సుమారు రెండు వేల ఏండ్లకు పూర్వం శాతవాహన రాజు, కవివత్సల బిరుదాంకితుడైన హాలుడు కొలువులో గుణాఢ్యుడు అనే కవి ఉండేవాడు. అతను పైశాచి భాషలో మొట్టమొదటి కథా సంకలన గ్రంథం ‘బృహత్కథ’ను రచించాడు. శాతవాహనుడికి నిర్ణీత సమయంలో సంస్కృతం నేర్పించలేక ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం వింధ్య అడవుల్లోకి పోయి, అక్కడి ప్రజల పైశాచి భాషను నేర్చుకొని, ఆ భాషలో బృహత్కథను రాశాడని కథనం. ఆ పైశాచి భాష అప్పుడు తెలంగాణలో ఉండేదా అనే విషయం చూద్దాం.
ఎందుకంటే, శాతవాహన రాజుల తొలి రాజధాని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో గోదావరి నది కుడిపక్కన ఉన్న కోటిలింగాల. పడమటి దిక్కు రాజ్యం విస్తరించిన తర్వాత కోటిలింగాల నుంచి తమ రాజధానిని మహారాష్ట్రలో గోదావరి ఒడ్డునున్న ప్రతిష్టానపురానికి మార్చారు. వారి రాజాస్థానాల్లో ఉన్న గుణాఢ్యుడు ఈ ప్రాంతీయుడు అయ్యే అవకాశం మెండుగా ఉన్నది. అందుకు ఆధారాలను వెతుకుదాం.
బృహత్కథ ఏడు వంతులు నష్టమైపోగా, మిగిలిన ఒక్క భాగాన్ని శాతవాహనుడు రక్షించగా, పైశాచి భాషలో ఉన్నదానిని కొద్దికాలంలోనే క్రీ.శ. 1వ శతాబ్దంలోనే బుద్ధస్వామి సంస్కృతంలోకి ‘బృహత్కథా శ్లోక సంగ్రహం’ పేరిట అనువదించి, అందులో గుణాడ్యుడు దక్షిణ భారతదేశంలో పుట్టాడని, అతని అసలు/మొదటి పేరు ‘మాల్యవతుడు’ అని రాశాడు. బృహత్కథలో పాలక అనే రాజు తన రాజ్యాన్ని విడిచి నీలగిరులకు వెళ్లిపోయాడనే కథ ఉన్నది. ఈ నీలగిరులు (నీల=నల్ల+గిరులు=మలలు), నల్లమలై అనే పేర్లతో మొన్నమొన్నటి వరకు తెలంగాణకు దక్షిణ సరిహద్దులుగా ఉన్న నల్లమల పర్వతాలను పిలిచేవారు. అరవై ఏండ్ల కిందటి వరకు భక్తులు శ్రీశైలం క్షేత్రానికి వెళ్లటానికి ఈ నీలగిరుల/నల్లమలల గుండానే కాలినడకన ప్రయాణించి నీలగంగ రేవు (కృష్ణా నదిని) దాటి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకునేవారు. కనుక మాల్యవత (మలై పర్వత నివాసి) పేరు గల గుణాడ్యుడు ఈ నల్లమలై ప్రాంతీయుడే అయ్యుండాలి.
‘నేపాలీ మహాత్మ్యం’ అనే గ్రంథం గుణాఢ్యుడు గోదావరి తీర ప్రతిష్టానపుర రాజ్యంలోని మదురలో జన్మించాడని ప్రస్తావించింది. ప్రతిష్టానపుర (శాతవాహనుల) రాజ్యం తొలి రాజధాని కోటిలింగాల గోదావరి తీరంపైనే ఉన్నది. దీనికి ఆవలి తీరం వైపు మదుర అనే పేరున్న గోండు-కోలం గిరిజనుల గ్రామం ఇప్పటికీ అదే పేరుతో ఉన్నది. గుణాఢ్యుడు శివ గణ అవతారుడని, అతనికి కనకభూతి అనే మరొక శివ (యక్ష) గణ వ్యక్తి బృహత్కథను పైశాచి భాషలో చెప్పాడని బృహత్కథలో ఉన్నది. ఇప్పటికీ ఈ గోండులు మదుర ప్రాంతంలో శివుడిని సిద్ధేశ్వరుడు, మహదు (మహాదేవుడు) అనే పేరుతో పూజిస్తారు. శివమెత్తేవాళ్లను ‘గణ’ బాల అంటారు. ఇప్పటికీ ఇలాంటి గణ బాలలు శివమెత్తిన తరువాత పురాణ గాథలను చెప్తారు.
