కాలం మారుతున్నది. అంతకన్నా వేగంగా రాజకీయం మారుతున్నది. అయితే మార్పు అనేది గతం కన్నా మరింత మెరుగైనదిగా ఉండాలె. కానీ, దురదృష్టవశాత్తు ఇప్పుడొస్తున్న మార్పు తిరోగమనం వైపు వేగంగా పరుగెడుతున్నది. తప్పును ఒప్పు చేస్తున్నది. ఒప్పును తప్పు చేస్తున్నది. పని చేసినవాళ్లు పక్కకుపోతున్నారు. పనికిమాలిన వాళ్లు పనివంతులవుతున్నారు. ప్రచారం చేసుకునేవాళ్లు హీరోలు అయిపోతున్నారు. అవును.. ఇప్పుడు నడుస్తున్న నయా ట్రెండ్ అదే. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఇదే సూపర్, డూపర్ హిట్ ఫార్ములా. పాపం.. ఈ ఫార్ములా కేసీఆర్‌కు పెద్దగా తెలియదు.
ఇప్పుడంతా పీఆర్ స్టంట్లదే హవా. అది సాధారణ వ్యక్తి అయినా సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే. ఎంత పీఆర్ స్టంట్స్ చేస్తే అంత ఫాలోయింగ్. జస్ట్ సీఎం కాన్వాయ్ వెళ్తుంటే మధ్యలో ఆపి ఓ ఇద్దరితో మాట్లాడాలె. వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చెయ్యాలె. ప్రజల నుంచి ఓ రెండు అప్లికేషన్లు తీసుకోవాలె. గంతే. దీన్నే ప్రజా పరిపాలన అని డప్పు కొట్టుకోవాలె. కాన్వాయ్‌లో వెహికల్ తగ్గించిన అని చెప్పాలె. దుబారా చేయను అనాలే. కొంతమంది మేధావులతో ప్రజలకు సీఎం అందుబాటులో ఉంటే చాలు, మొత్తం సమస్యలన్నీ అబ్రకదబ్రా అన్నట్టు మాయమైపోతాయని ప్రచారం చేయించాలె. ఇవన్నీ చేస్తే చాలు దేశం గర్వించదగిన సీఎం అయిపోవచ్చు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇవన్నీ తెలువవు. అందుకే సీఎం అంటే పబ్లిసిటీ కాదు. ప్రజల జీవితాలను మార్చటమని భావించారు. ఆ దిశగానే నిరంతరం కృషిచేశారు. ఈ క్రమంలో పీఆర్ స్టంట్స్ అనే కొత్త ట్రెండ్ వచ్చిందని గుర్తించలేకపోయారు. సీఎం పదవిని తెలంగాణ రూపురేఖలు మార్చేందుకు వాడాలని కంకణం కట్టుకున్నారు. గతంలో ఏ సీఎం కూడా చేయలేని, అసాధ్యమనుకున్న పనులను చేసి చూపించారు. అట్ల చేశారు కాబట్టే నల్గొండలో ఫ్లోరోసిస్ బాధ తప్పింది. 24 గంటల కరెంట్, రైతులకు ఉచిత కరెంట్.. ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కలేనన్ని పనులు. ఏవి చేసినా ఇవి గతంలో చాలామందికి సాధ్యం కాని పనులే. అందుకే తెలంగాణ దేశానికి రోల్ మోడలైంది.
కానీ, కేసీఆర్ మీద ఫేక్ ప్రచారాల దండయాత్ర సాగింది. ఎందుకంటే రూ.2లకే కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీఆర్ తెలుగువాళ్లంతా గర్వించే నాయకుడయ్యారు. 108 తెచ్చిన వైఎస్ మహానేత అయ్యారు. మరి వీరికంటే పది రెట్లు ఎక్కువ పనులు చేసిన కేసీఆర్‌ను ఎక్కడ నిలబెట్టాలి? ఇటీవల కామారెడ్డి ఎమ్మెల్యే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడుతూ అప్పుడెప్పుడో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తన వద్దకు వచ్చిన ఓ రైతు కూతురి పెండ్లి కోసం లక్ష రూపాయలు ఇచ్చాడని గొప్పగా చెప్పారు. ఒక్క రైతు కూతురు పెండ్లికి లక్ష సాయం చేస్తే అంత గొప్ప అయితే లక్షలాది మంది పేద తల్లిదండ్రుల ఆడబిడ్డల పెండ్లిళ్లకు లక్షలాది రూపాయలను కల్యాణలక్ష్మి పేరుతో ఇచ్చిన కేసీఆర్ ఇంకెంత గొప్ప నేత. రూ.లక్ష పలికే భూమి రూ.20 లక్షలు అయ్యేలా చేసిన కేసీఆర్‌ను ఏ నేతతో పోల్చుదాం. ఒక్కటా, రెండా ఏ పని చేసినా మొత్తం రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేయటమే కేసీఆర్ చేసిన తప్పా?
నిజంగా కేసీఆర్ చేసిన పనుల్లో 50 శాతమైనా ఎన్టీఆర్, వైఎస్ చేసి ఉంటే ఎంత గొప్ప నేతలుగా ప్రచారం చేసుకునేవారో ఒక్కసారి ఊహించుకోండి. మరెందుకు కేసీఆర్‌కు ఆ స్థాయి ప్రచారం రాలేదు. పైగా తన చిత్తశుద్ధిని, సంకల్పాన్ని ప్రశ్నించేలా దాడి ఎందుకు? అంటే మీడియాలో ఓ వర్గమంతా కేసీఆర్ అంటే ద్వేషాన్ని పెంచుకున్నది. దీనికితోడు కొంతమంది కేసీఆర్ వ్యతిరేకులు వారికి తోడయ్యారు. వీళ్లంతా తాము చెప్పినట్టు కాకుండా కేసీఆర్ తన సొంత విజన్‌తో పనిచేస్తుండటాన్ని తట్టుకోలేపోయారు. అందుకే కోడిగుడ్డు మీద ఈకలు పీకటం షురూ చేశారు. చేసిన గొప్ప పనులపైనే దుష్ప్రచారం షురూ చేశారు.
కేసీఆర్ పీఆర్ స్టంట్స్ అంటేనే దూరముండేవారు. ప్రజలు అభివృద్ధిని, పనిచేసే నాయకులనే నమ్ముతారు గానీ, ఈ స్టంట్లను కాదనేవారు. కానీ, మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలలో పీఆర్ స్టంట్స్ చాలా ప్రభావం చూపుతాయన్న విషయం తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో పీఆర్ స్టంట్స్పైనే ఎక్కువ ఆధారపడుతున్నది. ఈ లెక్కన కేసీఆర్ చేసిన పనులకు ఇప్పుడు కొందరు చేస్తున్న పీఆర్ స్టంట్స్‌ను నాడు యాడ్ చేసి ఉంటే నిస్సందేహంగా కేసీఆర్ ఓ దేవుడయ్యేవారు.
-రచ్చ దినేష్
89787 40475