గుంపు మేస్త్రీ ఎవరింటికి పుటం పెడుతడో తెల్వక జనం తెల్లార్లు జాగారం చేస్తున్నరు. వాళ్లకు పండుగ లేదు, పబ్బం లేదు. పెత్తరమాస నాడు గూడ అమ్మలక్కలు బతుకమ్మ పేరుకే పేర్చిండ్రు గనీ.. మది నిండా గుండెలవిసిపోయే బాధేనాయే. ఆ బాధను కైగడితే బతుకమ్మ పాటైంది.
‘గుంపు మేస్త్రీ పాలన ఉయ్యాలో..
గుదిబండ తీరాయె ఉయ్యాలో..
పేదల బతుకుల్లో ఉయ్యాలో..
చీకటి నింపిండు ఉయ్యాలో
గూడు చెదిరిపాయె ఉయ్యాలో..
గుండెలు అవిసిపాయె ఉయ్యాలో..
కాంగ్రెస్ రేవంత్ ఉయ్యాలో..
కాలయముడైపాయె ఉయ్యాలో..’
బతుకమ్మ రాగంతోనైనా ఆ మేస్త్రీకి సుతి ముట్టి బతుకనిస్తాడో అంటున్నారు మహిళలు.
ఆంధ్రా ప్రజలు ఎగిరి గంతేస్తున్నరట! ఎందుకో తెలుసా ఇన్నాళ్లు ఏపీలో నాణ్యమైన మందు దొరక్క మందుబాబులు ఉక్కిరి బిక్కిరైన విషయం తెలిసిందే కదా? అయితే ఎన్నికలకు ముందు ‘నాణ్యమైన మందును మీకు అందుబాటులో తెస్తామ’ని మాటిచ్చిన చంద్రబాబు ఆ మాట నెరవేర్చుకున్నారని సంతోషపడుతున్నారట. దసరా సందర్భంగా ఏపీ అంతటా మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయట! ప్రస్తు తం ‘జాబు రావాలంటే బాబు రావాలి’ నినాదం కాస్తా ‘మం దు రావాలంటే చంద్రబాబు రావాలి’ అనే నినాదంగా మారి ఏపీ మందుబాబుల నోట్లో నానుతున్నదట! ఇంకేం మందుబాబులకు ఇక దసరా పండుగే!
వాళ్లిద్దరిది గురుశిష్యుల బంధం. గురువుగారి రాజ్యాంగంలోని పుటకు ఈగ అతుక్కుంటే.. శిష్యుడు ఈగను కొట్టి పుటల పెట్టేదాక నిద్రపోడు. అదేమంటే..! అభివృద్ధిలో బాబుగారితో పోటీ అంటడు. ఆయన బుడమేరు బురుద కడుక్కోవడానికి, బురద రాజకీయాల్లోకి తిరుపతి లడ్డూను లాగిండు. ఈనె రైతు రుణమాఫీ చేయలేక.. రైతులకు మొఖం చూపలేక మూసీ మురికి మొఖం నిండా రుద్దుకొని తిరుగుతున్నడు. ఆ దురద భరించలేక హైడ్రాతో గోక్కున్నడు. జనం గురువును సుప్రీంకోర్టుకు.. శిష్యున్ని హైకోర్టు ఈడ్సిండ్రు. గురువు స్థాయికి తగ్గట్టుగా ఆయనను సుప్రీంకోర్టు తలంటగా.. శిష్యు డు స్థాయికి తగ్గట్టుగా హైకోర్టు మొట్టికాయలు వేసిందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నరు.
బర్రెకు సగేసి దూడను ఎగేసినట్టుంది బీజేపీ సంగతి. అటు జనాన్ని ఎగేస్తోంది, ఇటు సర్కారుకు సగేస్తోంది. హైడ్రాకు సూపర్ పవర్స్ కల్పిస్తూ కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాన్ని గవర్నర్ ఆమోదించారు. అయితే, కేంద్ర మంత్రులిద్దరు దగ్గర ఉండి మరీ ఆర్డినెన్స్‌కు ఆమోదింపజేశారట. పాపం బీజేపీతో రాహుల్‌గాంధీ కొట్లాడుతుంటే.. రాష్ట్రంలో బీజేపీతో కాంగ్రెస్ దోస్తీ కట్టడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
– చిన రాజయ్య