ప్రణబ్ జీ నా ఆకాంక్ష ఏమిటో మీకు తెలుసు. నాకు కావలసింది తెలంగాణ రాష్ట్రం. మీరు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనేది నాకు ప్రధానం కాదు. ఏదిచ్చినా సంతోషంగా స్వీకరిస్తా. కానీ దయయుంచి తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వండి’ – ఇది కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీతో కేసీఆర్ అన్న మాటలు. మంత్రిత్వ శాఖల కోసం కుమ్ములాడుకునే నాయకులున్న కాలంలో, ప్రజల ఆకాంక్ష పట్ల కేసీఆర్కున్న నిబద్ధతకు నిదర్శనం నాటి ఈ వ్యాఖ్య. తెలంగాణ ఆకాంక్షను సాకారం చేయడమే కాకుండా, పరిపాలకుడిగా రాష్ర్టాన్ని పురోభివృద్ధి బాటలో నడిపించి చూపిన విజయుడు కేసీఆర్ జన్మదినం నేడు. ‘తెలంగాణ మాడల్’ను ఆవిష్కరించడంతోనే విశ్రమించలేదాయన. దేశ పరిస్థితి పట్ల కలత చెంది ఏడు పదుల వయసులో జాతీయ రాజకీయాలను పరిశుద్ధం చేయ తలపెట్టారు. మహానాయకులు ఎప్పుడూ నాయకత్వం కోసం అర్రులు చాచరు. ప్రజల కష్టాలు తీర్చే క్రమంలో సాగించే పరిశ్రమ వారిని మహానుభావులుగా నిలబెడుతుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో, ఏ పదవిలో ఉన్నా ప్రజల సమస్యలకు మూల కారణాలు అన్వేషించి పరిష్కరించడం కేసీఆర్ సహజాతం. సిద్దిపేట ఎమ్మెల్యేగా ప్రజలకు ఇంటింటికీ నల్లా నీరు కల్పించడం ఇందుకు ఉదాహరణ. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను తెలంగాణ ఏర్పడిన అనతికాలంలో పరిష్కరించడం దేశ చరిత్రలోనే ఒక మహాద్భుతం. మంచినీరు, సాగునీరు, నిరంతర విద్యుత్తు మొదలుకొని పౌర వసతులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి అంటే ఇదీ అని దేశ ప్రజలకు చూపించారు. ప్రగతి ప్రణాళికలను పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామాభ్యుదయానికి పాటుపడ్డారు. పారిశ్రామికీకరణకు పెద్ద పీట వేస్తూనే, ప్రపంచీకరణ విధానాలకు భిన్నంగా సంక్షేమ రంగానికి ప్రాధాన్యమిచ్చారు. అందుకే ఇవాళ ప్రతి కుటుంబం భవిష్యత్తుపై గుబులు లేకుండా, మాకు కేసీఆర్ అండగా ఉంటారనే భరోసాతో కంటినిండా నిద్ర పోతున్నది.
75 ఏండ్లు గడిచినా దేశ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉండటమనే ఆవేదనతో పాటు, మోదీ పాలనలో ప్రజాస్వామ్యం పతనమవుతున్న తీరు కేసీఆర్ను మళ్ళీ జాతీయ రాజకీయాల వైపు నడిపించాయి. తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకున్నప్పుడు అవహేళన చేసిన వాళ్ళున్నట్టే, నేడు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును చులకన చేసే వాళ్ళు ఉండటంలో ఆశ్చర్యం లేదు. కేసీఆర్పై ఎవరి అంచనాలు వారికి ఉండవచ్చు. కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, పట్టుపట్టి సాధించడం ఆయనకు కొత్త కాదు. సత్సంకల్పం, కార్యసాధనతో దేశంలోని అగ్రశ్రేణి ఉత్తమ నాయకుడిగా ఇప్పటికే రుజువు చేసుకున్నారు. కేసీఆర్కు తన విధానాలే పదునైన అస్ర్తాలు. ప్రజల ఆత్మీయాభిమానాలే కేసీఆర్ కార్యాచరణకు ఇంధనం. ఆయన జన్మ దినోత్సవం సందర్భంగా సంబుర వాతావరణం నెలకొనడమే ఇందుకు నిదర్శనం.