మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామినేని శ్రీనివాసరావు హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీనివాసరావు టీఎన్జీవోస్ కేంద్ర కోశాధికారిగా ఉంటూ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఉమ్మడి ఏపీలో ఎక్సైజ్ శాఖ మొత్తం ఆంధ్ర ప్రాంత ఆధిపత్యంలో ఉండేది. బహుశా 2005లో హైదరాబాద్కు తన కార్యస్థానం మార్చుకున్న శ్రీను హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లో ఇన్వార్డ్-ఔట్వార్డ్ సెక్షన్ మాత్రం తీసుకొని పూర్తిస్థాయి తెలంగాణ ఉద్యమకారుడిగా ఎదిగాడు.
ఎక్సైజ్ శాఖలోని యూనిఫాం నిబంధనలు, మిగిలిన అనేక కారణాల వల్ల తెలంగాణ సోయి లేని కాలంలో శాఖలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల అవగాహన, ప్రేమ ఉన్న కొద్దిమందిని కూడగట్టుకొని డిపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరినీ క్రమంగా ఉద్యమంలో భాగస్వాములుగా చేర్చినవాడు శ్రీనివాసరావు. ఉద్యమ సంస్థలు, ఉద్యోగ సంఘాలు ఏ పిలుపునిచ్చినా ముందుండి నడిపేవాడు.
హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోని తన టేబుల్ అనేక ఆలోచనలకు కేంద్రంగా ఉండేది. అక్కడికి వచ్చి శ్రీనుతో మాట్లాడి, అతని ద్వారా శాఖ నుంచి ఉద్యమ సమయంలో అనేక సహాయాలు పొందిన వ్యక్తులు తదనంతరం ఆర్థికంగా, రాజకీయంగా ఎంతోఎత్తుకు ఎదిగినారు. తెలంగాణ ఉద్యమం కొంత చల్లబడినప్పుడు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు ఎంతో వేదనకు గురై తన బాధను పంచుకునేవాడు.
ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి ఆ తర్వాత టీఎన్జీవో సంఘంలోకి వెళ్లి కీలకస్థానంలో తన బాధ్యతలను నిర్వహించినాడు. తనకు ఉద్యమ సమయంలో ఏర్పడిన అత్యున్నత పరిచయాలను తదనంతరం ప్రత్యేక రాష్ట్రంలో ఎక్కడా వినియోగించుకోకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాను ఉద్యమ జీవిగా ఎక్కడెక్కడో తిరిగినా, ఆయన భార్య కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. తన ఇద్దరు కుమారులు విద్య విషయంలో చాలా కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగి, జీవితంలో స్థిరపడే సమయంలో, వారిని చూసి ఆనందించే తరుణంలో ఈ లోకాన్ని విడిచి అకస్మాత్తుగా వెళ్లడం పెను విషాదం. ఉద్యమ సహచరుడికి వినమ్ర నివాళి.
– ఎస్.శ్రీనివాసమూర్తి