హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవుల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం (10-04-2025) నాడు విశ్రాంత ఐఎఫ్ఎస్లు సిద్ధాంత్ దాస్, చంద్రప్రకాశ్ గోయల్‌లతో కూడిన కేంద్ర సాధికార కమిటీ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, దేవీప్రసాద్ కమిటీని కలిసి పార్టీ తరఫున సమర్పించిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు.
శ్రీ సిద్ధాంత్ దాస్, ఐఎఫ్ఎస్ (రిటైర్డ్, చైర్పర్సన్, సీఈసీ
శ్రీ చంద్రప్రకాశ్ గోయల్, ఐఎఫ్ఎస్, మెంబర్, సీఈసీ
విషయం: కంచ గచ్చిబౌలి భూముల్లో తెలంగాణ ప్రభుత్వ అటవీ నిర్మూలన, పర్యావరణ విధ్వంస చర్యలపై వినతిపత్రం
సర్!
హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఆనుకొని ఉన్న 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల్లో సహజంగా ఎదిగిన చెట్లు, పొదలు, అక్కడ ఉన్న వన్యప్రాణులను సంరక్షించే దిశగా సానుకూల చర్యలు చేపట్టే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పర్యావరణాన్ని సంరక్షించడం చాలా అవసరం. పెరుగుతున్న వాహనాల సంఖ్య, విస్తరిస్తున్న కాలుష్యం దృష్ట్యా కంచ గచ్చిబౌలి భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ప్రభుత్వ భూమిగా తెలంగాణ సర్కారు ప్రకటించింది. ఈ భూమిని వేలం వేసి ఉపాధి సృష్టించే యూనిట్ల ఏర్పాటు, ఇతర ప్రయోజనాల కోసం రూ.30,000 కోట్లను సమీకరించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)కి అప్పగించాలని నిర్ణయించింది. కానీ, కంచ గచ్చిబౌలిలోని సహజంగా పెరిగిన అపారమైన వృక్షసంపద, నీటివనరులు ఉన్న 400 ఎకరాల భూమిని అటవీయేతర ప్రయోజనాల కోసం వినియోగించాలనేది ప్రభుత్వ రహస్య అజెండాగా తెలుస్తున్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న హెచ్‌సీయూ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఈ భూమిని కాపాడాలని ఆందోళన చేపట్టారు. ఈ 400 ఎకరాల భూమిని ఎప్పుడూ సర్వే చేయలేదు. హద్దులు కూడా నిర్ణయించలేదు.
పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) కూడా చేయలేదు. అంతకుమించి ఈ భూమి 0.4 వృక్ష సాంద్రతను కలిగి ఉన్నది. హైదరాబాద్‌లోనే ఈ ప్రాంతం స్వచ్ఛమైన గాలి కలిగిన ప్రాంతంగా ఉన్నది. ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం నరికివేసిన చెట్లలో సహజ అటవీజాతులు ఎన్నో ఉన్నాయి. అల్బీజియా లెబ్బెక్ (దిరిషనము), అల్బీజియా అమారా (నర్లింగా), క్యాసియా ఫిస్టులా (రేల), డయోస్పిర స్మెలనాక్సిలాన్ (తునికి), ఫికస్ ఆర్నోటియానా, ఫికస్ బెంగాలెన్సిస్, ఫికస్ మోలిస్, హోలాప్టీలియా ఇంటెగ్రిఫోలియా (నెమలినార), రైటియా టింక్టోరియా (పాలకొడిష), అడినా కార్డిఫోలియా (హాల్దూ), వివిధ అకేసియా జాతులు, క్లొరోక్సిలోన్ స్వియటేనియా (సాటిన్ లేదా బిళ్లకర్ర), సాపిండస్ ఎమార్జినేటస్ (కుంకుడు), సెమేకార్పస్ అనాకార్డియమ్ (నల్లజీడి), హెలిక్టెర్స్ ఐసోరా (వడంబిరి లేదా నులికాయ), జిజిఫస్ (రేగు), వేప, సీతాఫలం, గుంపెనా (వడ్డిమాను), పారిజాతం వంటి అనేక రకాల చెట్లు ఉన్నాయి.
వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972ను తెలంగాణ ప్రభుత్వం, అధికారులు ఉల్లంఘించారు. ఐయూసీఎన్ రెడ్లిస్ట్లోని షెడ్యూల్ 1, 2లో ఉన్న పావురం, మచ్చల జింకలు, పాములు, అడవిపంది, మొసళ్లు, మానిటర్ లిజర్డ్ (ఉడుము), స్టార్ టార్టాయిస్ (నక్షత్ర తాబేలు), ఇండియన్ కెమీలియన్ (ఊసరవెల్లి), చేపలు పట్టే గద్ద, ఇండియన్ రాక్ పైథాన్ (కొండచిలువ), వూలీనెక్డ్ స్టార్క్, పెయింటెడ్ స్టార్క్, స్పాట్‌బిల్డ్ పెలికాన్, బ్లాక్హెడెడ్ ఐబిస్ (నల్లతల కొంగ), ఓరియంటల్ డార్టర్, బ్లాక్టెయిల్డ్ గాడ్విట్, రివర్ టెర్న్, టైలర్లీఫ్ వార్బ్లర్, హైదరాబాద్ ట్రీట్రంక్ స్పైడర్, పోచార్డ్ కింగ్‌ఫిషర్, పారాకీట్లు, తేళ్లు, చిలకలు మొదలైన ఎన్నో జాతుల ప్రాణుల ఆవాసాలను నాశనం చేశారు. ఈ విధ్వంస చర్యల కారణంగా తమ ఆవాసం కోల్పోయిన రెండు మచ్చలజింకలు (ఒక చిన్నపిల్ల, మరొకటి పెద్దది) మరణించాయి. ఇందుకు బాధ్యులైన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 2025 మార్చి 27న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములకు పర్యావరణ ప్రభావ అంచనా (EIA) నిర్వహించారా? అని ఈ సంస్థ తన పిటిషన్లో ప్రశ్నించింది. ఇందుకు సమాధానం ఇవ్వటానికి పదిరోజుల సమయం కోరిన ప్రభుత్వం మార్చి 30న ఒక్కసారిగా సుమారు 50 బుల్డోజర్లతో పెద్దఎత్తున చెట్ల తొలగింపును ప్రారంభించింది.
అదే సమయంలో హెచ్‌సీయూ విద్యార్థులు ఈ భూమిని సంరక్షించుకునేందుకు పెద్దఎత్తున నిరసనలు ప్రారంభించారు. ఏప్రిల్ 2న, వట ఫౌండేషన్ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు చెట్ల నరికివేతను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది. తర్వాత కేంద్రప్రభుత్వానికి చెందిన ఎంవోఈఎఫ్, సీసీ విభాగం.. ఆ భూముల విధ్వంసంపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అటవీ సంరక్షణ చట్టం, 1980 ప్రకారం తీసుకున్న చర్యలను వివరించాలని కోరింది. ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదని సమాచారం.
ఏప్రిల్ 3వ తేదీన సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి కంచ గచ్చిబౌలి భూముల విధ్వంసాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. సీఈసీని వ్యక్తిగతంగా కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సందర్శించి ఏప్రిల్ 16లోపు నివేదిక ఇవ్వాలని, అదే రోజు కేసు విచారణ ఉంటుందని ఆదేశించింది.
1. అటవీ (సంరక్షణ) చట్టం, 1980 ఉల్లంఘన: కంచ గచ్చిబౌలిని ప్రభుత్వం రికార్డుల ప్రకారం ‘అటవీభూమి’గా గుర్తించకపోయినప్పటికీ, అటవీ సంరక్షణ చట్టం, 1980, సెక్షన్ 2 ప్రకారం ఇలాంటి భూములో చెట్లను నరికే ముందు అటవీ క్లియరెన్స్ తీసుకోవాలా, వద్దా? అన్న ప్రశ్నకు టీఎన్ గోదావర్మన్ వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసులో ఈ విధంగా పేర్కొన్నది. ‘అడవి’ అనే పదాన్ని దాని నిఘంటువు అర్థం ప్రకారం అర్థం చేసుకోవాలి. అటవీ పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 2(i) లక్ష్యం కోసం రిజర్వ్డ్, ప్రొటెక్టెడ్ లేదా ఇంకేదైనా కావచ్చు.. ఈ నిర్వచనం వర్తిస్తుంది. సెక్షన్ 2లో పేర్కొన్న ‘అటవీభూమి’ అంటే.. నిఘంటువు అర్థం మాత్రమే కాదు.. యాజమాన్య హక్కులతో సంబంధం లేకుండా ప్రభుత్వ రికార్డులలో అడవిగా పేర్కొన్న భూమికి కూడావర్తిస్తుంది. సెక్షన్ 2 ప్రయోజనం కోసం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై నిపుణుల కమిటీ వివరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అడవులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో 10 హెక్టార్లకుపైగా విస్తీర్ణం కలిగి, 0.4 కంటే అధిక సాంద్రత కలిగిన సహజ చెట్లతో ఉన్న భూమిని అడవిగా గుర్తించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.
1. అటవీ యాజమాన్యం లేదా వర్గీకరణతో సంబంధం లేకుండా FC చట్టంలోని నిబంధనలు అన్ని అడవులకు వర్తిస్తాయి.
2. ‘అడవి’ అనే పదాన్ని దాని నిఘంటువు అర్థం ప్రకారం అర్థం చేసుకోవాలి.
3. సెక్షన్ 2లో కనిపించే ‘అటవీభూమి’ అనే పదం నిఘంటువు అర్థంలో అర్థం చేసుకున్న అడవిని మాత్రమే కాకుండా, యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వ రికార్డులో అడవిగా నమోదు చేసిన ఏదైనా ప్రాంతానికి కూడా వర్తిస్తుంది. ఈ ఉత్తర్వు వాస్తవానికి అడవికి చాలా విస్తృత నిర్వచనాన్ని ఇచ్చింది.
కంచ గచ్చిబౌలి భూమి అడవి అనే నిర్వచనం కిందకు వస్తుందని స్పష్టమైంది. అంతేకాదు.. 1980 అటవీ సంరక్షణ చట్టం దీనికి వర్తిస్తుందని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది డీమ్డ్ ఫారెస్ట్‌గా 1980 ఎఫ్‌సీ చట్టం పరిధిలోకి వస్తుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని, అటవీ ప్రాంతం అన్న అంశాన్ని పూర్తిగా విస్మరించింది. ఈ విషయం నెలరోజులపాటు మీడియాలో చర్చనీయాంశమైంది. అయినప్పటికీ అటవీశాఖ, సర్కారు ఈ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణుల గురించి తెలియనట్టుగా నటించాయి. ఈ ప్రాంతంలో కనిపించే షెడ్యూల్-1 జాతుల ఉనికి గురించి తమకు తెలియదని చెప్తున్నారు. వాస్తవానికి, 02-04-2025న, మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ (రిటైర్డ్) తెలంగాణ రాష్ట్ర అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదును సమర్పించారు. అమూల్యమైన వన్యప్రాణుల ఆవాసాలను కాపాడాలని, మన దేశ పర్యావరణ చట్టాలను సమర్థంగా అమలు చేసేలా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.
