అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు విభిన్న భావాలున్న రెండు కూటముల మధ్య జరిగాయి. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రచారం చేసిన మెజారిటీ ‘హిందుత్వ’కు, రాహుల్‌గాంధీ నేతృత్వంలో ‘ఇండియా’ కూటమి ప్రచారం చేసిన రాజ్యాంగ పరిరక్షక, లౌకిక విలువలకు మధ్య జరిగిన సైద్ధాంతిక పోరాటంగానే ఈ ఎన్నికలను అభివర్ణించాలి.
అయితే, ‘చార్ సౌ పార్’ అని మోదీ అనుకూల మీడియా, బీజేపీ ఊదరగొట్టినప్పటికీ ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి. మోదీతో పాటు బీజేపీని అవి నిరాశపరిచాయి. ఎందుకంటే గతానికి భిన్నంగా ఈసారి చంద్రబాబు, నితీష్ కుమార్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గతంలో తీసుకున్నట్టుగా ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాలు తీసుకోవడం ఇకపై సాధ్యపడదు. అంతేకాకుండా మోదీ స్వేచ్ఛకూ ఆంక్షలు విధించినట్టయింది.
PM Modi | నరేంద్ర మోదీ ఏకపక్ష, నియంతృత్వ విధానాలకు ఓటర్లు గట్టి గుణపాఠం చెప్పారు. తామే గెలిచామని బీజేపీ చెప్పుకొంటున్నప్పటికీ ఇది నైతికంగా మోదీకి ఓటమిగానే భావించాలి. గత దశాబ్దకాలంగా మోదీ-బీజేపీ అనుసరించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విధానాల పట్ల ప్రజలు ఆగ్రహాన్ని, అసంతృప్తిని, నిరసనను తమ ఓటు ద్వారా తెలుపుతూ స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, రిజర్వేషన్లు ఎత్తేస్తామని కొందరు బీజేపీ నాయకులు పదేపదే చెప్పటం, పౌరహక్కులపై దాడి, విపక్షాలపై అక్రమ కేసులు, మేధావులు, జర్నలిస్టులను జైలుపాలు చేయడం, కఠినమైన సెక్షన్లు బనాయించి వారికి బెయిల్ రాకుండా అడ్డుకోవడం లాంటి చర్యలను చూసి విసిగిపోయిన ప్రజలు తమ ఓటుతో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పారు.
బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేసిన ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే నేత’ ప్రచారాన్ని దేశ ప్రజలు తిప్పికొట్టారు. మోదీ గతంలో చేసిన అనేక వాగ్దానాలు నీటి మీద రాతలయ్యాయి. అందుకే మోదీ గ్యారంటీలను ప్రజలు విశ్వసించలేదు. ముఖ్యంగా మొదటినుంచీ బీజేపీ బలంగా ఉన్న యూపీలో ఎన్నికల ఫలితాలు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. యూపీలోని వారణాసి నుంచే మోదీ పోటీ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ర్టానికి ముఖ్యమంత్రి. పైగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకున్నది. రామమందిర నిర్మాణ ప్రభావంతో హిందువుల ఓట్లన్నీ తమకే పడుతాయని కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, అక్కడి ఓటర్లు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లోనే బీజేపీ అభ్యర్థిని ఓడిం చారు. ఇది బీజేపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.
ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే.. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన రాహుల్ గాంధీ.. రాజ్యాంగం మనుగడ, బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో పాటు కులగణన చేస్తామని హామీ ఇవ్వడం కొంతమేర ఆ కూటమికి కలిసివచ్చింది.
బీజేపీ ప్రభుత్వం గత పదేండ్లుగా దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి కుబేరులకు కట్టబెట్టింది. అదే సమయంలో దేశంలో పేదరికం, నిరుద్యోగం, ధరలు పెరిగాయి. అనేక అంతర్జాతీయ సూచీలలో భారత్ అట్టడుగున నిలిచింది. వీటిని ఇండియా కూటమి అస్త్రంగా మలుచుకున్నది.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో మోదీ వాగ్దానం చేశారు. ఆ లెక్కన గత పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ, అందుకు భిన్నంగా ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడంతో ఉన్న ఉద్యోగులు రోడ్డునపడ్డారు. అదే సమయంలో ప్రైవేటు రంగంలో ముఖ్యంగా ఐటీలో ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. ఇవన్నీ బీజేపీకి ప్రతికూలంగా మారాయి.
మోదీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. బిల్కిస్ బానో కేసులో నిందితులు, బ్రిజ్ భూషణ్ దర్జాగా తిరుగుతుండటం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినా, అత్యాచారం చేసి, చంపేసినా మోదీ సర్కార్ పట్టించుకోలేదు. మణిపూర్ మంటల్లో బుగ్గి అవుతున్నా మోదీ మౌనం వహించారు. పార్లమెంట్లో చర్చ పెట్టకపోగా.. ప్రశ్నించిన విపక్షాలను చట్టసభ నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి అనేక ప్రజా సమస్యలను ఇండియా కూటమి ప్రజల దృష్టికి తెచ్చింది. మరోవైపు మోదీ తన పదేండ్ల పాలనపై తీర్పు చెప్పాలని ప్రజలను కోరే సాహసం చేయలేదు. ప్రజా సమస్యలపై చర్చ సాగకుండా పక్కదారి పట్టించేందుకు మతం, మందిరం, మసీదులతో పాటు మటన్, మంగళసూత్రాల వంటివాటిని తెరమీదికి తెచ్చారు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని మోదీ సర్కార్ ఎన్నడూ గుర్తించలేదు. ఒకే భాష, ఒకే సంస్కృతి పేరిట ప్రాంతీయ ప్రత్యేకతలను, వాటికి ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందుకే ప్రాంతీయ సంస్కృతులు, భిన్నత్వం, ప్రత్యేకతల ముందు మోదీ హవా సాగలేదు. తమిళనాడు, బెంగాల్, పంజాబ్ రాష్ర్టాల ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పడమే అందుకు నిదర్శనం. ఏపీలో టీడీపీతో పొత్తు లేకపోతే బీజేపీకి ఆ రాష్ట్రంలో ప్రాతినిధ్యమే ఉండేది కాదు. కనీసం డిపాజిట్లు కూడా దక్కేవి కావు.
మొత్తంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో మోదీ-బీజేపీ ఊహించినట్టుగా ఏదీ జరగలేదు. ప్రజలు 240 సీట్లకు బీజేపీ బలాన్ని కుదించారు. నితీశ్, చంద్రబాబుపై ఆధారపడేలా చేశారు. ఈ బంధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. నితీష్‌కుమార్ నమ్మదగిన స్నేహితుడు కాదు. మోదీ ఒంటెత్తు పోకడలతో చంద్రబాబు గతంలో ఎన్డీయే నుంచి బయటికి వచ్చినవారే. చంద్రబాబు, నితీశ్‌లకు ముఖ్యమంత్రి పదవులే ముఖ్యం. రాష్ట్రంలో రాజకీయంగా తమకు ముప్పు వాటిల్లితే వారు ఎన్డీయేను వదులుకుంటారే తప్ప మోదీ కోసం తమ రాష్ర్టాల ప్రయోజనాలకు విఘాతం కలిగించరు. వారిద్దరు మోదీని అన్ని విషయాల్లో గుడ్డిగా అనుసరించరు.
మోదీ, చంద్రబాబు, నితీష్ల బంధం భావస్వారూప్యం కలిగినది కాదు. వారి సిద్ధాంతాలు పరస్పర విరుద్ధమైనవి. మోదీ ముస్లింలకు, వారి రిజర్వేషన్లకు బద్ధ విరోధి. చంద్రబాబు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించారు. నితీష్ కూడా ముస్లింల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారు. ఈ పరస్పర విరుద్ధ పార్టీల మధ్య సయోధ్య ఎంతకాలం కొనసాగుతుందో కాలమే సమాధానం చెప్తుంది. ఏపీ, బీహార్ రాష్ర్టాలకు మోదీ సర్కార్ ప్రత్యేక హోదా ఇస్తుందా? ఆయా రాష్ర్టాల ప్రయోజనాలను ఏ మేరకు నెరవేరుస్తుందనే దానిపై ఈ సంకీర్ణ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుంది. వీరిలో ఎవరో ఒకరు కినుక వహించినా సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుంది.