ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం’ అనే అంశంపై ప్రముఖ సినీ నటులు ప్రకాశ్‌రాజ్ చేసిన ప్రసంగం పాఠం.
ఇంతమంది నిబద్ధత ఉన్న మహానుభావులు, మేధావులు కూర్చున్న ఈ సభలో ఏం మాట్లాడాలో నాకర్థం కావడం లేదు. నేనెక్కడికి వెళ్లినా కొందరికి ఇబ్బందిగా ఉంటుంది కదా? అందుకే, జయశంకర్ గారికి, ప్రకాశ్‌రాజ్‌కు ఏంటి సంబంధం? ఆయనను ఎందుకు పిలుస్తున్నారన్నారంట? అనేది వారి ప్రశ్న. అలా అడిగినవాళ్లకు జయశంకర్ గారు అర్థం కాలేదు, నేను కూడా అర్థం కాను. మా ఇద్దరిదీ భావజాల బంధమే. అంతే తప్ప ఇంకేముంటుంది? ఈ రోజు కొందరు వక్తలు.. జయశంకర్ సార్ ఉండి ఉంటే స్వరాష్ట్రంగా తెలంగాణను చూడగలిగేవారు అన్నారు. ఈ మాటలు వింటుంటే నాకు తమిళ్లో పుదుమైపిత్తన్ అనే ఒక కవి మాటలు గుర్తొచ్చాయి. ఒక గుడి ముందు వెలుగుతున్న దీపానికి జనాలు నమస్కరిస్తుంటే పుదుమైపిత్తన్ ఒక అగ్గిపుల్లకు నమస్కారం చేశాడంట. ఎందుకనడిగితే.. వెలిగే జ్యోతికన్నా, వెలిగించిన అగ్గిపుల్ల పెద్దది కదా అన్నాడంట. అంటే, ఈ రోజు వెలుగుతున్న తెలంగాణ జ్యోతి ఏదైతే ఉందో.. దానికి అగ్గిపుల్ల జయశంకర్ సార్. ఈ రోజు ఆయన జయంతి రోజు మనమిక్కడ కలిశాం, ఆయన గురించి మాట్లాడుతున్నాం, ఆయన స్మరణ చేస్తున్నామంటే ఆయన తెలంగాణకు కారణమైన అగ్గిపుల్లే.
ఈ వేదిక నుంచి నేను జయశంకర్ సార్ గురించి మాట్లాడుదామంటే.. ఆయనతో గడిపినవాళ్లు, కలిసి ప్రయాణం చేసినవాళ్లు అంతా మాట్లాడేశారు. ఇంకేదైనా కొత్తగా చెప్పాలంటే గూగుల్ సెర్చ్ చేయాలి. ఆ సంగతి అలా వదిలేస్తే నాకొక సబ్జెక్ట్ ఇచ్చారు మాట్లాడమని. భయమేసింది ఆ సబ్జెక్ట్ చూసినపుడు. అదేమంటే… ‘వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం’. ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చాను సర్. తెలుగులో ఇట్లాంటి టైటిల్ ఇస్తే ఏంజేయాలి నేను? నాకేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్‌లా వినపడిందది. కానీ ఆలోచిస్తే లేటెస్ట్ న్యూస్ కాదిది. వైషమ్యాల సుడిలో భారతం.. వైవిధ్యత.. అనేది లేటెస్ట్ న్యూస్ కాదు. చాలా పాత న్యూస్. మనం పేపర్ తీస్తే చూస్తాం కదా? వరద వచ్చి హైదరాబాద్ చెరువులా అయిపోయింది. లేటెస్ట్ న్యూసే, కానీ పాత న్యూసే. రెండేండ్ల కింద కూడా ఇలాగే ఉంది. ఎవ్వరో ఒక రైతు తన పిల్లల్ని , భార్యను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కాదిది. ఎవరో ఇద్దరు వేరే కులపోల్లు, ఆ జాతి, ఈ జాతి లేదు.