2002లో అమలులోకి తెచ్చిన ఈ చట్టం ప్రకా రం, నియమించబడిన అధికారి ముందస్తు అనుమతి లేకుండా చెట్లను, కొమ్మలను నరికి వేయడానికి వీలులేదు. కంచ గచ్చిబౌలి భూమిని అడవిగా పరిగణించడానికి అర్హత లేదని, ఎఫ్‌సీ చట్టం పరిధిలోకి రాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించినప్పటికీ, ప్రభుత్వం నియమించిన అధికారి నుంచి వాల్టా, 2002 ప్రకారం ముందస్తు అనుమతి పొందకుం డా, ఆ భూమిలో ఉన్న చెట్లను నరికివేయడానికి టీజీఐఐసీకి అధికారం లేదు. వాల్టా 2002 ఏర్పా టు, దాని కింద రూపొందించిన నియమాలు.. అటువంటి కార్యకలాపాలను నియంత్రించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ప్రదేశాలలో ఉన్న చెట్ల రక్షణ ప్రయోజనాలను కాపాడటం కోసమే. లేకపోతే వాటిని విచక్షణారహితంగా తొలగిస్తారు.
ప్రభుత్వం, దాని సంస్థలు ఎటువంటి అనుమతులు లేకుండా సామూహికంగా చెట్ల నరికివేతకు పాల్పడుతుండగా, తెలంగాణలోని సాధారణ పౌరుడు మాత్రం తమ ప్రైవేట్ భూమిలో ఒక చెట్టును నరికివేయడానికి అనేక అనుమతులు పొందవలసి ఉంటుంది. కానీ, కంచ గచ్చిబౌలిలో టీజీఐఐసీ అన్ని చట్టాలను విస్మరించి, పెద్దసంఖ్యలో బుల్డోజర్లతో రాత్రివేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో చెట్లను తొలగించింది. అక్కడి వన్యప్రాణులు పారిపోయేలా చేసింది.
కంచ గచ్చిబౌలి భూమిలో ఉన్న చెట్లను కొట్టివేయడం, వన్యప్రాణుల ఆవాసాన్ని విధ్వంసం చేయడం ద్వారా వాణిజ్య/పారిశ్రామిక ఉపయోగం కోసం ఆ భూమిని వినియోగించాలనే ఆలోచనతో, ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్’ (ప్రజా విశ్వాస సిద్ధాంతం)ను విస్మరించింది. సహజ వనరులను రాష్ట్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రజల మేలు కోసం, ప్రయోజనం కోసం ఒక ట్రస్టీగా వ్యవహరించాలి. దోపిడీకి గురవుతున్న, క్షీణిస్తున్న సహజ వనరులను సంరక్షించడం ప్రభుత్వ విధి.
ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్న వనరులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకూడదు. సహజవనరులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాటిని కాపాడే విషయంలో ‘పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్’ రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద బాధ్యతను పెట్టింది. టీఎన్ గోదావర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇతరులు కేసు (2022)లో కూడా సుప్రీంకోర్టు ‘పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్’ను సమర్థించింది.
‘లఫార్జ్ ఉమియం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఇతరులు’ కేసులో సుప్రీంకోర్టు 2011 జూలై 6న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పర్యావరణ విషయాలకు సంబంధించి ‘డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ’ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. న్యాయ సమీక్ష ప్రక్రియలో భాగంగా పర్యావరణానికి సంబంధించిన విషయాలకు రాజ్యాంగ ‘అనుపాత సిద్ధాంతం’ (డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ)ని వర్తింపజేయాల్సిన సమయం ఆసన్నమైంది. న్యాయసమీక్ష, మెరిట్ రివ్యూకు భిన్నంగా ఉంటుంది. పర్యావరణం, దాని సహజవనరుల వినియోగం స్థిరమైన అభివృద్ధి, తరతరాలుగా ఉన్న సమతుల్యత సూత్రాలకు అనుగుణంగా ఉండాలనే విషయాన్ని తోసిపుచ్చలేం. కానీ, ఈ సమతుల్యతను పాటించేలా విధాన నిర్ణయాలు ఉండాలి.
ఈ పరిస్థితులలో కొన్ని మినహాయింపులతో సహజ వనరుల వినియోగానికి సంబంధించిన నిర్ణయాలను న్యాయసమీక్ష సూత్రాల ఆధారంగా పరీక్షించాలి. సంబంధిత అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారా? ఏదైనా అదనపు అంశాలు నిర్ణయంపై ప్రభావం చూపాయా? అన్న వాటిని పరిశీలించాలి. కంచ గచ్చిబౌలిలోని చెట్లను తొలగించి, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల కోసం ఆ భూమిని అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని స్పష్టంగా ఉల్లంఘిస్తున్నది. అందువల్ల దానిని ఆపాలి.
రాష్ట్ర ప్రభుత్వం భూమికి ధర్మకర్త మాత్రమే. డాక్ట్రిన్ ఆఫ్ ఇంటర్-జనరేషనల్ ఈక్విటీ అనేది ప్రస్తుత, భవిష్యత్తరాలు వనరులను పారదర్శకంగా వినియోగించుకోవటాన్ని తెలియచెప్తుంది. సుస్థిర అభివృద్ధిలో ఇది చాలా ముఖ్యమైన సూత్రం. సామాజిక సమానత్వం, ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమైనది. సహజ వనరులను భావితరాలు సమానంగా అనుభవించడం కోసం అందిస్తున్న ముఖ్యమైన న్యాయసూత్రం. కంచ గచ్చిబౌలి భూమిలో ఉన్న చెట్లను భవిష్యత్తు తరాల ప్రయోజనాలను పణంగా పెట్టి దోచుకోలేం. బారత్ ఇప్పటికే అటవీ విస్తీర్ణంలో దాదాపు 80% కోల్పోయింది. అడవులంటే కేవలం చెట్లు కాదు.. కీటకాలు, పక్షులు క్షీరదాలు, వివిధ జాతుల జంతువృక్షజాలంతో కూడిన జీవజాలం. ఇవి ఒకదానికొకటి అనుసంధానించి, పరస్పరం ఆధారపడి ఉంటాయి. అందువల్ల ‘ముందుజాగ్రత్త’ సూత్రం అమలు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణను నిర్ధారించడం కూడా అవసరం.
‘గత కొన్ని రోజులుగా పొదలు, చెట్లను నరికివేస్తున్నారు. పెద్దబండరాళ్లను తొలగిస్తున్నారు. ఆ ప్రాంతంలో నెమళ్లు, జింకలు, పక్షులు కనిపిస్తున్నాయి. అటవీ నిర్మూలన జరిగిన ప్రాంతం పక్కన సరస్సు ఉంది. హెచ్‌సీయూ పరిపాలనా బ్లాక్ సమీపంలో 3 హెలిప్యాడ్లు కనిపిస్తున్నాయి.’
సుప్రీంకోర్టు 03-04-2025 నాటి తన ఉత్తర్వులో ఇలా పేర్కొన్నది. ‘అమికస్‌క్యూరీ సమర్పించిన నివేదికను పరిశీలించడం వల్ల పైన పేర్కొన్న ఆదేశాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రం 2023 నియమాలు 16(1)లోని నిబంధనల ప్రకారం 15.03.2025న ఒక కమిటీని ఏర్పాటు చేసింది.’ ‘వాన్ (సంరక్షణ ఏవం సంవర్ధన్) నియమాలు, 2023 (సంక్షిప్తంగా, ‘2023 నియమాలు’) నియమం 16(1) కింద కమిటీని ఏర్పాటు చేసిన వెనువెంటనే, అటవీ నిర్మూలన కార్యకలాపాలను ప్రారంభించడం ఎంత ఆందోళనకరమైన అంశమో అర్థం చేసుకోవడం కష్టం. 2023 నియమాల్లోని నియమం 16(1) కింద ప్రభుత్వం నియమించిన కమిటీ చర్యలు ఇంకా ప్రారంభించాల్సి ఉన్నది. 2025 మార్చి 4న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కమిటీ తన నివేదికను కేంద్రప్రభుత్వానికి పంపించాల్సి ఉన్నది.
