ఈ ఆగస్టులో తెలంగాణలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. సరిగ్గా 262 ఏండ్ల కిందట (1763లో) కూడా తెలంగాణలో బాగా వర్షాలు కురిసి గోదావరి వరదలతో ఉప్పొంగింది. ఆ కాలంలో భారతదేశంలో బలవంతులైన మరాఠాలను (శివాజీ వారసులను) ఎదుర్కొంటూ రెండో నిజాం అలీఖాన్ హైదరాబాద్‌కు దక్కన్ ప్రాంత రాజధానిని తరలిస్తున్నాడు. ఈ క్రమంలో గోదావరి వరదలను ఆసరాగా తీసుకొని నిజాం తరఫున పోరాడిన కౌలాస్ రాజాను (కామారెడ్డి జిల్లా) మరాఠాలు మట్టుబెట్టారు. అయినా నిజాం కౌలాస్ రాజా ధైర్యసాహసాలను మెచ్చుకొని ఆయన వారసులకు కౌలాస్తో పాటు మరిన్ని జాగీర్లు ఇచ్చాడు. దానితో రాజ్‌పుత్‌లు ఉత్తర తెలంగాణలో రాజరికం చేయడం మొదలుపెట్టి దేశానికి స్వాతంత్య్రం వచ్చేదాకా పాలించారు. ఆ వివరాల్లోకి వెళ్తే…
ఉత్తర భారత్‌లో మరాఠా భూభాగమైన పుణేపై రెండో నిజాం అలీఖాన్ దళాలు దాడి చేశాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న మరాఠా పేష్వా రఘునాథ్ రావు రెండో నిజాంను వెంబడించాడు. రెండో నిజాం మొదట ఔరంగాబాద్ వైపు తిరోగమించి, తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లాలనుకున్నాడు. బీదర్ కోటలో వర్షాకాలం గడపాలనుకున్నాడు. మరాఠాలు కోపంగా ఉన్నారు. దారిలో రెండో నిజాం దళాన్ని నాశనం చేయాలనుకున్నారు. నిజాం సైన్యం రెండు భాగాలుగా విడిపోయినప్పుడు, మరాఠాలు నిజాం దళాలను వెంబడిస్తూ ఆ సమయంలో వస్తున్న గోదావరి వరదలను తెలివిగా వాడుకున్నారు. రాక్షస భువన్ అనే ప్రదేశంలో గోదావరి నది ఒడ్డున రెండో నిజాం, మరాఠాల మధ్య యుద్ధం జరిగింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ధరూర్ కోటకు ఉత్తరాన ఉన్న రాక్షస భువన్ ఒక చిన్న గ్రామం. పుణేను దోచుకున్న తర్వాత, రెండో నిజాం దాదాపు 1,00,000 ఏనుగులు, గుర్రాలు, ఫిరంగులు, పదాతిదళ సైనికులతో కూడిన సైన్యాన్ని ఔరంగాబాద్ నుంచి బలవంతంగా తరలించారు. దాదాపు 10 కిలోమీటర్ల పొడవైన కాన్వాయ్ రోడ్డుపై కదులుతున్నది (ఔరంగాబాద్- రాక్షస భువన్- లాతూర్- ఉద్గిర్- బీదర్ కోట). రెండో నిజాం సైన్యానికి ధైర్యవంతుడైన రాజా కున్వర్ అజయ్ సింగ్ గౌర్ నాయకత్వం వహించారు. తర్వాత ప్రధానమంత్రి విఠల్ సుందర్ ప్రతాప్వంత్ రావు, ఇతర నవాబులు నాయకత్వం వహించారు.
రాక్షస భువన్ సమీపంలోని గోదావరి వద్దకు సైన్యం చేరుకున్నది. రాజాకృష్ణ అజయ్చంద్ గౌర్, ప్రధానమంత్రి నేతృత్వంలోని నిజాం అడ్వాన్స్ గార్డులో ఒక భాగం 7-8 వేల మంది సైనికులతో కలిసి గోదావరిని దాటి రాత్రి బస చేశారు. 1763 ఆగస్టు 8, 9 తేదీల్లో భారీ వర్షాలు కురిశాయి. అకస్మాత్తుగా గోదావరికి వరద పోటెత్తింది. గోదావరి ఉత్తర ఒడ్డున ఉన్న నిజాం సైన్యం నుంచి రాజాకృష్ణ అజయ్ చంద్ గౌర్ దళం విడిపోయింది. పేష్వా రఘునాథ్‌రావు రెండో నిజాంను దగ్గరగా వెంబడిస్తున్నాడు. పరిస్థితిని సద్వినియోగం చేసుకొని, మరాఠాలు దాదాపు 8 వేల మంది సైనికులతో కూడిన రాజా అజయ్చంద్ దళంపై ఆకస్మిక దాడిని ప్రారంభించారు.
మరాఠా సైన్యంలో 50 వేల మంది సైనికులు, గుర్రాలు, ఫిరంగులున్నాయి. రెండు రోజుల పాటు భారీ యుద్ధం జరిగింది. నిజాం సైన్యం, మరాఠాల సైన్యం నిష్పత్తి 1:5 సైనికులు. రాజా అజయ్ చంద్ గౌర్ రాజ్‌పుత్‌లు, గార్డీల (ముస్లిం తెగ)తో కలిసి చాలా ధైర్యంగా పోరాడారు. మరాఠాలు ఫిరంగులను తీసుకువచ్చి గుర్రాలతో దాడి చేశారు. రోజంతా మరాఠాల దాడులు కొనసాగాయి. రాజా అజయ్చంద్ గౌర్ తన చివరి మనిషి/ శ్వాస వరకు నిజమైన ధైర్యవంతుడైన రాజ్పుత్లాగా పోరాడాడు. 1763 ఆగస్టు 10న అతను తీవ్రంగా గాయపడ్డాడు కానీ యుద్ధభూమిని విడిచిపెట్టడానికి నిరాకరించాడు. ప్రధానమంత్రి విఠల్దాస్ ప్రతాప్వంత్ రావు కూడా ధైర్యంగా పోరాడి మరణించారు. రాజా అజయ్చంద్ గౌర్ సైన్యం సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ వీరోచితంగా పోరాడుతూనే ఉన్నది. చివరికి ఆగస్టు 11న ప్రధానమంత్రి, రాజా అజయ్ చంద్ గౌర్ అమరులయ్యారు. తర్వాత గోదావరి నది ఒడ్డున రాజా అజయ్చంద్ గౌర్ సమాధిని నిర్మించారు. నేటికీ ఆ సమాధి ఉన్నది. ప్రత్యక్ష సాక్షులుగా ఉండి గాయపడిన కొద్దిమంది సైనికులు మాత్రమే తమ రాజుల ధైర్యసాహసాల వివరాలను రెండో నిజాంకు వివరించారు. యుద్ధ సమయంలోనూ పరిస్థితి గురించి నిజాం తెలుసుకున్నాడు, కానీ వరదల కారణంగా ఎటువంటి బలగాలను పంపలేకపోయాడు. నిజాం చేసిన వ్యూహాత్మక తప్పిదం, చివరి నిమిషంలో నిజాం సైన్యాన్ని విడిచిపెట్టిన మరాఠా సర్దార్ల వెన్నుపోటు కారణంగా ధైర్యవంతులైన రాజా కున్వర్ అజయ్ చంద్ గౌర్, గోపాల్‌సింగ్ సవాయి, ప్రధానమంత్రి రాజా ప్రతాప్వంత్ రావు, మరికొందరు నవాబులు కూడా అమరులయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన ఆ యుద్ధంలో నిజాం దాదాపు 500 గుర్రాలను, 8,000 మంది సైనికులను కోల్పోయాడు. తన అత్యంత సమర్థుడైన జనరల్‌ను కోల్పోవడంతో నిజాం పూర్తిగా నిరాశ చెందాడు. రాజా అజయ్చంద్ గౌర్ ధైర్యసాహసాల గురించి తెలుసుకొని, అతని కుటుంబాన్ని ఓదార్చడానికి కాందహార్ కోటకు వెళ్లాడు.
కాందహార్ కోట వద్ద ఈ వార్త విని రాజకుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. రాజుల అత్యుత్తమ ధైర్యసాహసాలకు నిజాం ఎంతో ముగ్ధుడై ఆ కుటుంబానికి మరో మూడు జాగీర్లను బహుమతిగా ఇచ్చాడు.
రాజా అజయ్ చంద్గౌర్కు ముగ్గురు కుమారులు. రాజా కున్వర్ లాల్ కబీర్‌సింగ్ గౌర్, రాజా కున్వర్ పదమ్‌సింగ్ గౌర్, చిన్న రాజా కున్వర్ తేజ్ సింగ్ గౌర్. పెద్దవాడు కబీర్ సింగ్ కాందహార్ కోటను వారసత్వంగా పొందాడు. రాజా అజయ్చంద్ గౌర్ తమ్ము డు రాజా కున్వర్ నర్పత్సింగ్కు మాహోర్ కోట జాగీర్, రాజా కున్వర్ తేజ్ సింగ్ గౌర్‌కు సతారా జిల్లా కన్నెర్ ఖేడ్‌లోని కొన్ని వందల గ్రామాల జాగీర్ ఇవ్వబడింది. చిన్న కుమారుడు పదమ్సింగ్కు నిజామాబాద్‌లోని కౌలాస్ కోట జాగీర్ను ఇచ్చారు. ఆయన, ఆయన వారసులు 120 గ్రామాల పరిధి గల కౌలాస్ కోట సామంత రాజ్యాన్ని 1948 వరకు ప్రజలతో మమేకమై సుభిక్షంగా పాలించారు. వెయ్యేండ్ల చరిత్ర గల కౌలాస్ కోట ఇప్పుడు ఒక దర్శనీయ స్థలం.