గట్లుంటది..
‘నడిరేయి ఏ ఝాములో అని రాశానేంటండి. నడిరేయి అంటేనే ఓ ఝాము అని కదా. మీరూ పట్టుకోలేదు. పాట రికార్డింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడెలా..?’ అన్నారు దాశరథి కృష్ణమాచారి గారు మాటల రచయిత డీవీ నరసరాజు గారితో.
‘రంగులరాట్నం’ సినిమా కోసం దాశరథి గారు రాసిన భక్తి పాట అది. పాట రాశాక నిర్మాత బీఎన్ రెడ్డిగారికి వినిపిస్తే ఆయన ఆనందానికి అవధి లేకుండా పోయిందట. ‘కవి గారు.. ఈ పాట తెలుగు చిత్రసీమలోనే కాదు, తెలుగు భక్తి గీతాల్లోనే అత్యుత్తమంగా మిగిలిపోతుంది. అద్భుతం’ అని ఆనందపడ్డారట రెడ్డి గారు. తీరా పాట రికార్డ్ అయిపోయి ఆ రికార్డింగ్ రూంలో నుంచి బయటకు వస్తూండగా దాశరథి గారికి ఈ అనుమానం వచ్చి కాసింత కంగారు పడుతూ నరసరాజు గారి దగ్గర ఇదిగో ఇలా వాపోయారట. ఆ రచయితా గమనించలేదు. అందరూ పాట బాగా రాశారు. అత్యద్భుతమైన సంగీతం, ఘంటశాల మాస్టారు, జానకమ్మ మా చక్కగా పాడారు అనే ఆనందంలోనే ఉన్నారు కానీ, ఈ పొరపాటు గ్రహించలేదు.
దాశరథి గారి భయానుమానాలకు నరసరాజుగారు సమాధానం చెప్తూ ‘కవి గారూ.. భక్తి పారవశ్యంలో లాజిక్కులుండవండి. కంగారు పడకండి. ఇదో సూపర్ సాంగ్గా నిలుస్తుంది’ అన్నారట. అలాగే నిలిచింది కూడా. ఈ పాట రాయించడానికి ముందు ‘దాశరథి గారు ఎందుకూ, ఆయన విప్లవ కవి కదా’ అని సందేహించారట నిర్మాత, దర్శకుడు కూడా అయిన బీఎన్ రెడ్డి. అయితే, మళ్లీ దాశరథి గారే తగిన వారని అనిపించి ‘సినిమాలో భక్తి పాట మీరే రాయాలి. ఈ ఉద్యమాలు, విప్లవాలు రాకుండా చూసుకోండి. ఆ స్వామిని ఇద్దరు అభాగ్యులు ఆదుకోమంటూ పాడే పాట’ అనీ సీన్ కూడా చెప్పారట దాశరథి గారికి. దాశరథి కృష్ణమాచారి గారు ఓ నవ్వు నవ్వేసి పాట రాసేశారు.
ఈ నడిరేయి ఏ ఝాము పాటలో తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆ అభాగ్యుల నోట పాట మధ్యలో ‘కలవారినే గాని కరుణించలేడా.. నిరుపేద మొరలేవి వినిపించుకోడా’ అని పలికించారు దాశరథి. ఈ లైను విన్న బీఎన్ రెడ్డి ‘కవి గారు మీరు మామూలు వారు కాదండి’ అంటూ ఆనందంగా కౌగలించుకున్నారట కూడా. ఇలాగే భక్తిలో కూడా తన మార్గాన్ని వదలని కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి విప్లవ గీతాలతో పాటు భక్తి పాటలు కూడా అలవోకగా రాశారు. దీనికి కారణం ఏం లేదు. ఆయన ఇంట్లో భక్తి వాతావరణం ఉండటమే అని ఆయన తమ్ముడు దాశరథి రంగాచారి గారు రాశారు ఆయన జీవనయానం ఆత్మకథలో. నిజానికి ఆస్తికుల కంటే నాస్తికులే భక్తి పాటలు మరింత భక్తితో రాస్తారని ఆరుద్ర ఓ సారి నాతో అన్నారు. ఆరుద్ర కూడా డ్యూయట్ల కంటే భక్తి పాటలే బాగా రాశారనే వారూ ఉన్నారు. దాశరథి గారు రాసిన ‘ఆ చల్లని సముద్ర గర్భం… దాచిన బడ బానలమెంతో…’ పాటలో ఎంత ఆర్తి, ఆవేశం, ఆగ్రహం ఉంటా యో భక్తి పాటల్లో కూడా అంతే స్థాయిలో ఆధ్యాత్మికత ఉంటుంది.