ప్రేమించుకున్నారు, పెండ్లి చేసుకున్నారు. ఊరోళ్లందరూ వెళ్లి వాళ్లను చంపేశారు. బ్రేకింగ్ న్యూస్ అంటారు. బ్రేకింగ్ న్యూస్ కాదది. రెండు సంవత్సరాల ముందు విన్నాం. పది సంవత్సరాల ముందు విన్నాం. మా నాన్న విన్నాడు, మా తాత విన్నాడు. ఆ దృశ్యాలు అప్పుడు కూడా చూశారు. ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదా? అది అప్పుడు కూడా చూశారు. అలాగే ఇది కూడా. వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం ఉంది కదా? అది బ్రిటిష్ వాళ్ల నుంచి, వాళ్ల ముందు నుంచి కూడా ఉంది. కానీ, ఇంకా మీరు ఇతిహాసం చూస్తే యావత్ ప్రపంచంలో, మానవ వికాసంలో ఈ వైవిధ్యాన్ని ఎప్పుడూ… ఎవరో ఒకరు దానిని వైషమ్యాల సుడిలో పెడుతూనే ఉన్నారు. ఎందుకు మనిషి తరతరాలుగా ఎందుకు, ఇంత అద్భుతమైన ఒక కాన్సెప్ట్‌ను వైషమ్యంలో పెడుతున్నాడని ఆలోచిస్తే.. అసలు డైవర్సిటీ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. వైవిధ్యత అంటే ఏంటి… ఇవాళ నన్ను పిలిపించింది కూడా అందుకే అనుకుంటా.. ఎందుకంటే.. బహుశా భారతదేశం కన్నా వైవిధ్యం ఏముంది? దాన్ని నాకన్న అనుభవించినవాళ్లెవరన్నా ఉన్నారా అంటే నాకు కనపడలేదు.
ఎక్కడో ఒక సముద్రతీర ప్రాంతం మంగళూరు నుంచి వచ్చిన నాన్న.., ఇంకెక్కడో ఎండిపోయిన గదగ్, బెట్టకేరి, బళ్లారి లాంటి ప్లేస్ నుంచి వచ్చిన అమ్మ బెంగళూరులో స్థిరపడితే, అక్కడ పుట్టిన నేను.. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇలా ఎన్నో నదులు, ఎన్నో భాషలు, ఎంతో సాహిత్యం.. ఎందరో స్నేహితులు.. ఈ దేశానికి ఉన్న ఈ వైవిధ్యం.. దిస్ డైవర్సిటీ… దీన్ని నాకన్న అనుభవించినవాడు ఇంకొకడు లేడేమో.
ఈ వైవిధ్యత ఉంది కదా? ఇది, ఇక్కడున్న అందరికీతెలుసు. బట్ యంగ్‌స్టర్స్‌కి మనం ఇలాంటి ఒక విషయం గురించి ఎలా వివరించాలి అనే కోణంలో మాట్లాడుతున్నాను నేను. మనిషి జీవితాన్ని, మానవ వికాసాన్ని సుసంపన్నం చేసే ఇంధనమే వైవిధ్యత. డైవర్సిటీ ఈజ్ ఫ్యూయల్ విచ్ ఎన్రిచెస్.. హ్యుమన్ లైఫ్ అండ్ ఎవెల్యూషన్ ఆఫ్ మ్యాన్. సింపుల్‌గా మనం ప్రకృతి గురించి తెలుసుకుంటే తెలిసిపోద్ది వైవిధ్యత ఇంపార్టెన్స్ ఏందో.. ఒక అరణ్యం చూడండి. ఎందుకంటే మనం ఈ మధ్యలో ఆ సెన్సిటివిటీని మరిచిపోయాం. ఒక అరణ్యం చూస్తే ఒక మహా వృక్షం, తర్వాత ఒక చిన్న చెట్టు, ఇంకా చిన్న చెట్టు, పాకే చెట్టు, భూమి లోపల పెరిగే చెట్టు.. ఇన్నిరకాలు.. మనిషే లేడక్కడ. అయినా అంతా సుసంపన్నంగా ఉంటుంది. సూర్యుడి ప్రకాశాన్ని భరించగలిగే మహావృక్షం ఉంటే ఆ ప్రకాశాన్ని తక్కువ భరించేది దాని నీడలో ఉంటుంది. ఇంకా తక్కువ భరించేది దాని నీడలో ఉంటుంది. ఇవన్నీ కలిసే ఉంటాయి. ద హ్యూమన్స్.. జీవరాశులు.. దట్ ఈజ్ ద రిచ్‌నెస్ ఆఫ్ డైవర్సిటీ. సరే మనిషి ఎక్కడ అర్థం చేసుకోవడం లేదంటే.. మనిషికి ఇది ఎలా తోడునీడ అయ్యింది? ప్రకృతిని మనిషి సుసంపన్నం చేస్తున్నాడా? సింపుల్.. జస్ట్ గో బ్యాక్ టు హిస్టరీ అండ్ సీ..