గోండుల పురాణ గాథలను చెప్పే ఉప కులాలను పర్ధానులు, తోటీలు అంటారు. ఇదే ప్రాంతంలో ఇప్పటికీ కనక వంశస్థులు, భూతి వంశస్థులు ఉన్నారు. దండి పైశాచి భాషను ‘భూత భాష’ అన్నాడు. కనక అనే దేవతను కూడా గోదావరికి ఉత్తర తీరాన ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు (ఇటీవల కాలంలో) కొలుస్తున్నారు.
గోదావరి ఉపనది ఐన సోనాలవాగు మధ్యలో ఉన్న జలదుర్గంలో కనక దేవత (కనకాయి)ను ఇప్పటికీ ఈ ప్రాంత ఆంధ్ తదితర గిరిజనులు కొలుస్తున్నారు. ఆంధ్ (సంస్కృతంలో ఆంధ్ర) జాతి శాతవాహనులే శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించటం గమనార్హం. వీరు ఇప్పటికీ సిర్రాల్ సాత్వాన్ (శ్రీ హాల శాతవాహన) పేరిట ఏటా పండుగ జరుపుతారు. హాల శాతవాహనుడే గుణాడ్యుని పోషకుడు. ధర్మపురి క్షేత్రానికి ఎదురుగా గోదావరి ఒడ్డున ఉన్న పద్మలపురి ‘కాఁకో’ (కనక అపభ్రంశం) దేవతను ఇప్పటికీ ఏటా గోండులు ఆరాధిస్తున్నారు. కనక దేవతను కనకమ్మ అని, బంగారమ్మ అని బాసర ప్రాంతీయులు పూజిస్తున్నారు. బాసర ప్రాంతంలోని కనకమ్మకు వేములవాడ చాళుక్యులు, కాకతీయుల కాలంలో గొప్ప ఆలయ మండపాలను నిర్మించారు.
బృహత్కథను అనుసరించి శూద్రకుడు రాసిన ‘మృచ్ఛకటికం’లో పాలక అనే రాజు తన రాజ్యాన్ని గోపాలుని కొడుకైన ఆర్యక్కు ఇస్తాడు. ఈ ఆర్యక్ వంశీయులైన కోలం గిరిజనులు తమ తొలి రాజు అయిన ఆర్యక్ను ఇప్పటికీ పెద్ద (భీమ) అయ్యక్గా ఆరాధిస్తారు. ఆర్యక్/అయ్యక్ చారుదత్త అనే వ్యాపారికి బేల నది ఒడ్డున ఒక జాగీరు ఇచ్చాడు. ఈ బేల నది కూడా ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గోదావరికి ఉపనదిగా పారుతున్నది. ఈ మండలంలో ఇప్పటికీ ఆర్యక్ తండ్రి గోపాల పేరుతో ఉన్న గోవారీలు గోండు గిరిజనుల గోపాలకులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘మృచ్ఛకటికం’ దక్షిణాది మ్లేచ్ఛుల భాషల్లో ఖాతిని ప్రస్తావించింది. ఈ ఖాతి భాషను మాట్లాడే కమ్మర పని చేసే జాతి (ఖాతీలు) ఇప్పటికీ గోండు గిరిజనులకు అనుబంధంగా కులవృత్తి పనులు చేస్తున్నారు.
ఇలా ఉత్తర తెలంగాణ/కోటిలింగాల ప్రాంతంలో పారే గోదావరి ఎడమ ఒడ్డున ఉన్న వింధ్య సాత్పుర అడవుల్లో జీవించి, ఇప్పటికీ జీవిస్తున్న ఆంధ్, గోండు, కోలం, పర్ధాన్, తోటి తదితర గిరిజనుల భాషనే శాతవాహనుల కాలం నాటి పైశాచి భాష అని, ఆ భాషలో వారు చెప్పిన బృహత్కథనే గుణాఢ్యుడు
రాశాడని స్పష్టంగా చెప్పవచ్చు.
