వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్యారా అథ్లెట్ జోగేంద్ర ఛత్రియా దవాఖానలో చికిత్స పొందుతూ మరణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ మరుసటి రోజే ఢిల్లీలో కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడం యాదృచ్ఛికమే. ఢిల్లీలోని మొత్తం కుక్కలను 15 రోజుల్లోగా సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఆగస్టు 11న సర్వోన్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ తీర్పుతో మరోసారి దేశం దృష్టి వీధికుక్కల సమస్యపైకి మళ్లింది. ఒక అంచనా ప్రకారం దేశంలోని మొత్తం కుక్కల సంఖ్య సుమారు 6 కోట్ల పైచిలుకే. అయితే, 2024లో కుక్క కాట్ల ఘటనలు 37 లక్షల వరకు ఉన్నాయి. బయటపడనివి, నమోదు కానివి కలిపితే ఈ సంఖ్య చాలా ఎక్కువే ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా రేబిస్ మరణాలపై కూడా కచ్చితమైన లెక్కలు లేకపోవడం గమనార్హం. 2022లో 21 మంది రేబిస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంఖ్య 305 వరకు ఉంటుందని పేర్కొంది.
వాకింగ్‌కు పెద్దలు , బడికి పిల్లలుపోవాలన్నా వణికిపోయేది కుక్క లకే. 2023లో ‘వాఘ్ బక్రీ’ టీ కంపెనీ యజమాని, కోటీశ్వరుడు పరాగ్ దేశాయ్ తన బంగళా ముందు నిల్చుని ఉండగా కుక్కలు దాడి చేశాయి. వాటి నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఆయన పరుగెత్తి కిందపడి తీవ్రంగా గాయపడి మరణించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కుక్కల బెడదకు ధనిక పేద తేడా లేదని ఆ సంఘటన రుజువు చేసింది. ఇవన్నీ గమనిస్తే ఉన్నపళంగా కుక్కలను ఏరిపారేయాలన్న కోర్టు ఆదేశాలు సరైనవేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే దేశ రాజధానిలోని లక్షలాది కుక్కలను పట్టుకుని సంరక్షణ కేంద్రాలకు తరలించడం ఇప్పటికిప్పుడు ఆచరణ సాధ్యమేనా? అనేది ప్రశ్న. అయితే అది అభిలషణీయం మాత్రం కాదనేది జంతు ప్రేమికుల వాదన.
ఇంతకూ కుక్కలు కలిగించే ఆరోగ్య, భద్రత సమస్యలకు సమాధానం? కుక్కల బెడద నివారణకు ప్రామాణిక పరిష్కార మార్గంగా సంతాన నిరోధక చికిత్సను సూచిస్తారు. తద్వారా క్రమంగా కుక్కల సంతతిని అదుపు చేసి, చివరకు నిశ్శేషం చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో వీధికుక్కల సమస్యను పూర్తిగా అదుపు చేసిన దేశంగా నెదర్లాండ్‌ను చెప్పుకొంటారు. మన దేశంలోనూ ఇవే నిబంధనలు ఉన్నప్పటికీ పౌరసంస్థలు, అధికారుల అలసత్వం వల్ల అవి సరిగా అమలు కావడం లేదనేది తెలిసిందే. సుప్రీంకోర్టు ఈ అంశంపై భిన్నమైన తీర్పులు వెలువరించింది. నియమ, నిబంధనలు అమలు చేస్తూ, రాజ్యాంగం నిర్దేశించిన కారుణ్యాన్ని ఏ మాత్రం విడనాడకుండా సమస్యను పరిష్కరించాలని 2024లో వెలువడిన తీర్పు సూచించింది. కాగా మొన్నటి తీర్పు ఈ నియమాలతో నిమిత్తం లేకుండా ఎకాఎకీన కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఆదేశించడంపై దుమారం చెలరేగింది. ఈ రెండో తీర్పుపై పునఃపరిశీలనకు ఏర్పాటైన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో మందలించింది. నియంత్రణల అమలులో వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఈ ధర్మాసనం తుది నిర్ణయం కోసం మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే.