జార్ఖండ్‌లోని బడాబంబూ వద్ద జరిగిన హౌరా-ముంబై రైలు ప్రమాదం రైల్వేశాఖ అసమర్థ నిర్వహణను మరోసారి వేలెత్తి చూపిస్తున్నది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒక ట్రాక్ మీద వెళ్తున్న గూడ్స్ బండి పట్టాలు తప్పి వ్యాగన్లు పక్కనున్న ట్రాక్ మీదకు ఒరిగాయి. వాటిని ఢీకొని ప్రయాణికుల రైలు ప్రమాదానికి గురైంది. ప్రపంచంలోనే అత్యధిక సిబ్బంది పనిచేసే సంస్థగా మన రైల్వేశాఖకు పేరున్నది. కానీ, ప్రమాదాల నివారణలో మాత్రం అప్రతిష్ఠ మూటగట్టుకుంటున్నది. సాంకేతికత ఎంతో అభివృద్ధి చెంది కృత్రిమ మేధస్సు అందుబాటులోకి వస్తున్న ఈ రోజుల్లో రొటీన్‌గా ఇలాంటి ప్రమాదాలు జరుగడం అర్థరహితం. అమాయక ప్రయాణికులు బలికావడం విషాదకరం.
ఏదో చెదురుముదురుగా జరుగుతున్న ప్రమాదాల్లో ఇదొకటని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. జూలైలో జరిగిన వరుస ప్రమాదాలే అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. జూలై 14న పశ్చిమబెంగాల్లోని ఖార్డాలో ఓ ప్రయాణికుల రైలు మరో రైలుకు చెందిన రెండు బోగీలను ఢీకొట్టింది. జూలై 20-21 తేదీల్లో యూపీ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో మూడుచోట్ల గూడ్సు రైళ్లు పట్టాలు తప్పాయి. అంతకుముందు జూన్ 17న పశ్చిమబెంగాల్లోనే కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలును ఓ గూడ్సు రైలు వెనుక నుంచి ఢీకొన్నప్పడు పదిమంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిశాయి. నిరుడు జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 293 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించినప్పుడు కవచ్ కార్యక్రమం గురించిన చర్చ జరిగింది. రైళ్లు ఢీకొనకుండా నివారించే ‘కవచ్’ వ్యవస్థ విస్తరణ నత్తనడకన నడుస్తున్నది. ప్రాధాన్య ప్రాతిపదికన దీన్ని విస్తరించడం లేదు. ఆ తర్వాత ప్రమాదాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి.
రైలు ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి తరహాలో రైల్వేమంత్రులు రాజీనామాలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు నెపం ఎవరో ఒకరి మీదకు తోసి తమ పదవులు పదిలం చేసుకోవడమే ఆనవాయితీ. దర్యాప్తు జరిపించి కిందిస్థాయి సిబ్బందిని బలిపశువులను చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. రైల్వే యూనియన్లు నిరసిస్తున్నది ఈ ధోరణినే. మొన్నటి బడ్జెట్లో రైల్వేలకు అత్యధికంగా రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. ఇలా పెద్ద మొత్తాలు కేటాయించడం వల్ల ప్రయోజనం ఉంటుందనుకుంటే పొరపాటే. రైల్వే శాఖ హైస్పీడ్ రైళ్లపై ఎక్కువ దృష్టిపెడుతూ భద్రతను, సిగ్నలింగ్‌ను పట్టించుకోవడం లేదని విమర్శలు వసున్నాయి. వరుస ప్రమాదాలు దీన్ని పట్టి చూపిస్తున్నాయి. అందువల్ల వేగానికి బ్రేకులు వేసి భద్రతకు పెద్దపీట వేయడం గురించి రైల్వేశాఖ పెద్దలు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. కవచ్ వంటి ప్రమాద నివారణ వ్యవస్థలను సత్వరమే రూపొందించి ఆచరణలోకి తేవాలి. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి వరకు జవాబుదారీతనం ఉండేలా చూడాలి. సంతాపాలు, పరిహారాలు మరణించిన వారి కుటుంబాల ఆర్తిని తీర్చలేవు. రేపు మరో ప్రమాదం జరగదన్న భరోసానే రైలు ప్రయాణికుడికి అసలు ధీమా!