మనకు సిల్క్ రూట్ ఉంది. ఆ రూట్‌పై వ్యాపారం చేసేవాళ్లం. యంగ్‌స్టర్స్ మన హిస్టరీ చదివితే.. ఒక పదిహైదు దేశాలు, ఖండాలతో వ్యాపారం. పర్వతశ్రేణులుండొచ్చు.. డెజర్ట్స్ ఉండొచ్చు.. సముద్రమార్గం కూడా ఉండొచ్చు.. ఆ జర్నీలో వేరే వేరే భాషలు.. వేరే వేరే మనుషులు.. వేరే వేరే వస్తువులు. ఈ జర్నీలో పొదిగిన ఈ వికాసం ఉంది కదా..
వుయ్ షేర్డ్ ద నాలెడ్జ్. వుయ్ షేర్డ్ ద ఫుడ్.. మన భాషను, సాహిత్యాన్ని, ధర్మాన్ని, వివేకాన్నీ పంచుకున్నాం. ఎందుకంటే మనిషికి బేసికల్లీ కొత్తదానికి అడాప్ట్ అయ్యే అద్భుతమైన శక్తి ఉంది. ఎదగడానికి అవకాశం ఉంది. వీళ్లు ఒకే భాష- ఒకే దేశం-ఒకే ధర్మం అంటారు కదా? వీళ్లకెలా అర్థమవ్వాలి. వీళ్లు పూజలో వాడే పట్టుచీర చైనా నుంచి వచ్చింది. మనవాళ్లు చైనాకు ప్రయాణం చేయకపోతే ఇంకా ఆకులు కట్టుకొని తిరిగేవాళ్లు వీరు. షుడెంట్ వుయ్ అండర్‌స్టాండ్.. దటీజ్ సో మచ్ టు లర్న్. ఎన్నో ధర్మాలు వచ్చాయి. ఆ ధర్మంలో ఉన్న గొప్పతనం మనం నేర్చుకోగలిగాం. మన ధర్మంలో ఉన్న దౌర్జన్యాన్ని మనం మార్చుకోగలిగాం. బికాజ్ ఆఫ్ ద ఎక్స్పోజర్. ఒక దిగంతాన్నే చూసుకుంటూ బతుకలేం మనం. ఆ దిగంతాన్ని చేరుకున్నాక తర్వాత ఇంకో దిగంతం వస్తుంది. ఎన్ని దిగంతాలు చూస్తామో అంత సుసంపన్నమవుతాం కదా మనం. మనందరం కలిసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని బతుకాలి కదా?
భోజనం చూడండి. బిర్యానీలో ఉన్న వైవిధ్యత ఎంత గొప్పది. ఎక్కడినుంచి వచ్చాయి మసాలాలు.. ఎక్కడినుంచి వచ్చింది ఉల్లిపాయ.. ఏ ప్రాంతం నుంచి తెచ్చాం రైస్. అవన్నీ కలిపి ఒక వంట చేస్తే ఆ ఘుమ ఘుమ ఊరిస్తుంది.. అక్కడ వైవిధ్యం కావాలి మనకు. భారతదేశంలో చేపల కూరనే చూడండి. అరేబీయన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషియన్.. మూడువైపులా సముద్రమున్న దేశం మనది. మనలోనే చేపలు ఎలా వం డుకుంటామని చూస్తే… గుజరాత్ టేస్ట్ వేరు. గోవా టేస్ట్ వేరు. మహారాష్ట్ర టేస్ట్ వేరు, మంగళూరు టేస్ట్ వేరు.. కేరళ టేస్ట్ వేరు, తమిళనాడు టేస్ట్ వేరు, ఆంధ్రా టేస్ట్ వేరే. వెస్ట్ బెంగాల్ టేస్ట్ వేరే. వీటిని చూసి సంబురపడుతూ బతుకుతు న్నాం కదా? ఈ అద్భుతమైన, సంభ్రమ వికాసాన్ని, సుసంపన్నతను ఎందుకు కట్టి పడేస్తున్నారంటే..?ఈ దొంగలున్నారు కదా? వాళ్ల అజెండా ఉంది కదా? వాళ్లు దేన్ని వాడుకుంటున్నారంటే… జెనోఫోబియా అనే ఒక వ్యాధి ఉంది. జెనోఫోబియా.. ఎక్స్‌తో స్టార్టవుతుంది, చదువండి యంగ్ స్టర్స్. మౌలికంగా మన ఊరికి కొత్తవాడు వస్తే.. చిన్న అనుమానం ఉంటుంది కదా.. ఒప్పుకోం. మనకన్న ఇంకో భాష మాట్లాడితే.. మన కన్న డిఫరెంట్‌గా ఏదన్న భోజనం చేస్తుంటే.. మనకన్న డిఫరెంట్‌గా స్కిన్ కలర్ ఉంటే.. అనుమానంగా చూస్తాం. సంశయిస్తాం. కొంచెం భయం ఉంటుం ది. ఇంకేదో… దీన్ని వాడుకుంటారు వీళ్లు. ఓల్డ్ ట్రిక్ ఇది. బ్రిటీషోడు చేసిందదే కదా? డివైడ్ అండ్ రూల్. కలిసి ఉండకూడదు, చదువుండకూడదు. ఇన్‌స్టింక్ట్‌ను వాడుకుంటారు కదా? ఈ ఇన్స్టింక్ట్ వల్ల మనం బ్రెయిన్ వాష్ అవుతాం.
