Telangana | ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న కొన్ని సామాజిక, రాజకీయ పరిణామాలు పైపైన చూస్తే అత్యంత సాధారణంగా, విడివిడిగా, యాదృచ్ఛికంగా కనిపిస్తున్నప్పటికీ… వాటిని లోతుగా విశ్లేషిస్తే ఒక ప్రమాదకరమైన ఉమ్మడి వ్యూహం స్పష్టమవుతున్నది. నాడు రక్తం చిందించి, సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ స్పృహను క్రమంగా నిర్వీర్యం చేసి, పాత ఆంధ్రా రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్య శక్తులకు మళ్లీ ఇక్కడ దారులు వేయడం అనేదే ఆ అంతఃసూత్రం. ఈ నిశ్శబ్ద పునరాక్రమణ ప్రయత్నానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ‘ఫెసిలిటేటర్’ (సహాయకుడు) గా వ్యవహరిస్తూ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
మనం ’టగ్ ఆఫ్ వార్’ (తాడు గుంజే ఆట)ను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఒకేసారి తాడును ఒక్క పెద్ద గుంజు గుంజరు. మొదట తాడును తమ వైపుకు కొద్దికొద్దిగా గుంజుతూ, అవతలి పక్షం పట్టు సడలే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తరు. అవతలి వారి కాళ్లు పట్టు కోల్పోయి, పూర్తిగా బలహీనపడ్డారు అని నిర్ధారించుకున్నాక… ఒకేసారి సర్వశక్తితో గుంజి అవతలి పక్షాన్ని పడేస్తరు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వంతో రేవంత్‌రెడ్డి సరిగ్గా ఇదే ’టగ్ ఆఫ్ వార్’ ఆడుతున్నారు.
తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని ఒక్కసారిగా దెబ్బకొడితే ఇక్కడి ప్రజలు సహించరని, తీవ్రంగా తిరగబడుతారని ఆ శక్తులకు బాగా తెలుసు. అందుకే, తెలంగాణ స్పృహను నెమ్మదిగా బలహీనపరుస్తూ, పాత ఆధిపత్య శక్తుల వైపు తాడును కొద్దికొద్దిగా గుంజుతున్నారు. ఇక్కడి ప్రజల పట్టు పూర్తిగా సడలగానే, తెలంగాణను మళ్లీ పాత ఉమ్మడి రాష్ట్రం రోజుల నాటి ఆధిపత్యంలోకి నెట్టేయాలన్నదే ఈ నిశ్శబ్ద కుట్ర అసలు ఉద్దేశం. ఈ వ్యూహంలో భాగమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగంగా ఎక్కడా ‘జై తెలంగాణ’ అని పలుకకపోవటం, అధికారిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు ‘అమరవీరుల స్థూపానికి’ దండవేసి నివాళులర్పించే సాంప్రదాయాన్ని ఉద్దేశపూర్వకంగా పాటించకపోవటం. రేవంత్ వైఖరిని లోతుగా చూస్తే ఆయన అసలైన ఉద్దేశం క్రమక్రమంగా తెలంగాణ స్పృహ అంతరించేలా చేయడమేనని స్పష్టమవుతున్నది.
నిశ్శబ్ద లొంగుబాటు ఆటలో భాగమే ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు. హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన మైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహ స్థాపన అనేది కేవలం ఒక దివంగత నాయకుడి గౌరవార్థం జరుగుతున్నది కాదు. దీనిని తెలంగాణ సాంస్కృతిక స్పృహపై ఆంధ్ర రాజకీయ ఆధిపత్య శక్తులు సాధించిన ఒక ‘ప్రతీకారాత్మక విజయం’గా’ చూడాల్సి ఉంటుంది. దానికి తోడు, రోశయ్య, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలను ఆవిష్కరించడం వెనుక కూడా ఒక పెద్ద అంతర్లీన వ్యూహం ఉన్నది. తెలంగాణ సమాజానికి పాత ఉమ్మడి రాష్ట్ర జ్ఞాపకాలను మళ్లీ అలవాటు చేయడం, తద్వారా అస్తిత్వ చైతన్యాన్ని క్రమంగా నీరుగార్చడమే ఇందులోని అసలు లక్ష్యం.
తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం కేవలం విగ్రహాలకే పరిమితం కాలేదు. తెలంగాణ ఉద్యమ గర్భంలో నుంచి పుట్టిన ‘తెలంగాణ తల్లి’ రూపాన్ని మార్చడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఆ తల్లి చేతిలో నుంచి తెలంగాణ ఆత్మ అయిన ‘బతుకమ్మ’ను తీసేసి, రూపం మార్చడం ద్వారా ఇక్కడి ప్రజలకు తెలంగాణ తల్లి పట్ల ఉండే అపురూపమైన అభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరిగే ‘బతుకమ్మ పండుగ’లో మునుపటి ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గతంలో చేపట్టిన వసతుల కల్పన గానీ, చెరువుల వద్ద ఏర్పాట్లు గానీ ఇప్పుడు మృగ్యమయ్యాయి.
