జూన్ 2 అంటే బిగించిన పిడికిలి తెలంగాణ భౌగోళిక పటంగా పరిణమించిన రోజు. ఆత్మగౌరవ పోరాటం అద్వితీయ విజయం సాధించి న రోజు. రాజకీయంగా తెలంగాణ పతాకం రెపరెపలాడిన రోజు. ఈ సారి ఈ పండుగ రెండు విధాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. రాష్ట్ర అవతరణం రోజున, రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కలిపి జరుపుకోవడం విశేషమైతే, ఈ అపురూప కలయికకు అమెరికాలోని డాలస్ వేదిక కావడం మరో విశేషం. తెలంగాణ పోరాటం ఈ గడ్డ మీద జరిగినా దేశ దేశాల్లోని తెలంగాణ బిడ్డలు చేపట్టిన సంఘీభావ కార్యక్రమాల అండదండలు అసామాన్యమైనవి. ఉద్యమానికి వారు కలిగించిన ఉత్తేజం అద్వితీయమైంది. తెలంగాణ ఎన్నారైల పోరాటదీప్తిని గౌరవించుకుంటూ డాలస్లో నిర్వహించిన భారీ సభ తెలంగాణకు ఓ మూలమలుపు. అదొక మహా సంరంభం. మహత్తర సందర్భం. విశ్వవేదికపై జరిగిన తెలంగాణ అలయ్ బలయ్.
డాలస్ సభ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఆత్మీయ నీరాజనాలెత్తింది. అమెరికాలోని పలు నగరాలతోపాటుగా ఇతర దేశాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన ఎన్నారైలు హాజరైన ఆ సభలో ఆయనకు లభించిన స్వాగత సత్కారాలు అపురూపమైతే, అద్భుతమైన రీతిలో ఆయన చేసిన ప్రసంగం ఓ మైలురాయిగా నిలుస్తుంది. తెలంగాణ మట్టి పరిమళాన్ని గుర్తు చేస్తూ ‘జననీ జన్మభూమిశ్చ’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు కేటీఆర్. మారిన పరిస్థితుల్లో మరో పోరాటానికి సన్న ద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అభిమానుల్లో నూతనోత్సా హం కలిగించారు. ‘తెలంగాణ గాలివాటంగా వచ్చిన రాష్ట్రం కాదు. సుదీ ర్ఘ యాతనలు, అమరుల త్యాగాలతో రాష్ర్టాన్ని సాధించుకున్నం. సాధించుకున్న రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అగ్రస్థాయిలో నిలుపుకొన్నం. తెలంగా ణ విఫల రాష్ట్రం అవుతుందని, పాలించడానికి నేతలున్నారా అని గేలి చేసినవారే తమకు కూడా తెలంగాణలోని నేతల వంటి పాలకులుంటే బాగుండనే రీతిలో ప్రశంసలందుకున్నాం’ అని గుర్తుచేశారు.
కానీ, నేడు పరిస్థితి తారుమారైంది. మాయదారి హామీల మోసకారి పాలనలో రాష్ట్రం చీకట్లలోకి జారుకున్నది. ప్రజలు ఆగమాగమైపోతున్న రు. అవస్థలు పడుతున్నరు. కేసీఆర్ పాలన నాటి మంచిరోజులను పదే పదే గుర్తుచేసుకుంటున్నరు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన చల్లని మాటల తో గుండెదిటవు కల్పించారు. తెలంగాణలో మళ్లీ వెలుగులు విరజిమ్మే రోజు ఎంతో దూరంలో లేదని కేటీఆర్ ఢంకా బజాయించారు. మరో మూడేండ్లలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని భరోసా కల్పించారు. బిడ్డ మళ్లీ తల్లి ఒడికి చేరుతుందని భావగర్భితంగా చాటిచెప్పారు. కేటీఆర్ తన ప్రసంగాన్ని రాజకీయాలకే పరిమితం చేయకుండా ఎన్నారైలతో బీఆర్ఎస్ అనుబంధాన్ని ప్రత్యేకంగా స్మరించుకున్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను, విశేషించి ఏఐని అందిపుచ్చుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం. అంతేకాకుండా అటు అమెరికాతో పాటుగా దేశ దేశాల వలస విధానాల్లో వస్తున్న పెనుమార్పుల వల్ల తెలంగాణ బిడ్డలకు ఎదురవుతున్న సమస్యలనూ ప్రస్తావించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ ఎల్లవేళలా, అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణకు సేవచేయడం బరువు కాదని, అది తమ బాధ్యతని కేటీఆర్ చెప్పడం కొసమెరుపు.