అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పంటలను సాగు చేస్తున్న రాష్ట్ర రైతాంగాన్ని ప్రకృతి కూడా పరీక్షిస్తున్నది. బహుళ సమస్యలతో సతమతమవుతున్న రైతన్నలతో చెడగొట్టు వానలు చెడుగుడాడుతున్నాయి. పంట సాయం, రుణమాఫీ వంటివి ఎండమావులుగా మారిన నేపథ్యంలో పులి మీద పుట్రలా అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. గాలి వాన బీభత్సానికి చేతికందిన పంట నీటిపాలవుతున్నది. రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈదురు గాలులతో, వడగండ్లతో కురుస్తున్న వర్షాల వల్ల పొలాల్లో పంటలే కాకుండా తోటలకూ నష్టం వాటిల్లుతున్నది. మామిడి, బొప్పాయి తోటలకు ఎక్కువగా నష్టం జరిగింది. మరోవైపు గొర్రెల పెంపకందారులు పిడుగుల కారణంగా జీవాలను కోల్పోతున్నారు. వ్యవసాయ మంత్రి నెల రోజుల కిందట వెల్లడించిన అంచనాల్లో రెండు దఫాల్లో జరిగిన పంట నష్టాన్ని సుమారు రూ.24 వేల కోట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత అకాలవర్షాలు వరుసబెట్టి ఈడ్చి ఈడ్చి కొడుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడ్డాయి.
18న కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎండలు, అకాల వర్షాల దాగుడు మూతలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల కిందట ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో అకాలవర్షాలు మరోసారి తడాఖా చూపించాయి. మొదటి విడత వానలకు పొలాల్లో ఉన్న పంట నష్టమైతే ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కల్లాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం నీటగలిసి పోతున్నది. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటమే అందుకు కారణం. రకరకాల కొర్రీలతో కొనుగోళ్లు జాప్యం అవుతుండటంతో ధాన్యం వర్షార్పణం అవుతుండటంతో రైతులు నిస్సహాయంగా చూస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. తాజాగా పంట నష్టాలపై ప్రభుత్వ ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ 50-70 వేల ఎకరాల్లో పంట నష్టమైనట్టు అనధికారిక అంచనా. మంత్రి ప్రకటించిన ఎకరా నష్టానికి రూ.10 వేల ప్రభుత్వ సాయం ఏ మూలకూ సరిపోదనేది రైతులు చెప్పాల్సిన పనిలేదు. పైగా అది ఎప్పుడు ఇస్తరో తెలియని పరిస్థితి.
ఇదివరకటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పంట పెట్టుబడితో సమానమైన మొత్తాన్ని సర్కారు పరిహారంగా ఇస్తామనడం విడ్డూరం. మరోవైపు పంటనష్టం అంచనాల్లోనూ అధికారులు అలసత్వం వహిస్తుండటం రైతులకు సమస్యగా మారుతున్నది. సర్వే నత్తనడకన సాగుతున్నది. 33 శాతానికి మించి నష్టం జరిగితేనే సాయం కోసం పరిగణిస్తామనే సర్కారు వారి నిబంధన గుదిబండగా తయారైంది. గోడ దెబ్బ- చెంప దెబ్బ అన్నట్టుగా రెండువైపులా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణ సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాస్త్రీయమైన రీతిలో నష్టాన్ని అంచనా వేయడం, పరిహారం పెంచడం, వీలైనంత త్వరలో అందించడం అనేది తప్పనిసరి అని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది.