తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగనున్నదనే విషయమై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఈ ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వానికి సవాల్‌గా మారడమే అందుకు కారణం. పదేండ్లలో తెలంగాణ గ్రామాల రూపురేఖలను సమూలంగా మార్చివేసిన కేసీఆర్ ముందు కాంగ్రెస్ ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రయోజనం ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, 63 వేల ఉద్యోగాల నియామకం వంటి అరకొరగా అమలైన హామీలు ఎన్నికల్లో ఓట్లు రాల్చుతాయని అనుకోవడం కాంగ్రెస్ పాలకుల భ్రమ.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు బోసిపోయిన నిజం ప్రతి తెలంగాణ పౌరుడికి తెలుసు. పరాయి పాలనలో తెలంగాణ ప్రజలు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బాట పట్టేవారు. గోరెటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాటను ఇప్పుడు విన్నా జనం కండ్లు చెమ్మగిల్లుతాయి. అయితే, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని సమస్యలకు చరమగీతం పాడింది. కేసీఆర్ సర్కారు నెలనెలా రూ.339 కోట్లను గ్రామ పంచాయతీలకు మంజూరు చేయడంతో పల్లె ప్రగతికి పరుగులు పెట్టింది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి ఉన్న 9,623 గ్రామ పంచాయతీల సంఖ్యను కేసీఆర్ సర్కారు 12,769కు పెంచింది. 1,177 తండాలు, గోండు, కోయ, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. గిరిజన బిడ్డలను పాలకులను చేసింది. అంతేకాదు, ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి ఉండే విధంగా 9,355 మందిని గ్రామ కార్యదర్శులుగా నియమించింది. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ సమకూర్చడంతో ఏ రోజు చెత్తను ఆ రోజే డంపింగ్ చేసే అవకాశం కలిగింది. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు ఏర్పాటయ్యాయి. 100 శాతం మరుగుదొడ్లు నిర్మితమయ్యాయి.
మిషన్ కాకతీయతో పల్లెల్లోని చెరువుల్లో నీటి కళ వస్తే, మిషన్ భగీరథతో ప్రతి పల్లె ప్రజలకూ స్వచ్ఛమైన తాగునీరు లభించింది. భూగర్భ జలాలు పెరగడంతో వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది. వలసపోయినవారు వాపస్ వచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా, కంటివెలుగు, కేసీఆర్ కిట్, రైతు వేదికలు గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు చేశాయి. దేశంలోనే వంద శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచి, గెలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పురస్కారాలు మన పల్లెలను వరించాయి.
గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాల సంఖ్యను కేసీఆర్ సర్కారు పెంచింది. తద్వారా మండల, జిల్లా పరిషత్తులు పెరిగాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు పెరిగాయి. వాణిజ్య సౌకర్యాలు మెరుగయ్యాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లెలు, పట్టణాల ప్రగతిని పర్యవేక్షించేందుకు ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)ను బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను 30 శాతం పెంచింది. సఫాయి కర్మచారుల వేతనాలూ పెంచింది. నిధుల ఆడిట్‌కు అవలంబిస్తున్న ఆన్లైన్ విధానం దేశానికే ఆదర్శమని నాటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కొనియాడారు.
అభివృద్ధి అనేది నిత్య నూతనం. ఏడాదిన్నర కాలంలో ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ఏమి చేసిందని ఓట్లు అడుగుతారు. గ్రామీణాభివృద్ధి అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, టి.ఎస్ తీసేసి టి.జి చేయడం, ఉద్యమంలో ఊపందుకున్న గీతాల ైస్టెల్‌ను మార్చడం కాదు. ప్రజలకు అవసరమయ్యే పనులు చేయాలంటే హృదయం కావాలి. చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి, కార్యసిద్ధి కావాలి. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రాజ్యాంగ రక్షణ కల్పించండి. ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించండి. రైతుల ఆత్మహత్యలను ఆపండి. ధాన్యం సేకరణకు, ధాన్యం రక్షించుకోవడానికి గిడ్డంగుల సౌకర్యాలను పెంచండి. అకాల వర్షాలతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని కొని రైతుల్లో నమ్మకాన్ని పెంచండి. వీటిని చేసినప్పుడే గ్రామీణుల హృదయాలను గెలుచుకోగలరు. సామాన్యుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవాలంటే శాశ్వత అభివృద్ధి పనులు చేయాలి.