ప్రజలారా! ఆలోచించండి..
గతంలో
మనబిడ్డల కాళ్ళెందుకు
పొట్లకాయల్లా వొంకరపోయున్నవని
మన నాయినలు తలెత్తి ఆకాశాన్ని
చూడలేకపోయిండ్రని
మన అమ్మలు నేలమీదనే కప్పలా
డోకుతున్నరెందుకని..
గతాలన్నీ ఫ్లోరైడ్కు పట్టాలు
ఆలోచించండి ప్రజలారా !
గొంతుల నిండా విషాన్ని తాగి
పుట్టు అవిటివాళ్లమైనం
పోరాటాలెన్ని చేసినా
ఒక్కని పెయి మీద చెమట రాలే
481మందితో నల్లగొండ లోక్సభకు
మాస్ నామినేషన్లతో బిగ్ బ్యాలెటైనం
కాల్జేతులు వంకరపోయిన బిడ్డలను
దేశ ప్రధాని వాజపేయి టేబుల్ మీదుంచి
వేడుకున్నం గదువపట్టి గీములాడినం
ఏ జాతీయపార్టీలు ఆవగింజంత ఆలోచించలే
ఏ నాయకులకు అక్కరరాలే !
ప్రజలారా! ఆలోచించండి
పిల్లనియ్యడానికీ ఏ ఊరు ముందుకురాలే
బిడ్డల లగ్గాలు కాలే,
జలసాధనకే అంకితమై
అరవై ఏండ్లు అరిగోస వడ్డం
పాలక దేవుళ్లకు కొబ్బరికాయలు
కొట్టి కొట్టి కన్నీళ్లుపెట్టుకున్నం
తల్లుల గర్భస్రావాలు కొండంత దుఃఖంతో
కాళ్లవేళ్ల పడి బతిమిలాడినం
ఆలోచించండి ప్రజలారా!
అదే నేల అదే రాజకీయం అదే దళారులు
అదే నీళ్లు అదే మనసులు ఆలోచించలేదు
ఆలోచనలేనివాళ్లను మళ్లీ మళ్లీ ఎన్నుకుంటే
అవిటివాళ్లుగానే మిగులుతాం
జాబిల్లి వంక చూడని నేలగానే చరిత్రల !
ఆలోచించే నాయకులు మన కేసీఆర్
పోరాటంతో తెలంగాణను సాధించుకున్నం
అదే నేల నుంచి మిషన్ భగీరథతో
ఇంటింటా మంచినీళ్లు
స్వచ్ఛ జలధారతో మన వాకిట్ల చెలిమైండు
రైతుబంధు.. దళితబంధు.. గురుకులాలతో
మనింటి పెద్ద దిక్కయిండు
ప్రజలారా! ఆలోచించండి
మనల ముంచినోళ్లే మనముందుకొస్తున్నరు
మునుగోడులో
మునిగిపోవొద్దు మనమే ముంచుకోవొద్దు
మునుగోడుతో తేలిపోవాలి
అహంకారాలు కూలిపోవాలి
గతకాలపు గడీలు తుప్పుబట్టాలి
అభ్యుదయాలు నిలబడాలి
ప్రజా ఆలోచనలు గెలువాలి!
మీరిచ్చే సందేశం ఎన్నికలకు వెన్నెముక!
వనపట్ల సుబ్బయ్య: 94928 65358