సామాజిక, రాజకీయ ఉద్యమాలకు నెలవైన తెలంగాణ గడ్డపై రాజకీయాలు రోజురోజుకు నవ్వుల పాలవుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికొదిలిన రెండు జాతీయ పార్టీలు రాజకీయాలను అటెన్షన్, డెవర్షన్ దిశగా నడిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్టుగా చిత్రీకరిస్తూ కుమ్మక్కవుతున్న తీరును చూసి ప్రజలు ముక్కున వెలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారం రోజులుగా ప్రధానమంత్రి మోదీని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తూర్పారబడుతున్నారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ హఠాత్తుగా రేవంత్ వర్సెస్ కిషన్రెడ్డిగా మారిపోయాయి.
దేశంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాల్లో సామాజిక, రాజకీయ ఉద్యమాలతో ఒకింత చైతన్యం ఎక్కువగా ఉన్నది తెలంగాణలోనే. గతవారం జరిగిన ఐదు నిమిషాల భేటీ తర్వాత రేవంత్‌కు మోదీ హీరో అయిపోతే, కిషన్‌రెడ్డి విలన్ అయిపోయారు. రాష్ర్టానికి ప్రాజెక్టులు, నిధులు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. రాష్ర్టాభివృద్ధిలో మోదీకి ఉన్నంత స్పష్టత, సానుకూలత కిషన్‌రెడ్డికి లేవట. మోదీని కలిసిన మరుక్షణంలోనే రేవంత్ చేసిన ఈ ఆరోపణల్లో నిగూడార్థం దాగి ఉన్నదని స్పష్టంగా అర్థమవుతున్నది. కిషన్‌రెడ్డి పనికిరాని కేంద్రమంత్రి అని స్వయానా మోదీ అయినా రేవంత్‌కు చెప్పి ఉండాలి, లేదా నిన్న మొన్నటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రేవంత్, కిషన్‌రెడ్డి మధ్య ఏదో ఒప్పందమైనా బెడిసికొట్టి ఉండాలి. లేదంటే రాహుల్‌గాంధీతో ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు బీజేపీని కార్నర్ చేసే కోణమైనా అయి ఉండాలి.
వారం కిందట మోదీతో రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందం అధికారిక భేటీ అనంతరం దాదాపు 40 నిమిషాల పాటు మోదీ, రేవంత్ ఏకాంతంగా భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీ రహస్యాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే ప్రతి వేదికపైనా కిషన్‌రెడ్డిని రేవంత్ తూర్పారబడుతున్నారు. ఏ కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్నా వీరి వాగ్వాదంపై అనుమానం కలగకమానదు. బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండానే ఒకరినొకరు విమర్శించుకోవడం ద్వారా రాజకీయం మొత్తం తమ రెండు పార్టీల మధ్య జరుగుతున్నట్టు కలరింగ్ ఇచ్చే కోణం దాగి ఉన్నది. ఈ మాటల యుద్ధంలో బీఆర్ఎస్కు ఎక్కడా అవకాశం దొరక్కూడదనుకోవడం అవివేకం.
పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే రేవంత్ బీజేపీ ఫోల్డర్లోకి వెళ్లినట్టు ప్రచారం జరిగింది. అందుకనుగుణంగానే మల్కాజిగిరి, కరీంనగర్, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ వీక్ అభ్యర్థులను పెట్టి తెలంగాణలో పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్న వైనం తేటతెల్లమైంది. ఇది రేవంత్‌పై రాహుల్‌కు నమ్మకం సన్నగిల్లేలా చేసింది. ఇటీవల రాహుల్‌ను కలిసి వచ్చిన రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లు తన కుర్చీకి ఎసరు పెడుతున్నారని ఏకరువు పెట్టారు. ఇక్కడ ప్రజల్లోనూ నమ్మకం కోల్పోయి, అక్కడ రాహుల్ వద్దా పతారా పాడుచేసుకున్న రేవంత్‌కు ఇప్పుడున్న ఏకైక దిక్కు మోదీనే. రాహుల్ ఇవ్వకపోయినా మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తున్నట్టు చెప్పుకోవడం గమనార్హం. తేడా వస్తే ఆరెస్సెస్‌తో జత కట్టేందుకు కూడా రెడీ అని అనుచరులకు రేవంత్ చెప్పినట్టు తెలిసింది.
మరోవైపు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు మోదీ, రేవంత్ మధ్య సయోధ్య కుదిరిందని, వీరి మధ్య కిషన్‌రెడ్డి బఫూన్లా మారారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకానిన్నీ రేవంత్ సర్కారు పాతర వేస్తున్నది. ఎగవేతలు, దాటవేతల ప్రభుత్వంగా మారిపోయింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకుంటున్న గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.
నీళ్లు లేక, నిధులు లేక వ్యవసాయరంగం మళ్లీ కుదేలైంది. నేత, గీత, కమ్మరి, కుమ్మరి, యాదవ, ముదిరాజ్ వృత్తులు ఏడాదిన్నరలోనే మూలనపడ్డాయి. హాస్టల్ విద్యార్థుల హాహాకారాలు, విద్యార్థుల ఆకలిచావులు పాలనను వెక్కిరిస్తున్నాయి. తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. పది రోజులైనా మృతదేహాలను వెలికితీయని అసమర్థ సర్కారుగా పేరు తెచ్చుకున్నది. వైఫల్యాల నుంచి గట్టెక్కేందుకు మిస్టరీ మరణాల పేరుతో అటెన్షన్ డైవర్షన్‌కు పాల్పడుతున్నారు. రేవంత్ గద్దెనెక్కి 14 నెలలైనా ఇప్పటి వరకు పూర్తిస్థాయి క్యాబినెట్ లేదు. దీంతో అన్ని శాఖల్లోనూ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రతి ఐదు గంటలకో అత్యాచార ఘటన జరుగుతున్నది. మహిళలకు రక్షణ కరువైంది.
తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న బీజేపీ హామీ నీట మునిగింది. కోట్లమంది పేదలను బ్యాంకుల ముందు లైన్లలో, టైమ్ స్లాటుల్లో నిలబెట్టింది. హేతుబద్ధత లేని ట్యాక్స్ స్లాబ్‌లు తీసుకొచ్చి ఎన్నో వ్యాపారాలు కుదేలు కావడానికి కారణమైంది. మరోవైపు, కనిపించిన ప్రతి సంస్థను ప్రైవేటుకు అమ్మేస్తూ విమర్శలు మూటగట్టుకున్నది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోనూ పోరాడుతున్నది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇవాళ తెలంగాణ సమాజం ఏడాదిలోనే ఏం కోల్పోయిందో తెలుసుకున్నది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయం.
-శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి