2023, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణమెవరు? కాంగ్రెస్ నాయకుల కష్టమా?లేక మత, కుల సమీకరణాలా? కానే, కాదు.. నిరుద్యోగ యువతే కాంగ్రెస్ గెలుపునకు కారణం. కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని విస్మరించింది. ఈ విస్మరణే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను కష్టాల్లోకి నెడుతుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల పోరాటమే రాష్ట్రం ఏర్పాటుకు మూలమని అందరికీ తెలుసు. అదే స్ఫూర్తి ఆ ఎన్నికల్లో కూడా కనిపించింది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల వంటి శక్తివంతమైన విద్యార్థి కేంద్రాలు కాంగ్రెస్‌కు మద్దతుగా మారాయి. అదే సమయంలో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ విడుదల చేసి వారికి బలమైన నమ్మకం కల్పించింది. అందులోని హామీలను చూసి విద్యార్థులు, నిరుద్యోగులు సంతోషపడ్డారు. ఫలితంగా పెద్దఎత్తున కాంగ్రెస్ వైపు మద్దతు మళ్లింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా ఒక్క అడుగూ వేయలేదు. మెగా డీఎస్సీ ఎప్పుడనే విషయంపై క్లారిటీ లేదు. గ్రూప్-1, గ్రూప్-2 ప్రక్రియ నిలిచిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది? విద్యార్థులు హాస్టళ్లలో నేలపై నిద్రిస్తూ, పాడైన భోజనం తింటుంటే, నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తూ ఉంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రభుత్వ బంగ్లాలు, అధికారం ఇచ్చే విలాసాలు, కొత్త వాహనాలు, స్పెషల్ భద్రత వంటి భోగ భాగ్యాలు అనుభవిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ అనగానే మొదట గుర్తొచ్చేది తెలంగాణ ఆత్మగౌరవం. విద్యార్థుల కళ్లలోంచి జారిన ప్రతి కన్నీటి బిందువు తెలంగాణ ఉద్యమాన్ని రగిలించింది. ఉద్యమానికి పునాది వేసింది ఓయూ విద్యార్థి గళమే. ఈ రోజు కూడా అదే గళం మళ్లీ గర్జిస్తున్నది. కానీ, ఈసారి స్వరాష్ట్రంలో మన వాళ్లే మోసం చేస్తున్నారని. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరిట ఆకాశాన్నంటిన హామీలు ఇచ్చింది. కానీ, వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు.
1. విద్యాశాఖ మంత్రి ఎక్కడ?
2. జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
3. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?
4. మెగా డీఎస్సీ ఎప్పుడు?
5. గ్రూప్-1, గ్రూప్-2 కొలువుల భర్తీ ఎప్పుడు?
6. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడ?
7. నిరుద్యోగ భృతి ఎక్కడ?
8. విద్యార్థినులకు స్కూటీలు ఏవీ?
9. పెండింగ్ ఫీరీయింబర్స్మెంట్,
స్కాలర్షిప్స్ ఎక్కడ?
10. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఏవీ?
11. పదవ తరగతి పూర్తిచేసినవారికి రూ.10 వేలు, ఇంటర్‌కి రూ.20 వేలు, డిగ్రీకి రూ.50 వేలు, పీజీకి రూ.లక్ష, పీహెచ్‌డీకి రూ.5 లక్షలు ఎక్కడ?
12. ఫ్రీ వైఫై ఎక్కడ?
13. యూనివర్సిటీల్లో అధ్యాపక
నియామకాలు ఎప్పుడు?
14. నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?
15. సివిల్స్ కోచింగ్ ఎక్కడ?
16. మెస్ బకాయిల మాఫీ ఎప్పుడు?
17. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎక్కడ?
18. ఉద్యమకారుల కుటుంబాలకు
400 గజాల భూమి ఏదీ?
19. వారికి ఉద్యోగం, రూ.25 వేల పెన్షన్ ఎక్కడ?
20. విద్యాశాఖ మీద రివ్యూ ఎన్నడు?
తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఉద్యోగ కల కోసం రాత్రింబవళ్లు చదివే యువత, నేడు ప్రభుత్వం చేతుల్లో మోసపోయిన వర్గంగా మారిపోయింది. ఉద్యమ కాలంలో యువత ప్రాణాలు త్యాగం చేసింది. ఆ త్యాగాల జ్ఞాపకాలు ఉన్న హాస్టల్ బ్లాకులను కొత్తగా కట్టినట్టుగా రంగులు వేసి ఓపెన్ చేయడం మాకు గర్వం కాదు. అలాగే గత ప్రభుత్వ హయాంలో కట్టిన వసతి గృహాలను ఈ రోజు కొత్తగా ప్రారంభించడం మూర్ఖత్వం, అవమానకరం. విద్యార్థి అనగానే అడ్డా మీద కూలీ అని చెప్పిన వ్యక్తి ఈ రోజు విద్యాశాఖ మంత్రి అవ్వడం, విద్యార్థి మనసుకు గాయం. కాంగ్రెస్ కేవలం నిరుద్యోగులను కాదు, అన్ని వర్గాలను మోసం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విద్యార్థుల జేబులు ఖాళీ చేశాయి. ఉద్యమకారుల కుటుంబాలకు హామీ ఇచ్చిన 400 గజాల స్థలం, రూ.25,000 పెన్షన్ ఇంకా కలగానే ఉంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలు, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ ఇప్పటికీ చేపట్టలేదు. సివిల్స్ కోచింగ్, ఓవర్సీస్ స్కాలర్షిప్ మాటలకే పరిమితమైంది. ఓయూ నుంచి తెలంగాణ పుట్టింది. ఈ రోజు కూడా ఓయూ విద్యార్థుల గళమే, మోసపోయిన ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది. ‘మా భవిష్యత్తు ఎక్కడ? మా కలలు ఎక్కడ?’ అని ఓయూ ప్రశ్నిస్తున్నది. ఈ ప్రశ్న కేవలం ఓయూ విద్యార్థులది కాదు, ఇది యావత్ తెలంగాణ యువత ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా వేస్తున్న ప్రశ్న. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ? విద్యార్థుల కలలు ఎక్కడ? 30 లక్షల నిరుద్యోగుల భవిష్యత్తు ఎక్కడ? ఓయూ గళాన్ని మీరు వినకపోతే మరో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడటం ఖాయం. ఒక సామాన్య విద్యార్థిగా, ఒక నిరుద్యోగి హృదయంతో, ఒక ఉద్యమకారుడి తపనతో ఓయూ అడుగుతున్నది. జవాబు ఎక్కడ? ఇది ప్రశ్న కాదు, గర్జన. ఇది మౌనం కాదు, మేల్కొలుపు. ఇది ఒక కొత్త ఉద్యమానికి నాంది.
తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు హామీలను ఎగ్గొట్టి, ఆశలను తుంచేసింది. అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంగా పేరుగాంచింది. ఈ నేపథ్యంలో ఓయూ గోడలపై విద్యార్థి గుండెల్లో మార్మోగుతున్న ప్రశ్నలు కేవలం నినాదాలు కావు. ఇవి 30 లక్షల నిరుద్యోగుల గుండెల్లో రగిలే మంటలు. ఇది విద్యార్థుల కన్నీళ్లలోంచి పుట్టిన సత్య గళం. కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చామని చెప్పడం కాదు. ఉద్యమకారుల విశ్వవిద్యాలయాన్ని రంగులు వేసి మోసం చేయడం కాదు. ఈ రోజు కూడా విద్యార్థుల నోటి నుంచి ఒకే మాట వినిపిస్తున్నది. ‘మా పోరాటం వృథా కాలేదు, కానీ, ఈ మోసపు పాలనకు ముగింపు పలకాల్సిందే!’ ఒకసారి ఓయూ ఉద్యమాన్ని రగిలిస్తే అది విశ్వవిద్యాలయంలోనే కాదు, యావత్ తెలంగాణ గుండెల్లో జ్వాలలు రగిలిస్తుంది. ఈ రోజు కూడా అదే జరుగుతున్నది. తెలంగాణ యువత గర్జిస్తున్నది. మోసపు హామీలకు ఇక మేం బలి కావాలని అనుకోవడం లేదు! ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టాలి. అప్పుడే ఈ విద్యార్థి లోకం క్షమిస్తది. లేదు, పోలీస్ బలగాన్ని వెంటపెట్టుకొని వస్తామంటే మాత్రం చరిత్ర క్షమించలేని మూర్ఖులుగా మిగిలిపోతారు.