర్వ్ సీట్లకు పరిమితం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ప్రతి సీటు మీద హక్కు ఉంటుంది. 50 శాతంలో ఓపెన్ క్యాటగిరిలో రిజర్వేషన్ అమలు కాదని చెప్పినప్పటికీ అగ్రకుల రిజర్వేషన్ మాత్రం సాగుతున్నది. బీసీలు రిజర్వ్ సీట్లకు మాత్రమే పోటీ చేస్తే, రాజకీయ శక్తి పునర్వ్యవస్థీకరణ ఎప్పుడూ జరగదు.
ఆధిపత్య కులవర్గాలు స్థిరంగా ఉంటాయి. రిజర్వేషన్లు మన హక్కు కానీ, జనరల్ సీట్లలో పోటీ చేయడం కూడా మన గౌరవం. కాబట్టి రిజర్వ్ సీట్లు మనకు అవకాశం ఇచ్చాయి, కానీ జనరల్ సీట్లు మనకు గుర్తింపునిస్తాయనే విషయాన్ని గుర్తెరగాలి. బీసీలు జనరల్ కేటగిరీకి వచ్చేటప్పుడు పోటీ కాదు, సామాజిక సమానత్వ విప్లవం అవుతుంది. జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేసేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలి. బీసీలలో ఆర్థికంగా బలపడిన కొత్త తరం రాజకీయంగా ముందుకురావాలి. బీసీ సామాజిక వర్గాల మధ్య ఐక్యత పెంచుకోవాలి, ఉపకుల విభజనను అధిగమించాలి. రిజర్వేషన్ అనే అంశం రాజకీయ పార్టీలు బీసీ ప్రజలకు విధించిన ఒక పరిమితి. బానిసత్వాన్ని విడనాడితేనే బీసీలు తమ సంఖ్యా బలాన్ని అధికార బలంగా మార్చుకోగలుగుతారు. ఇది సాధ్యం కాదని ఎవరైనా చెప్తే పట్టించుకోకూడదు. కాబట్టి ఇప్పుడు బీసీ యువత మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రిజర్వ్ సీటు మాత్రమే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం బీసీల హక్కు అని పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.