అంతేకాదు, మన సంస్కృతిని ఎంతగా తాకట్టు పెడుతున్నారనే దానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ.. అధికారిక బహుమతుల మార్పు. రాష్ర్టాన్ని సందర్శించడానికి వచ్చే దేశ, విదేశీ అతిథులకు ప్రభుత్వ పక్షాన తెలంగాణ ప్రతీకలైన సిల్వర్ ఫిలిగ్రీ, కాకతీయ తోరణం లేదా చార్మినార్ కళారూపాలను జ్ఞాపికలుగా ఇచ్చే అద్భుతమైన సాంప్రదాయానికి రేవంత్ తిలోదకాలిచ్చారు. దానికి బదులుగా, పాత ఆంధ్ర సాంస్కృతిక ఆధిపత్యాన్ని గుర్తుచేసే ‘లేపాక్షి నంది’ని ప్రభుత్వ అధికారిక జ్ఞాపికగా ఇచ్చే కొత్త పద్ధతిని అమల్లోకి తేవడం ఈ నిశ్శబ్ద లొంగుబాటుకు నిదర్శనం కాదా?
‘బీఆర్ఎస్ గద్దెలను కూల్చండి, నామరూపాలు లేకుండా చేయండి‘ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరంతరం ఇస్తున్న పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కాదు; తెలంగాణ వాదానికి రక్షగా నిలబడిన ప్రాంతీయ శక్తిని పూర్తిగా బలహీనపరిచి, తద్వారా ఏర్పడే రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని తిరిగి తెలుగుదేశం పార్టీ ఇక్కడ పాగా వేయడానికి దారులు సుగమం చేయడం. తాజాగా ఆంధ్రాలో జరిగిన ‘మహానాడు’ సమావేశాలను గమనిస్తే ఈ కుట్ర ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. స్వయంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులతోనే, అదే మహానాడు వేదికగా తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయించడం అందులో భాగమే. అసలు తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీలోనూ లేదని, అదొక కృత్రిమ ఉద్వేగం అనిపించటం ఈ వ్యూహంలో పరాకాష్ట. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడించడం ద్వారా ఇక్కడి ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం, పూర్వవైభవం తెస్తాం’ అంటూ నారా లోకేశ్ చేసిన బహిరంగ ప్రకటనను కూడా మనం దీనికి కొనసాగింపుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు, తెలంగాణలో పాత ఆధిపత్య శక్తులు అధికారికంగా పునఃప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యం.
కాంగ్రెస్ పాలనలో కేవలం రాజకీయ, సాంస్కృతిక రంగాలే కాదు, తెలంగాణ ప్రజల జీవనాడులైన నీటి వనరుల విషయంలోనూ ఈ లొంగుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయంలో గానీ, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో గానీ తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. నిమ్మకునీరెత్తినట్లు ఉండే ఈ వైఖరి వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడిపిస్తున్న అంతర్రాష్ట్ర రాజకీయ లాబీయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ… ఇక్కడి స్థానిక తెలంగాణ నాయకులను, ప్రాంతీయ సమస్యలను పూర్తిగా పక్కకు పెట్టి, ప్రత్యేకంగా చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ను మాత్రమే కలిసి సుదీర్ఘంగా చర్చలు జరపడం ఈ వ్యూహానికి ఉన్న జాతీయ స్థాయి రాజకీయ మద్దతును సూచిస్తున్నది.
తెలంగాణను మళ్లీ ఆంధ్రా కేంద్రిత రాజకీయ శక్తుల ప్రయోగశాలగా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర పాలకులు ఉమ్మడిగా సహకరిస్తున్నారని అనేందుకు ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. కనుక, పైన పేర్కొన్న పరిణామాలన్నీ విడివిడిగా, స్పోరాడిక్ (యాదృచ్ఛికం) గా జరుగుతున్న ఘటనలు కావు. ఇది అత్యంత పద్ధతిగా, వరుస క్రమంతో, పథకం ప్రకారం సాగిస్తున్న తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ పునరాక్రమణ.
నాడు కేసీఆర్ నాయకత్వంలో మహా పోరాటాన్ని జరిపి, మేధావులూ కళాకారులూ తెలంగాణ నేల నలు చెరగులా భాజాల ప్రచారం చేసి, అనేకానేక పుస్తకాలు అచ్చువేసి పంచి, పత్రికలలో వ్యాసాలూ రాసి వేలాది మంది విద్యార్థులు, యువకులు రక్తం చిందించి, బలిదానాలు చేసుకొని నిర్మించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని, భావజాలాన్ని అంతమొందించే ఈ నిశ్శబ్ద కుట్రను, ప్రజలు సకాలంలో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విషయాన్ని ఇప్పుడే గుర్తించి, తిప్పికొట్టకపోతే భవిష్యత్తులో మన అస్తిత్వం మళ్లీ తీవ్రమైన ప్రమాదంలో పడటం నిస్సందేహం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్)