కొసమెరుపు ఏమిటంటే, ఇప్పటికీ పర్ధాన్, తోటి గిరిజనులు గులకరాళ్ల సహాయంతో ఆయా గాథా భాగాలను గుర్తు తెచ్చుకుంటూ బృహత్కథలను చెప్తారు. అలాంటి ఒక కథను వెడ్మ రాము అనే తోటి గిరిజనుడు చెప్పగా మైఖేల్ యార్క్ అనే లండన్ పరిశోధకుడు చిత్రీకరించి నాలుగున్నర దశాబ్దాల కిందటే ప్రఖ్యాత బీబీసీ చానల్లో ప్రసారం చేశాడు. పైశాచిని ఒక రకమైన ప్రాకృత భాష అని, రాక్షసుల భాష అని, భూత భాష అని, కొన్ని అపభ్రంశాల వంటి అనాగరిక భాష అని అన్నారని, హేమచంద్రుడు వంటి వ్యాకరణకారులు చూలికా పైశాచి అని, పైశాచి భాషలో ఒక ఉప భేదం కూడా ఉన్నదని ప్రస్తావించాడని తెలుస్తున్నది. దీని ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, పరుషముల స్థానంలో సరళముల వినియోగం-ఉదాహరణకు: తామోతర = దామోదర. చూలికా పైశాచిలో: నకర = నగర, రాచ = రాజ, ఖమ్మ = ఘర్మ, కంతప్ప = కందర్ప, ణ – న, ళ – ల అవుతాయి. య మాత్రం అలాగే ఉంటుంది. మధ్య అచ్చుల మధ్యలో ఉన్న వ్యంజనాలు తొలగించరు. మహాప్రాణాలుగా మారవు; మాగధీ, ఇతర భాషల్లో ప్రారంభ దశలో కనిపించినట్లు జ్ఞ్, న్య్ – జ్ఞ్య గా మారుతాయి.
శాహ్బాజ్ఘఢీ శాసనం ఈ భాషతో అనేక లక్షణాల్లో సారూప్యత కలిగి ఉండటంతో కొంతమంది పండితులు చూలికా పైశాచి వాయువ్య భారతదేశంలోని ఒక భాషా భేదమని భావించారు. సర్ జార్జ్ గ్రియర్సన్ దీనిని హిందూకుష్ ప్రాంతంలోని దార్ద్, కాఫిర్ భాషలతో (ఉదాహరణకు షీనా, కాశ్మీరీలోని ఉపస్థరంతో) సంబంధం కలిగి ఉందని సూచించాడు. మరోవైపు గుణాఢ్యుడు దక్షిణ భారతీయుడని అంగీకరించారు. ణ న మార్పులు ద్రావిడ ప్రభావాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తాయి. ఇతర లక్షణాలు మధ్య త్, య్ నిలిచి ఉండటం ప్రాచీన లక్షణాలుగా భావిస్తారు.
ఆర్య భాషా ప్రాంత సరిహద్దుల్లో ఉండే ఇటువంటి భాషాభేదాలు, ఆర్య భాష వ్యాప్తి కొనసాగుతున్న కొద్దీ తప్పనిసరిగా కనుమరుగైపోతాయి. అందువల్ల మూల పైశాచి చూలికా భాషను మాట్లాడిన రాక్షసులు (యక్షులు, నాగరికులు = ఈనాటి గిరిజనులు) వింధ్య పర్వత ప్రాంతానికి చెందినవారై ఉండటం కూడా సాధ్యమే, కాశ్మీర్ ప్రాంతంలోని నరమాంస భక్షకులు కావటం కూడా సాధ్యమే. కనుక ఈ పైశాచి భాషను వాయువ్య భారతదేశంలో, వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న తెలంగాణలోనూ గిరిజనులు రెండు వేల సంవత్సరాలకు పూర్వం మాట్లాడిన భాష అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. అధికార భాష, మెజారిటీ భాష వ్యవహారం నిమిత్తం తక్కువ మంది మాట్లాడే (గిరిజన) భాషలను చంపేస్తాయి. అలా ఇప్పుడు కోయ, కోలం, బంజారా భాషలు కనుమరుగవుతుండటం చూస్తున్నాం.
– డా. ద్యావనపల్లి సత్యనారాయణ
9490957078