సామాన్యులు… జ్ఞానం ఇవ్వకూడదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. వాళ్ల మనో వికాసానికి కావాల్సిన ఏ పని కూడా చేయకూడదు. అలాగే పెట్టాలి వాళ్లని. ఇది తరతరాలుగా జరుగుతుంది. హిట్లర్ చేసిందదే. మన కులమే గొప్పది. మొదటి ప్రపంచ యుద్ధం అదే.. రెండవ ప్రపంచ యుద్ధం అదే. వీళ్లు మళ్లీ మళ్లీ అదే చేస్తారు. ఇవ్వాళ మన మహాప్రభు ఉన్నాడు కదా. ఆయన దాకా చెప్తున్నాన్నేను. వీళ్లు మళ్లీ మళ్లీ ఈ జెనోఫోబియాను వాడుతూనే ఉంటారు. ప్రొఫెసర్ గణేష్.. ఆయనతో మాట్లాడుతుంటే.. ప్రకాశ్ చూడు.. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం… ఆ తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం లేదు. బట్ కోల్డ్ వార్ వచ్చింది.. అమెరికా-రష్యా. ప్రపంచం మొత్తం మీరు ఎవ్వరిసైడ్ ఉన్నారో చెప్పాలి. కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అది బోర్ కొట్టిందా? కమ్యూనల్ వార్. క్రిస్టియన్, ముస్లిం, హిందూ, జైన్.. ఇలా… ఇప్పుడు కొత్త వార్ స్టార్టయింది. ఇప్పుడు మనం మేల్కోకపోతే. ఇంకో పది సంవత్సరాలు మళ్లీ మనం ఇలాగే ఉండిపోతాం. ఇట్ ఈజ్ కాల్డ్ టారిఫ్ వార్. ఈ దొంగలే చేసేది. ఎలాగైనా ఏదో ఒక వార్ రావాలి. చిచ్చుపెట్టాలి. మనుషులు కలిసి ఉండకూడదు. విశ్వమానవుడు అవ్వకూడదు. అందుకే వీళ్లకు డెమోక్రసీ వద్దు. ప్రపంచాన్ని ఈ వైషమ్యాల సుడిలో దించుతారు. ప్రజాస్వామ్యం వద్దు వీళ్లకు. ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. వాళ్లేం చేస్తారంటే.. మీకు ఒక అజెండా ఇస్తరు. మీ ధర్మం డేంజర్లో ఉంది అని. మీ భాష డేంజర్లో ఉంది అని. మీ కులం డేంజర్లో ఉంది అని. మీకేం అర్థం కావట్లేదు. సో మాకు కాంట్రాక్టు ఇవ్వండి, మేం చూసుకుంటాం. ఎంత సింపుల్.. సింపుల్ టెక్నిక్. అంటే కాంట్రాక్టు. మీరేం ఆలోచించకూడదింక.
