పోరాటాల గడ్డ పొలికేక వేసింది. దుర్యోధన, దుశ్శాసన దుర్వినీత పాలనపై కురుక్షేత్ర యుద్ధం ప్రకటించింది. అమీతుమీ తేల్చుకుందామని బరి గీసి నిల్చింది, తొడగొట్టి పిలిచింది. కాంగ్రెస్ పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజాపోరాటాలకు కోస్గి సభ ఓ మూలమలుపు. ఇష్టారాజ్యపు హుంకారం ఇంకానా, ఇకపై సాగదని తేల్చిచెప్పిన ధిక్కారం. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో బీఆర్ఎస్ జనాక్షౌహిణుల సాక్షిగా విసిరిన సవాలు విజయుని శంఖారావం. పాలకుల గుండెల్లో మోగిన ఢంకాధ్వానం. కోస్గి జనసముద్రం హోరు ప్రజా కంటకుల పాలిట రాబోయే తుఫాను పంపిన తాఖీదు. ఏమి జనం? ఏమా సమరోత్సాహం? భూమిని చెరపట్టాలని చూసే హిరణ్యాక్షుల పాలిట రైతు నిరసన దీక్ష ఓ అగ్నిపరీక్ష. పచ్చని పొలాలను ఎండబెట్టి.. సాగును పండబెట్టి.. భూమి పుత్రులను తరిమికొట్టి.. కార్పొరేట్ రాబందులకు కట్టబెట్టి.. పబ్బం గడుపుకోవాలనే దుర్మార్గ పాలనకు చరమగీతం. కాంగ్రెస్ దుర్భర పాలనపై జన విద్యుద్ఘాతం.
స్వరాష్ర్టాన్ని సాధించిన పార్టీ సాగును బాగుచేసి రైతును రాజును చేసింది. దండగన్న వ్యవసాయం పండుగైంది. కానీ అరచేతిలో స్వర్గం చూపి అందలమెక్కిన కాంగ్రెస్ పాలనలో రైతు బతుకు ఆగమాగమైంది. పంటసాయానికి మంటబెట్టి, రుణమాఫీకి టోపీ పెట్టి తమాషా చేస్తుండటంతో నిత్యనరకమైంది. మరోవైపు భూముల సేకరణ పేరిట రైతులకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు నిరసన దీక్ష ఓ పెను ఓదార్పులా మారింది. కోస్గి సభకు వచ్చిన అశేష ప్రజానీకమే ఇందుకు నిదర్శనం. జనం నాడి, వాడి తెలిసిన కేటీఆర్ రాక ఓ ఉద్వేగ సందర్భం. దారిపొడవునా జనం నీరాజనాలెత్తింది. పూలు పరిచింది. గుండె తలుపులు తెరిచింది. మా కన్నీళ్లు తుడిచేవాడు, మా కోసం నిలిచేవాడు వచ్చాడని ఉప్పొంగిన ఉత్సాహం వెల్లి విరిసింది. ఆత్మీయ ఆలింగనంతో పోరుగడ్డలో పోటెత్తిన భావావేశం. అధికార మదంతో, లాఠీల బలంతో రైతుల నుంచి భూమిని విడదీసేందుకు జిత్తులమారి పాలకులు వేసిన ఎత్తులపై తిరగబడి విరగపోట్లు పొడిచిన లగచర్ల స్ఫూర్తికి కోస్గి సభ ఓ జయకేతనం. పోరాటపు ఆటుపోట్లను తట్టుకుని పురుడు పోసుకున్న బిడ్డకు ‘భూమి నాయక్’ అని కేటీఆర్ పేరుపెట్టిన క్షణం అపురూపమైన ప్రజానుబంధానికి దర్పణం.
గులాబీ రెపరెపల మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఉద్వేగభరిత ప్రసంగం జనం గుండె చప్పుడును ప్రతిధ్వనించింది. మోసకారి వాగ్దానాలతో గద్దెనెక్కి, మాయదారి ఎగవేతలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పాలనపై ఆయన సంధించిన ప్రశ్నలు ప్రజల గుండెల్లోంచి సూటిగా దూసుకు వచ్చినవే. అనుకోకుండా, అప్పనంగా దొరికిన సీఎం కుర్చీని అడ్డుపెట్టుకుని అధికారాన్ని అస్మదీయుల జాగీరుగా మార్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మళ్లీ పోటీ చేయాలన్న సవాలు మోసపోయి గోస పడుతున్న జనం విసురుతున్నదే. నాటికీ, నేటికీ బీఆర్ఎస్ సిద్ధాంతం, ఆచరణ ఒక్కటే. పాలకపక్షమైనా, విపక్షమైనా ప్రజల పక్షాన నిలవడమే. దోపిడీపై, పీడనపై కలబడి పోరాడి గెలవడమే. ఆ సంగతి కాంగ్రెస్ పాలకులు గుర్తుంచుకుంటే మంచిది.