ఈ ప్రాంత నాటి ముఖ్యమంత్రి కూడా మాటమార్చడంతో తెలంగాణ అంతటా నిరసనలు మొదలయ్యాయి. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో మొత్తం 105 మంది ప్రతినిధులు ఉండగా, వారిలో 73 మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఫజల్ అలీ కమిషన్ నివేదికను ఆమోదించారు. ఆ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని కోరుతూ మర్రి చెన్నారెడ్డి తీర్మానం చేయగా, విశాలాంధ్ర కావాలని వి.వి.రాజు తీర్మానం ప్రవేశపెట్టారు.
ప్రత్యేక తెలంగాణ కోసం జె.వి.నర్సింగరావు వాదించారు. ‘అత్యధిక తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కమిటీల్లో 90 శాతం, ముస్లింలు, కార్మికులు, వెనుకబడిన వర్గాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నాయి. కమిషన్ నివేదిక శాస్త్రీయంగా ఉంది. మన ముఖ్యమంత్రి చేసిన విలీన ప్రకటన ప్రజలను పెడదోవ పట్టించేదిగా ఉంది. మన రాష్ర్టానికి ఖర్చులు పోను రూ.1.8 కోట్ల మిగులు నిధులుంటాయి. ఎందుకు మనకీ విలీనం?’ అంటూ ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. అప్పటి వ్యవసాయ మంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా చాలా శాస్త్రీయంగా మాట్లాడారు. తెలుగు రాష్ర్టాలు రెండుగా, విడిగానే ఉండాలని, తెలంగాణ ప్రజలందరి కోరిక కూడా ప్రత్యేక రాష్ట్రమేనని, చిన్న రాష్ర్టాల్లోనే పరిపాలన కట్టుదిట్టంగా జరుగుతుందని ఆయన గట్టిగా వాదించారు.
ముఖ్యమంత్రి తీరుకు వ్యతిరేకంగా వరంగల్‌లో మొట్టమొదటి హర్తాళ్ జరిగింది. ‘విశాలాంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు’ అనే నినాదంతో విద్యార్థులు ఊరేగింపు తీశారు. (ఆంధ్ర పత్రిక, 2-11-1955). టీబీ హాస్పిటల్ ప్రారంభోత్సవం కోసం వరంగల్ వెళ్లిన నాటి ముఖ్యమంత్రికి ప్రజల నుంచి ఘాటు నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. ‘మీ కోరిక కేంద్రప్రభుత్వానికి చెప్తా’ అని తప్పించుకున్నాడాయన. (ఆంధ్ర పత్రిక, 3-11-1955). హైదరాబాద్‌లో 300 మంది నల్లజెండాలతో ఊరేగింపు జరిపారు. ఆయన కారు మీద రాళ్లు రువ్వి సభావేదికను కూలగొట్టగా, పోలీసులు లాఠీచార్జి జరిపారు. (గోలకొండ పత్రిక, 6-11-1955). తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని సికింద్రాబాద్ వర్తకులు తీర్మానం పంపారు. (గోలకొండ పత్రిక, 8-11-1955). విశాలాంధ్రకు నిజాం అనుకూలంగా ఉన్నారని ఆంధ్ర పత్రిక, ఆంధ్ర నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రాజ్‌భవన్ ఖండించింది. ఇటువంటి అవకాశం లేనే లేదు. (గోలకొండ పత్రిక, 8-11-1955). కరీంనగర్ కాంగ్రెస్ కార్యవర్గం ‘విశాలాంధ్ర’ నినాదాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నదే ప్రజల కోరిక (గోలకొండ పత్రిక, 8-11-1955). విశాలాంధ్ర తీర్మానం తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకమని, యావత్ తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్నే కోరుతోందని తెలంగాణ విద్యార్థి ఫ్రంట్ కార్యాచరణ సమితి ప్రకటించింది. (గోలకొండ పత్రిక, 10-11-1955). హైదరాబాద్ కార్పొరేషన్‌లోని 82 మంది సభ్యులు ప్రత్యేక తెలంగాణ కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. (గోలకొండ పత్రిక, 10-11-1955). పెరికె, విశ్వకర్మ, వర్తక, గుమస్తా, ము న్నూరుకాపు, గౌడ, వెనుకబడిన తరగతులు మొదలైన సంఘాలు ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని కోరుతూ నెహ్రూకు టెలిగ్రామ్‌లు పంపాయి. అన్ని పట్టణాల్లో విద్యార్థులు, స్థానిక వ్యాపారులు, కార్మికులు, బార్ అసోసియేషన్ సభ్యులు- ఎవరికి తోచిన రీతిలో వారు ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించారు, విలీనాన్ని నిరసించారు.
‘జాతీయ కార్యవర్గం కమిషన్ సూచన ప్రకా రం 1961 దాకా ఆగని పక్షంలో హైదరాబాద్-తెలంగాణ మెజారిటీ ఎమ్మెల్యేలు కోరినట్టు రెండు రాష్ర్టాలుగా ఏర్పరచాలి. తెలంగాణ ప్రజలు, మెజారిటీ రాజకీయ నాయకులు విశాలాంధ్రకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. 90 శాతం ప్రజలు ప్రత్యేక రాష్ర్టాన్నే కోరుతున్నారు. కాబట్టి, దీనికి విరుద్ధంగా భారత ప్రభుత్వం గాని, కాంగ్రెస్ హైకమాండ్ గాని పోవడం వాంఛనీయం కాదు. ఎం దుకంటే, విశాలాంధ్ర వాదుల పిచ్చివాగుడు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉద్రేకాలు పెరిగిపోయాయి. ఇప్పుడు విలీనమైతే ఈ వైరుధ్యం పెరిగి శాశ్వతం గా నిలిచిపోగలదు’ – గోలకొండ, (11-11-1955). ప్రత్యేక తెలంగాణ కోసం సికింద్రాబాద్ న్యాయవాదులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్, హన్మకొండ విద్యార్థులంతా పెద్ద పెద్ద ఊరేగింపులు తీశారు. తర్వాత సమావేశాలు జరిపారు. (గోలకొండ పత్రిక, 12-11-1955).
‘నేను విశాలాంధ్ర నిర్మాణాన్ని విశ్వసించేవాడినైనా, కమిషన్ నివేదికలో గౌరవనీయ సభ్యులు సూచించినట్టుగా అవసరమైన సరిహద్దుల మార్పులతో సిఫారసులను అనుసరించడం మంచిది’ అని పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు అన్నారు. ‘హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీలో 78 శాతం సభ్యులు తెలంగాణ కోరుతున్నారు. కాబట్టి, వెంటనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలి’ అని హైదరాబాద్ పీసీసీ అధ్యక్షుడు జె.వి.నర్సింగరావు పేర్కొన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జె.వి.నర్సింగరావు, కె.వి.రంగారెడ్డి హైకమాండ్‌కు స్పష్టం చేశారు. (గోలకొండ పత్రిక, 12-11-1955). విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. (ఆంధ్ర పత్రిక, 10-11-1955). కమి టీ సమావేశంలో తెలంగాణ తరఫున జేవీ నర్సింగరావు, కె.వి.రంగారెడ్డి ఎంతగానో వాదించారు. కానీ, బూర్గుల రామకృష్ణారావు విశాలాంధ్ర వైపు మొగ్గుచూపడంతో విశాలాంధ్ర ఏర్పాటుకు 1955 నవంబర్ 10న కమిటీ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రాంతమంతా నిరసనల హోరుతో నిండిపోయింది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఎవరికీ నష్టం కలిగించదని, ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఉంది కాబట్టి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటేనే రెండు ప్రాంతాల ప్రజల మధ్య స్నేహభావం ఉంటుందని 1956 ఫిబ్రవరిలో బూర్గుల ఉపయోగం లేని ప్రకటన చేశాడు. దొంగ లు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుంది ఇది. ‘తల్లికి అన్నం పెట్టనివాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు.. తెలంగాణ ప్రజలకు ఏ లోటూ రానివ్వబోమని ఆంధ్ర రాజకీయ నాయకులు తెగ పొంకణాలు కొట్టారు.
