గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో పార్ట్‌టైం టీచర్లది కీలకపాత్ర. మాకున్న సబ్జెక్టు పరిజ్ఞానం, అనుభవం, అంకితభావం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఈ విషయం మీకు నచ్చినా, నచ్చకపోయినా ఒప్పుకోకతప్పదు. అంతేకాదు, ఎన్నో గిరిజన గురుకులాలు పార్ట్‌టైం టీచర్ల వల్లనే నడుస్తున్నాయన్నది వాస్తవం. అయినప్పటికీ, మేం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా లేకపోతే ఎలా? పోనీ, బయటకి వచ్చి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తే ‘ఇలాంటి ఒక వ్యవస్థ ఉందా?’ అని నోరెళ్లబెడుతున్నారు.
రెండు దశాబ్దాలుగా స్వయంప్రతిపత్తి కలిగిన గురుకులంలో కనీస జీతం కూడా లేకుండా ఒక ఉపాధ్యాయ వ్యవస్థ నడుస్తున్నదంటే నమ్మశక్యం కాదు. చాలీచాలని జీతంతో సుమారుగా 1,800 మంది ఉపాధ్యాయులు తమ జీవితాలను నెట్టుకొస్తున్నారన్నది కఠోర సత్యం. రెగ్యులర్ టీచర్లతో పోలిస్తే, పార్ట్‌టైం టీచర్ల జీతాలు చాలా తక్కువ. అంతేకాదు, వారితో పోలిస్తే కనీస వసతులు, వనరులు కూడా అందవు. ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయుల జీతం గురించిన ప్రస్తావన తేవడం ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేసేందుకు మాత్రమే.
రెగ్యులర్ ఉపాధ్యాయుల్లాగే క్లాస్‌లు చెప్పటం, నైట్ స్టడీ, హాలిడే డ్యూటీ హౌస్‌మాస్టర్, డిప్యూటీ వార్డెన్ తదితర అన్నిరకాల డ్యూటీలు, పరీక్షల నిర్వహణ, హోమ్‌వర్క్ పరిశీలన, ప్రాజెక్టులకు మార్గనిర్దేశం వంటి పనులు చేస్తున్నప్పటికీ పార్ట్‌టైం టీచర్లకు చాలా తక్కువ జీతం అందుతున్నది. కొన్ని విద్యాసంస్థల్లో మా మిత్రులను కనీసం టీచర్లుగా కూడా గుర్తించరు. ఇది ఎంతటి బాధాకరం. విస్మయం కలిగించే ఇంకో విషయం ఏమిటంటే.. సోదర (మైనారిటీ) సొసైటీలో ఉన్న పార్ట్‌టైం టీచర్ల జీతభత్యాలకు, గిరిజన గురుకులంలో ఇస్తున్న జీతాలకు చాలా తేడా ఉంటుంది. ‘ఒకే గురుకులం-ఒకే మెనూ’ ఉండాలని ఆలోచించే ప్రభుత్వం.. ‘ఒకే గురుకులం-ఒకే వేతనం’ అంశాన్ని మాత్రం పెడచెవిన పెట్టడం బాధాకరం.
విద్యాసంస్థల నిర్ణయ ప్రక్రియలోనూ పార్ట్‌టైం టీచర్లు తరచుగా పాల్గొనలేరు. రెగ్యులర్ టీచర్లతో సమాన అర్హతలు ఉన్నా, సమాన గౌరవం ఇవ్వకుండా చిన్నచూపు చూస్తారు. అంతేకాదు, సమాజంలో అవహేళనలు, ఛీత్కారాలను తట్టుకొని మరీ గిరిపుత్రుల అభ్యున్నతికి పాటుపడుతున్నవారి శ్రమను గుర్తించకపోగా, కనీస జీతం కూడా ఇవ్వకపోవడం విషాదకరం. ఈ అన్యాయాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నది. గురుకులాలన్నీ ఒకే తీరుగా ఉండాలని, ఒకే టైం టేబుల్-ఒకే మెనూ ఉండాలని మాట్లాడే ప్రభుత్వం.. వాటిలో పనిచేసే పార్ట్‌టైం టీచర్లకు ఇచ్చే వేతనాల విషయంలో ఒకే తీరుగా ఉండాలని ఆలోచించకపోవడం బాధాకరం.
పార్ట్‌టైం టీచర్లు విద్యావ్యవస్థలో సాధారణంగా కనిపించేవారే కానీ, గుర్తింపు లేని శ్రామికులు. వారి సేవలను గుర్తించడం, వారికి న్యాయం చేయడం, వారి హక్కులను సంరక్షించడం ప్రభుత్వ బాధ్యత. వారికి గౌరవం, ఉద్యోగ భద్రత, సమాన అవకాశాలు కల్పించగలిగితేనే గుణాత్మక విద్య సాధ్యమవుతుంది. కాబట్టి, ప్రభుత్వ పెద్దలు, గిరిజన గురుకులం ఉన్నతాధికారులు ఒక్కసారి మా గురించి ఆలోచించాలి. మా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మీకు వినతిపత్రాలు ఇవ్వటం, మీకు మా గోడు వెళ్లబోసుకోవడం తప్ప, ఏమీ చేతగాని, చేవ చచ్చిన అభాగ్య పార్ట్‌టైం టీచర్లుగా పిలవబడే బానిస సమూహం.
(వ్యాసకర్త: పార్ట్‌టైం టీచర్స్ అసోసియేషన్ (జీఎల్ఏటీఏ), ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ)
– విజయ్‌కుమార్ ఆత్మకూరి ,9441350460