సినీ పరిశ్రమలో కవులు, రచయితలకు ప్రయోగాలు చేసే అవకాశం ఉండదు. అది కళాత్మక వ్యాపారం. కానీ, తన పాటల్లో ప్రయోగం చేసిన అతి తక్కువ మంది కవుల్లో అగ్రగణ్యుడు దాశరథి గారే. కవిత్వంలో అద్భుత ప్రయోగంగా మిగిలిన ముక్తపదగ్రస్తాన్ని చాలా స్వేచ్ఛగా వాడింది దాశరథి కృష్ణమాచారి గారే. అది కూడా ఓ పల్లెటూరి అమాయకురాలైన అమ్మాయి పాడే పాట ‘గోదారి గట్టుంది/ గట్టుమీన చెట్టుంది/ చెట్టు కొమ్మన పిట్టుంది’ అంటూ చివరి మాటను రెండో పదానికి తొలి మాటగా ప్రయోగించే ఈ ముక్త పద గ్రస్తం ప్రయోగాన్ని సినీ మాధ్యమం కోసం వాడిన ధీశాలి కవి దాశరథి గారే.
సినిమా ప్రవేశానికి ముందు తెలంగాణ సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న దాశరథి కృష్ణమాచారి గారిని నిజాం ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు ఖిల్లాలో ఉన్న పురాతన జైలులో ఖైదు చేసింది. ఆ జైలు గోడల మీద రాసుకున్న కవిత్వం ఎన్ని దశాబ్దాలు గడిచినా నూతనత్వంతో ఉండటమే దాశరథి గొప్పతనం. నిజాం పాలనకు వ్యతిరేకంగా దాశరథి రాసిన కవిత్వం ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలకు దారి చూపింది.
‘కోటి తెలుగుల బంగారు కొండ క్రింద
పరచుకొన్నటి సరసులోపల వసించి
ప్రొద్దు ప్రొద్దున్న అందాల పూలు పూయు
నా తెలంగాణ తల్లి… కంజాత వల్లి’
అన్నారు దాశరథి. తెలంగాణలో ఆనాటి పోరాటాన్నే కాదు, ప్రకృతిని ఇలా వర్ణిస్తూ ‘తెలంగాణ తల్లి.. తామర పూల వంటిది’ అన్నారు. ఈ తామర పూలు దాశరథి కృష్ణమాచారిని, ఆయన తమ్ముడు రంగాచారిని కూడా వదలలేదు. ఈ అన్నదమ్ములు పుట్టిన చిన గూడూరు ఊరు చివర చెరువులో ఉన్న తామరపూలను రంగాచారి తన జీవనయానం ఆత్మకథలో చాలా అద్భుతంగా వర్ణించారు. ఆ తామరపూలు ఈ ఇద్దరన్నదమ్ముల రచనల్లోనూ స్థానం కల్పించుకున్నాయంటే ఆ చెరువు, అందులోని తామరపూలు వారిద్దరి జీవితాలను ఎంత ప్రభావితం చేశాయో అనిపిస్తుంది.
తెలంగాణ కోటి రతనాల వీణలో ఓ రత్నంలా వొదిగి, తెలంగాణ సమాజం తలెత్తుకునేలా చేసిన కవి దాశరథి.
– ముక్కామల చక్రధర్ 99120 19929