సాధారణంగా సైనిక తిరుగుబాటు జరిగితే వీధుల్లోకి ట్యాంకులు వస్తాయి. ప్రధాన అధికార కేంద్రాలను సైనికులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆపై సైనిక నియంత మీడియా ముందుకువచ్చి దేశంలో అరాచకం ప్రబలిందని, దానిని నియంత్రించేందుకు సైనిక పాలన ఒక్కటే మార్గమని సెలవిస్తాడు. కానీ, ఇలాంటి హంగామా ఏదీ లేకుండానే చాపకింద నీరులా పాకిస్థాన్‌లో సైనిక పాలన అమలులోకి వస్తున్నది. చట్టబద్ధ పాలన, సైనిక నియంతృత్వం అనేవి పరస్పర విరుద్ధమైన అంశాలు. కానీ, ఈ రెండింటి వికృత కలయికతో ఓ కొత్త వ్యవస్థ పాక్‌లో రూపుదాలుస్తున్నది. అందుకు 27వ రాజ్యాంగ సవరణ దారులు వేస్తున్నది.
పరోక్ష సైనిక ఆధిపత్యం నుంచి రాజ్యాంగబద్ధంగా సైనిక నాయకత్వానికి పెద్దపీట వేసే సవరణ బిల్లుకు మొన్న పదో తేదీన పాక్ సెనేట్ ఆమోదం తెలిపింది. తర్వాత పాక్ పార్లమెంట్ కూడా తలూపింది. అధ్యక్షుడు జర్దారీ రాజముద్రతో ఇది నేడో రేపో అమలులోకి వస్తుంది. ఈ అసాధారణ సవరణతో పాక్ రాజ్య వ్యవస్థ సమూలంగా మారిపోతుంది. నిన్నటిదాకా సైన్యం తెరవెనుక నుంచి పావులు కదిపేది. ఇక నుంచి నేరుగా పెత్తనం చెలాయించే సౌలభ్యం సైన్యానికి ఏర్పడుతుంది. తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టే ఆ రాజదండం ఇటీవల ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ పొందిన పాక్ సైన్యాధినేత ఆసిమ్ మునీర్ చేతిలోకి వెళ్తుందని గుర్తుంచుకోవాలి.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో మునీర్ పేరు బాగా వినిపించింది. ఈ కరడుగట్టిన మతోన్మాది, భారత్ బద్ధ విరోధి అంచెలంచెలుగా పాక్‌ను శాసించే స్థాయికి ఎదగడంపై మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు జరిపినప్పుడు అప్పటికింకా జనరల్ హోదాలోనే ఉన్న మునీర్ భారత్‌పై అణుబాంబులు వేయడం గురించి ప్రస్తావించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అందుకే భారత్-పాక్ యుద్ధాన్ని ఆపానని ఆయన పదే పదే చెప్పుకుంటుండటం చూస్తున్నాం. ఈ ప్రకటనలు భారత నాయకత్వాన్ని ఇరకాటంలో పడేశాయనేది వేరే విషయం.
ఇదంతా ఒకెత్తు అయితే మునీర్‌ను ట్రంప్ వైట్‌హౌజ్‌కు పిలిచి విందు ఇవ్వడం ఒక ఎత్తు. ఓ రాజ్యాధినేత తరహాలో మునీర్ వాషింగ్టన్లో దర్జా వెలగబెట్టడమే కాకుండా ట్రంప్ పేరు నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చి వచ్చారు. పాక్ రాజ్యవ్యవస్థపై మునీర్ పట్టు బిగించారనడానికి ఈ తతంగం ఓ నిదర్శనం. ఇప్పుడు అదే సైన్యాధినేత చేతికి అణ్వస్ర్తాలు, త్రివిధ దళాలపై గుత్తాధిపత్యం కట్టబెట్టి, న్యాయపరమైన పరిశీలన నుంచి మినహాయింపు కల్పించేందుకు, పౌరపరిపాలనా వ్యవస్థపై పెత్తనం చెలాయించేందుకు రాజ్యాంగ సవరణ రూపంలో లైసెన్స్ సమకూర్చారు.
ప్రపంచంలో దేశాలకు సైన్యం ఉంటుంది. కానీ, పాక్‌లో సైన్యానికి దేశం ఉందని అంటారు. మరో రెండేండ్లలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న పాకిస్థాన్ పౌర పాలనలో కన్నా సైనిక పాలనలోనే ఎక్కువగా గడిపింది. తొలి సైనిక నియంత అయూబ్ ఖాన్ తనకు తాను ఫీల్డ్ మార్షల్ హోదా ఇప్పించుకొని, ఆ తర్వాత అధ్యక్ష తొడుగు వేసుకొని అధికారం చెలాయించారు. ఆ తర్వాత వచ్చి న జియావుల్ హక్, ముషారఫ్ సైనిక హోదా పెంచుకోకుండా అధ్యక్ష పదవులను భుజకీర్తులుగా తగిలించుకొని పరిపాలించారు. వారందరి కన్నా రెండాకులు ఎక్కువే చదివిన మునీర్ అధ్యక్ష పదవి జోలికి వెళ్లకుండా గుట్టుగా దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. రాజ్యాంగబద్ధ సైనిక పాలన కబంధ హస్తాల్లో పాక్‌ను బందీని చేశారు. కశ్మీర్ మా ‘జీవనాడి’ అని బాహాటంగా ప్రకటించుకున్న సైనిక నియంత గుట్టుగా పాక్‌పై పట్టు బిగించడం భారత్‌కు వ్యూహాత్మకంగా ఏ మాత్రం పొసగని వ్యవహారమని చెప్పక తప్పదు.