సుప్రీంకోర్టు 03-04-2025 నాటి తన ఉత్తర్వులలో ఇంకా ఇలా పేర్కొన్నది. ‘తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) నివేదిక, ఆయన పంపిన ఛాయాచిత్రాలు ఆందోళనకరమైన పరిస్థితిని దృశ్యమానం చేస్తున్నాయి. యంత్రాలను మోహరించి, భారీ సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 100 ఎకరాల విస్తీర్ణాన్ని ప్రభుత్వం నాశనం చేసింది. ఈ ప్రాంతంలో నెమళ్లు, జింకలు, పక్షులూ ఉన్నాయని నివేదిక కనుగొన్నది. వన్యప్రాణులు నివసించే అడవి ఉందని ఈ చిత్రాలు ప్రాథమికంగా సూచిస్తున్నాయి.’
సుప్రీంకోర్టు అదే ఉత్తర్వులో ప్రొసీడింగ్‌లను అన్నింటినీ ‘కంచ గచ్చిబౌలి అడవి, తెలంగాణ రాష్ట్రం’ శీర్షిక కింద సుమోటో రిట్ పిటిషన్‌గా నమోదు చేయాలని ఆదేశించింది. పత్రికల్లో చూసినట్టుగా, హెచ్‌సీయూను ప్రభుత్వం ఆ ప్రాంతం నుంచి తరలించాలని, మొత్తం హెచ్‌సీయూ ప్రాంతాన్ని, కంచ గచ్చిబౌలిని ఎకో-పార్కుగా మార్చాలని ఆలోచిస్తున్నది. ప్రతిపాదిత ఎకో-పార్కులో వన్యప్రాణులను ‘చూడటానికి’ సందర్శకుల కోసం ఒక భారీ టవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించినట్టు చర్చ జరుగుతున్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎకో-పార్కు పేరుతో భూమిని ‘అభివృద్ధి’ చేయాలనే రహస్య ఉద్దేశంగా కనిపిస్తున్నది. అభివృద్ధి ప్రయోజనాల కోసం లేదా ఎకో-పార్క్ కోసం చట్టాలు, నియమాల కింద అవసరమైన అనుమతులు తీసుకోవాలి. విధానాలను అనుసరించాలి.
1. ఈ ఉల్లంఘనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, టీజీఐఐసీపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. 2. గోదావర్మన్ తీర్పులను అమలు చేయడానికి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అడవులను రక్షించడానికి దీనిని జాతీయ ఉదాహరణగా పరిగణించండి. 3. కాలపరిమితి పునరుద్ధరణ ప్రణాళికను ప్రతిపాదించండి (అడవుల పెంపకం, వన్యప్రాణుల పునరావాసం). 4. MoEFCC నివేదికను సమర్పించండి. సుప్రీంకోర్టు చర్యల కోసం కేంద్ర సాధికారత కమిటీతో సమన్వయం చేసుకోండి.
పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకోవాలని, కంచ గచ్చిబౌలిలోని వృక్షసంపదను, వన్యప్రాణులను రక్షించడానికి రాష్ర్టానికి తగిన ఆదేశాలు ఇవ్వవలసిన అవసరాన్ని కోర్టుకు నివేదించాలని CECకి అభ్యర్థిస్తున్నాం. అటవీయేతర అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడానికి సంబంధిత చట్టాలు, నియమాలను విస్మరించవద్దని సుప్రీంకోర్టును కోరాలని విన్నవిస్తున్నాం.
– భవదీయులు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)
1. సుప్రీంకోర్టు 04.03.2025 తేదీన w.p (c) no.1164 of 2023లో ‘అశోక్‌కుమార్ శర్మ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (రిటైర్డ్) vs యూనియన్ ఆఫ్ ఇండియా’ అనే శీర్షికతో జారీచేసిన ఉత్తర్వు.
