గడిచిన 15-20 ఏండ్లలో జరిగిన పలు రాష్ర్టాల 3-4 పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల తీరు తెన్నులను విశ్లేషిస్తే… కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ స్థానిక పార్టీలను ఓడించిన దాఖలాలు ఒక్కటి, అర మినహా ఎక్కడా మనకు కానరావు.
2011, పశ్చిమబెంగాల్లో స్థానిక పార్టీ అయిన టీఎంసీ 34 ఏండ్ల కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసినప్పటికీ టీఎంసీకి మూడింట రెండొంతుల కంటే ఎక్కువగా మెజారిటీ వచ్చింది. 2021లో జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున టీఎంసీ నాయకులను బీజేపీలో చేర్చుకొని, ఇతర కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులను చేర్చుకొని మోదీ, షాలు అంతా తామై ప్రచారం చేశారు. అయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2016 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు సంపాదించింది. కాంగ్రెస్ 2016లో భంగపడితే. 2021లో బీజేపీ భంగపడ్డది.
2013లో ఢిల్లీ ఎన్నికల్లో 15 ఏండ్ల కాంగ్రెస్ పాలనను స్థానిక పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అంతమొందించింది. ఆ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2015లో మోదీ, కాంగ్రెస్‌ను నిలువరించి 96 శాతం సీట్లను కైవసం చేసుకున్నది. 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఆప్ 90 శాతం సీట్లు సాధించింది. 2000లో ఒడిశాలో కాంగ్రెస్ నుంచి అధికారం చేజించుకున్న స్థానిక పార్టీ అయిన బీజేడీని ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కానీ , బీజేపీ కానీ ఓడించలేకపోయాయి. 23 ఏండ్లుగా నవీన్ పట్నాయక్ ఓటమి ఎరుగని ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పంజాబ్‌లో బీజేపీ కూటమితో అకాలీదళ్ లేక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవి. కానీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లో కాంగ్రెస్, బీజేపీ కూటములను మట్టి కరిపించి ఆప్ అధికారాన్ని కైవసం చేసుకున్నది.
కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, అసోం వంటి రాష్ర్టాలలో కాంగ్రెస్ లేకుంటే బీజేపీ కూటములు అధికారంలోకి వస్తున్నాయి. యూపీలో మాత్రమే స్థానిక పార్టీ నుంచి బీజేపీ అధికారం కైవసం చేసుకోగలిగింది. బీహార్‌లో బీజేపీతో లేకుంటే కాంగ్రెస్‌తో జతకట్టి స్థానిక పార్టీ జేడీయూ 2005 నుంచి అధికారంలో కొనసాగుతున్నది. తమిళనాడులో గత 60 ఏండ్లుగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎలాంటి ప్రభావం చూపలేదు. స్థానిక పార్టీలే అధికారంలోకి వచ్చాయి. గడిచిన 15-20 ఏండ్ల చరిత్రను పరిశీలిస్తే బలంగా ఉన్న స్థానిక పార్టీనీ, ప్రజాదరణ కలిగిన ఆ పార్టీ నేతను కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఓడించలేకపోయాయనేది చారిత్రక సత్యం.
1945-46లో బ్రిటిష్ ఇండియాలో జరిగిన ఎన్నికల ఫలితాల ఆధారంగా స్వతంత్ర సమరయోధుడు నెహ్రూ 1947లో ప్రధానిగా అధికారం స్వీకరించారు. 1952, 57, 62లో దేశ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి తాను 1964లో మరణించేవరకు ప్రధానిగా కొనసాగారు. తదనంతరం 13 ఏండ్లపైన కాంగ్రెస్ అధికారం కొనసాగింది. తమిళనాడులో ఎంజీఆర్ 1977లో తన ఏఐఏడీఎంకేను అధికారంలోకి తెచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే తన ముఖ్యమైన అజెండాగా పరిపాలన కొనసాగించారు. తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. తాను బతికిఉండగా డీఎంకే కానీ, కరుణానిధి కానీ అధికారంలోకి రాలేకపోయారు.
ఇక ఉమ్మడి ఏపీలో 1983 నుంచి జరిగిన 40 ఏండ్లలో అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే 1989లో మర్రి చెన్నారెడ్డి, 2004లో రాజశేఖరరెడ్డి (2009లో స్వల్ప మెజారిటీ) మినహా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నాయకుడు లేడు. ఆ ఇద్దరిలో పావు వంతు ప్రజాదరణ కలిగిన నాయకులు గడిచిన పదేండ్లలో కాంగ్రెస్‌లో కానీ, బీజేపీలో కానీ తెలంగాణలో లేనే లేరని రాజకీయ బుద్ధిజీవులు అభిప్రాయపడుతున్నారు.
14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో, చావును సైతం లెక్కచేయకుండా పంతం పూని తెలంగాణను సాధించిన తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్. ఉమ్మడి ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ మెజారిటీ సాధించి, తెలంగాణ ఏర్పడిన రోజునే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, అనేక కుట్రలను ఛేదిం చి తెలంగాణలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. సంక్షేమం, అభివృద్ధి అనే జోడెడ్ల బండితో తెలంగాణను ప్రగతిపథంలో పరుగెత్తించారు.
తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో మహాకూటమి పేరిట సుమారు 9 పార్టీలు జతకట్టాయి. పొత్తులతో కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ మూడొంతుల మెజారిటీతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అభివృద్ధి-సంక్షేమం, వ్యవసాయంలో తెలంగా ణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తున్నది అనే స్థాయికి తెలంగాణను కేసీఆర్ తన పదేండ్ల పాలనలో తీసుకుపోయారు. ఈ నిజాన్ని విమర్శకులు సైతం ఒప్పుకుంటున్నారు. తెలంగాణలో జరిగే రెండవ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు కానీ, బీజేపీ కానీ ఉండదని గడిచిన 20 ఏండ్ల చరిత్ర, పలు రాష్ర్టాల 3-4 పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అర్థమవుతుంది.