ఒక వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ చెప్పాడు. ఎక్కన్నుంచో ఒక డక్… ఓ ప్రాంతానికి వచ్చి ఇక్కడ రెగ్యులర్‌గా ఒక చిన్న చెట్టు మీద తన ఎగ్స్ పెడుతుంది. అందులోంచి ఒక పిల్ల వన్ మంత్ తర్వాత బయటికి వచ్చి కిందకి దూకితే నేరుగా నీళ్లలో పడుతుంది. కానీ ఇప్పుడు నీళ్లు లేవు. పాపం ఆ డక్కు ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదనే విషయం తెలియదు. వైవిధ్యతను అర్థం చేసుకుంటే.. రైతు గురించి, మనం ఎన్నుకొనే నాయకుల గురించి.. వాళ్లెందుకు హామీలిచ్చారో దాకా, గవర్నమెంట్లో డబ్బు లేని పరిస్థితి ఎందుకు వచ్చిందో.. దాని గురించి, పక్షుల గురించి, రైతుల గురించి కూడా అర్థం చేసుకుంటాం, మనకి ఆ సెన్సిటివిటీ ఉంటే.
మొన్న మళ్లీ ఆ బండీపూర్లో ఓ ఐదు నిమిషాలు ఆగి, ఒక చెరువు పక్కన కూర్చున్నాం. అక్కడ ఒక కప్ప క్వాక్ క్వాక్ అనింది. అది ఎందుకు అరుస్తున్నది అని ఆయననడిగా.. ప్రకాశ్ నీకు వినిపిస్తుంది. ఇది వినపడనివారికి నేనెలా చెప్పాలి? అంటే అది ఈ టైంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను పిలుస్తుంది. మీరు ఆ మధ్యలో రోడ్డేసి వా.. వా.. అంటే రెండు కప్పలు మాట్లాడుకోవడానికి అడ్డుగా ఉన్నార్రా మీ మనుషులు. ప్రకృతి గురించి, ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవటం గురించి మనకు ఇలాంటి సున్నితత్వం లేకుంటే ఎలా? సో ఈ వైషమ్యాలు కానీ, ఈ పాలిటిక్స్‌ను కానీ ఇవన్నింటినీ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్టు సెన్సిటివ్ అవ్వాలి. మనకు ఎడ్యుకేషన్ కావాలి. వచ్చే తరాలకు, యంగ్‌స్టర్స్‌కు, మన పిల్లలకు.. వై ఈజ్ డైవర్సిటీ సో ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మనం అంటున్నాం. వాళ్లు యూనిఫామిటీ ఇన్ డైవర్సిటీ అంటున్నారు. అందరికీ ఒకే చెడ్డి వేసేస్తే, ఒకే భాషలో మాట్లాడాలని చెప్పేస్తే యూనిఫామిటీ అనుకుంటున్నారు. అది కాదు. ఒక కప్ప గురించి ఎందుకు ఆలోచించాలంటే ఈ యావత్ ప్రపంచంలో, మానవ వికాసంలో, ఈ నేచర్‌లో ఒక కప్ప మనుగడకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. అంతే ప్రాముఖ్యత మనిషికి కూడా ఉంది.
ఆల్ ఆర్ ఈక్వల్. మైనారిటీ, మెజారిటీ అనేది లేదు. కానీ వీళ్లకు మెజారిటీ కావాలి. వాళ్లకు అర్థం కానిదేమంటే మెజారిటీనే నిజమైతే ఈ దేశంలో నేషనల్ బర్డ్ కాకి అవ్వాలి, నెమలి కాదు. నేషనల్ యానిమల్ ఆవు కావాలి, టైగర్ కాదు. ఎందుకు నెమలి? మన ప్రజాస్వామ్యం కూడా ఏం చెప్తుంది? మైనారిటీ అని ఒకటి ఉంటే.. ఆ మైనారిటీని కాపాడటం మెజారిటీ వాళ్ల కర్తవ్యం.