మచ్చుకొక్కటి.. ‘విశాలాంధ్రలో తెలంగాణకు ఏవో కష్టనష్టాలు సంభవిస్తాయని అనుమానాలు, భయాలు పెట్టుకోవద్దు. తెలంగాణ ప్రజల అభివృద్ధి విషయంలో ఏ విధమైన అశ్రద్ధ ఉండదు.’ – ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ. ఆంధ్ర రాజకీయ నాయకులు ఇంకా ఎంతో మాట్లాడారు. ఎన్నో ప్రమాణాలు చేశారు. అయితే, తెలంగాణవారు రెండు విషయాల్లో అవగాహన లేక బోల్తాపడ్డారు. 1. తుఫాన్‌లాగా వచ్చి మీదపడిన విశాలాంధ్రలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల సభ్యుల సంఖ్య (140) తమ తెలంగాణ సభ్యుల (105) కంటే ఎక్కువ ఉంటుందని, శాసనసభలో తమ మాట చెల్లదని తెలంగాణవారు గ్రహించలేదు. 2. ఇష్టం లేకనో, చేతకాకనో తమ ప్రాంతాన్ని మూడేండ్లలో ఏమీ అభివృద్ధి చేసుకోలేని శుంఠలు తెలంగాణకి ఏం చేస్తారని ఆ భారాన్ని మీదేసుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు.
తెలంగాణ నిజమైన దురదృష్టం ఏమిటంటే.. ఆ సమయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ క్రియాశీల రాజకీయాల్లో లేకపోవడం. 1951 సెప్టెంబర్‌లో ఆయన నెహ్రూ మంత్రివర్గం నుంచి తప్పుకొన్నారు. మహామేధావి అయిన వారు గనుక ఆ ప్రక్రియలో పాల్గొని ఉంటే తెలంగాణకు ఇంతటి నష్టం జరిగేది కాదు. అయితే, వారి అభిప్రాయాలు కొన్నింటిని చాలా స్పష్టంగా వెల్లడించారు. 1. భాషా ప్రాతిపదికన రాష్ర్టాలను విభజించడం దేశానికే ప్రమాదకరం. పైగా దీనివల్ల ప్రజల్లో భాషా దురభిమానం ప్రబలుతుంది. 2. ఒక రాష్ట్రంలో పలు భాషలవారు ఉండవచ్చు. ఒకే భాషవారు పలు రాష్ర్టాలుగా ఉండవచ్చు. అంతేతప్ప ఒక రాష్ర్టానికి ఒకే భాష గాని, ఒకే భాష మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం గాని ఉండకూడదు. 3. దేశంలో అతిపెద్ద, అతి చిన్న రాష్ర్టాలు ఉండకూడదు. కొన్ని అంశాల ఆధారంగా వాటిని సమంగా విభజించాలి. అలా కాని పక్షంలో పెద్ద రాష్ర్టాలు చిన్న రాష్ర్టాల మీద పెత్తనం చెలాయించే ప్రమాదముంది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ర్టాలు రెండు, లేక మూడు రాష్ర్టాలుగా ఉంటే పరిపాలన సులభమవుతుంది. ఇవి కొన్నిమాత్రమే ఇంకా చాలా ఉన్నాయి. అయితే, రెండు ప్రాంతాల విలీనంలో ఈ ప్రధానమైన అంశాలను లెక్క చేయలేదు నెహ్రూ! బాబా సాహెబ్ చెప్పిన ఏ అంశాన్ని తీసుకున్నా తెలంగాణను ఆంధ్రలో కలపడం దుర్గార్మం. ఒక స్వయంప్రతిపత్తి గల సస్యశ్యామల ప్రాంతాన్ని.. ఆర్థికంగా చతికిలబడి, రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న తెలివి, పట్టుదల లేని నాయకుల స్వార్థపూరిత రాజకీయాలకు, ధన దాహానికి బలిచేస్తూ విలీన ప్రకటన చేశాడు నెహ్రూ.