2. టీఎన్ గోదావర్మన్తిరుముల్పాడ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా ఇతరులు, రిట్ పిటిషన్ (సివిల్) no. 202 of 1995. అటవీ సంరక్షణ చట్టం,1980: సుప్రీంకోర్టు టీఎన్ గోదావర్మన్తిరుముల్పాడ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పుల ప్రకారం (wp no. 202/95, 171/96), 0.4 సాంద్రత, 10 హెక్టార్లకు పైగా ఉన్న ఈ భూమి ఒక డీమ్డ్ ఫారెస్ట్. దీన్ని తరలించాలంటే MoEFCC క్లియరెన్స్ అవసరం. దీనిని ఉల్లంఘించారు.
3. తెలంగాణ అటవీ చట్టం, 1967: నరకడానికి అనుమతులు పొందలేదు.
4. ఐయూసీఏఎన్ రెడ్‌లిస్ట్ షెడ్యూల్డ్ 1, 2లోని వన్యప్రాణుల ఆవాసాలను నాశనం చేయడం ద్వారా వన్యప్రాణుల రక్షణ చట్టం 1972ను ఉల్లంఘించారు. ఇక్కడ కనిపిస్తున్న నెమలి, మచ్చలజింక, పాములు, అడవిపందులు, ముళ్ల పంది, ఉడుము, నక్షత్ర తాబేలు, ఊసరవెల్లి, డేగ, ఇండియన్కార్ పైథాన్, ఉన్నిమెడకొంగ, పెయింటెడ్ స్టార్క్, స్పాట్‌బిల్డ్ పెలికాన్స్, బ్లాక్హెడెడ్ ఐబిస్, ఓరియంటల్ డార్టర్, బ్లాక్టెయిల్డ్ గాడ్విట్, రెవర్టెర్న్, టైలర్స్లీఫ్ వార్బ్లర్, హైదరాబాద్ ట్రీట్రంక్ స్పైడర్, పోచార్డ్ ఇండియా హూపో, కింగ్‌ఫిషర్, పారాకీట్స్, అనేక రకాల కప్పలు, మిల్లెపెడెస్, సెంటిపెడెస్, స్కార్పియన్, సీతాకోకచిలుకలు మొదలైన వాటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
5. వాల్టా చట్టం, 2002 ప్రకారం అనుమతులు, రుసుములు (చెట్టుకు రూ.50-100), లేదా తిరిగి నాటడం (నరికి వేయబడిన చెట్లను రెట్టింపు) చేపట్టలేదు. అదనంగా, వాల్టా నిబంధనల ప్రకారం, చెట్ల సంరక్షణ కమిటీ నుంచి ఎటువంటి సమ్మతిని కోరలేదు.
6. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 (పర్యావరణాన్ని రక్షించడం రాష్ట్ర విధి), 51A(g) (ప్రకృతిని కాపాడటం పౌరుడి విధి)లను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించింది.
7. వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో కూల్చివేతలు నిర్వహించే (హైడ్రా) పద్ధతిని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీవ్రంగా వ్యతిరేకించింది. తగిన నోటీసులు లేకుండా చట్టపరమైన సహాయం పరిమితంగా ఉన్న సమయాల్లో అమలు చేసిన ఇటువంటి చర్యలు పౌరులలో భయాన్ని కలిగిస్తాయని, తగిన ప్రక్రియను ఉల్లంఘిస్తాయని కోర్టు నొక్కిచెప్పింది. కంచ గచ్చిబౌలి అటవీ భూములలోని చెట్లను నరికివేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు రోజులనే ఉపయోగించింది.
అనుమతి లేకుండా ఐదు టేకు చెట్లను నరికివేసినందుకు 2016లో ఐఏఎస్ అధికారి ఛవిరంజన్ జైలుశిక్ష అనుభవించారు. అటవీ, అవినీతి చట్టాల కింద ఇక్కడ జవాబుదారీతనం లేదని మీ దృష్టికి తీసుకువస్తున్నాం.