రెండు పంచతంత్ర కథలు చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్త్తా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ దొంగలు అజెండా ఉన్న దొంగలు. బయటినుంచి వచ్చేవాళ్లు. రెండోది మనల్ని అమ్మేసే దొంగలు. వీళ్లు మనలోనే ఉంటారు. మొదటి కథ ఏంటంటే.. ఈ పాముంది కదా.. మన మహాప్రభువులా కొంచెం ముసలిది అయింది. ఇక వేటాడలేదు. ఇట్ కాంట్ హంట్. అది ఏం జేస్తుందంటే ఈ కప్పలున్న సామ్రాజ్యం దగ్గరకు వచ్చి పడుకుంటుంది. ఏం చేయదది. ఎందుకు అంటే ఏం లేదు నేను వెజిటేరియన్ అయిపోయాను అంటుంది. అంటే మన మహాప్రభువు చెప్తాడు కదా? నాకు ఫ్యామిలీ లేదు. అన్నీ వదిలేసి వచ్చాను అని. దేవుడే నన్ను సృష్టించాడని నమ్మిస్తే అయిపాయె. అలా ఉండగానే.. పాపం కప్పలు ఏం చేయదంటా అనుకుంటాయి. ఒక రౌండ్ తీసుకెళ్తా కూర్చోండి అంటే ఎక్కి కూర్చుంటాయి. ఒక రౌండ్ తీసుకెళ్తుంది. ఇంకో పాము మన అమెరికా ట్రంప్ ఉన్నారు కదా. నువ్వేంట్రా ఇంతా హ్యాపీగా బతుకుతున్నావు అంటే.. మాయ చేసేశాను, హ్యాపీగా జమ్చిక్ జమ్చిక్ గంతులేస్తున్నారు. ఒక్కొక్కటే మిస్ అవుతుంది. వాళ్లకు తెలియట్లేదు అన్నాడంట. అలాగే చంపుతారు.
ఇంకొక రకమున్నారు. మన సౌత్ ఇండియాలో వాళ్లకు బలం లేదు కదా? వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేవాళ్లున్నారు. దానికింకో కథ ఉంది పంచతంత్రంలో.. ఒక చిన్న బావి. ఆ బావిలో కప్పల సామ్రాజ్యం. హ్యాపీగా ఉన్నాయవి. ఆ బావి నుంచి బయటకు వచ్చే, లోపలికి వచ్చే దారి ఆ కప్పలకు మాత్రమే తెలుసు. అందులో ఓ కప్పను, మిగతా నాలుగు కప్పలు ఏడిపించాయి. దానికి జీవితంలో విరక్తి వచ్చేసింది. మీతో ఉండను నేను. ఇక్కడి నుంచి బయటికెళ్తానని.. ఆ దొంగదారి ఉంది కదా.. అందులోనుంచి బయటికెళ్లాడు. బయటికెళ్తే… ఈ పాము ఉంటుందక్కడ. నువ్వు నన్ను తినొద్దు. మా దగ్గర నీకు బోలెడు తిండి ఉంది. నేను తీసుకెళ్తాను అన్నది బయటకు వచ్చిన కప్ప. ఆ దొంగదారిలో తీసుకొచ్చేసింది ఆ పాముని. ఏయ్ నేను కాదు, వాన్ని తినేయ్.. వీడి మీద రైడ్ చేసేయ్.. వీన్ని లోపలేసెయ్.. అని తమలోతాము కొట్లాడితే పాము ఎందుకు వెళ్తానంటుంది. ఆ పరిస్థితి వాళ్లే తెచ్చుకున్నారు కదా? ఈ కథల మూలంగా దొంగలెవ్వరో, ఎవరని నమ్మాలో తెలిసిపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకుంటూ వైషమ్యాల సుడిలో నుండి డైవర్సిటీని కాపాడుకోవాలి. ఇలాంటి సభలు.. ఇలాంటి ప్రసంగాల స్ఫూర్తితో పోరాడుదాం. థ్యాంక్యూ.
మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం… ఆ తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం లేదు. బట్ కోల్డ్ వార్ వచ్చింది.. అమెరికా-రష్యా. ప్రపంచం మొత్తం మీరు ఎవ్వరిసైడ్ ఉన్నారో చెప్పాలి. కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అది బోర్ కొట్టిందా? కమ్యూనల్ వార్. క్రిస్టియన్, ముస్లిం, హిందూ, జైన్.. ఇలా… ఇప్పుడు కొత్త వార్ స్టార్టయింది. ఇప్పుడు మనం మేల్కోకపోతే. ఇంకో పది సంవత్సరాలు మళ్లీ మనం ఇలాగే ఉండిపోతాం. ఇట్ ఈజ్ కాల్డ్ టారిఫ్ వార్. ఈ దొంగలే చేసేది. ఎలాగైనా ఏదో ఒక వార్ రావాలి. చిచ్చుపెట్టాలి. మనుషులు కలిసి ఉండకూడదు. విశ్వమానవుడు అవ్వకూడదు. అందుకే వీళ్లకు డెమోక్రసీ వద్దు. ప్రపంచాన్ని ఈ వైషమ్యాల సుడిలో దించుతారు.